News

Realestate News

ప్రథమ ధరావతు రుసుం రూ.2.5వేలు

EAD should be collected from eligible people for LIG in visakhapatnam news image

ఎల్‌ఐజీ స్థలాల దరఖాస్తుతోపాటు కట్టాల్సిన మొత్తమిది
లాటరీలో ఎంపిక అవకపోతే ఆ మొత్తం వాపసు
ఈనాడు – విశాఖపట్నం

విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజీ) కోసం కేటాయించే ఇళ్ల స్థలాలకు దరఖాస్తుదారుల నుంచి ప్రథమ ధరావతు రుసుం (ఈఎండీ) వసూలు చేయాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. ఈ ప్లాట్ల కోసం ఎక్కువ మంది ముందుకొచ్చే అవకాశం ఉందన్న అంచనాతో వీరిని నిరోధించేందుకే ఈఎండీని ప్రవేశపెడుతున్నాయి. ఒక్కో దరఖాస్తుదారు నుంచి రూ. 25 వేల చొప్పున ఈఎండీ వసూలు చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నది.

ప్రయివేట్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన దాకమర్రి లేఅవుట్‌లో వుడా వాటా కింద వచ్చిన 172 ఎల్‌ఐజీ ప్లాట్లను మధ్య తరగతి కుటుంబాలకు లాటరీ పద్ధతిలో కేటాయించాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసిన యంత్రాంగం వచ్చే నెల 12న అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. చాలా ఏళ్ల తరువాత వుడా ఇళ్ల స్థలాల కోసం లాటరీ విధానాన్ని అమలు చేయడంతో ఎక్కువమంది దీనిపై దృష్టి సారించారు. ప్రత్యేకించి మధ్య తరగతి కుటుంబాలు ఆసక్తిగా ఉన్నాయి. దరఖాస్తు చేసేందుకు మొదట తెలుపు రేషన్‌ కార్డు అర్హతగా నిర్ణయించినా, తరువాత మళ్లీ వార్షికాదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల్లోపు ఉన్న కుటుంబాలన్నీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం తహసిల్దారు నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందని సూచించారు. దీంతో చాలామంది ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వుడా అధికార వర్గాలకు అందిన తాజా సమాచారం ప్రకారం ఎల్‌ఐజీ ప్లాట్లకు మధ్య తరగతి కుటుంబాల నుంచి భారీ స్పందన లభించే అవకాశం ఉంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే దరఖాస్తుతోపాటు ఈఎండీ వసూలు చేయాలని నిర్ణయించారు. అధికార వర్గాల మధ్య చర్చల తరువాత ఈఎండీ రూ. 25 వేలుగా వుడా నిర్ణయించింది. ఎల్‌ఐజీ ప్లాట్లపై దరఖాస్తు చేసేవారు ఆ సమయంలోనే వుడా ఉపాధ్యక్షుడి పేరుమీద రూ. 25 వేల డిమాండు డ్రాఫ్టు జత చేయాల్సి ఉంటుంది. లాటరీలో ప్లాట్‌ దక్కని దరఖాస్తుదారులకు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. హెచ్‌ఐజీ, ఎంఐజీ ప్లాట్లకు వేలం నిర్వహించిన సందర్భంలోనూ ఈఎండీ విధానాన్ని వుడా అమలు చేసింది. లాటరీలోనూ ఈ పద్ధతిని అమలు చేయడం వల్ల ఇళ్ల స్థలం అవసరమైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.