News

Realestate News

పుష్కరాలకు 840 సర్వీసులు

RTC bus services towards Vijayawada and Krishna District news picture

ఏర్పాట్లపై నేడు ఆర్టీసీ అధికారుల సమావేశం

ద్వారకానగర్‌(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: గోదావరి పుష్కరాలకు ప్రయాణికులను విజయవంతంగా చేరవేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృష్ణా పుష్కరాలకు సన్నద్ధమవుతోంది. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో జిల్లా నుంచి 840 సర్వీసులు నడపడానికి గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సిటీ డిపోలతో పాటు పాడేరు, నర్సీపట్నం డిపోలకు చెందిన మేనేజర్లు, ఇతర అధికారులతో రీజనల్‌ మేనేజర్‌ సుధేష్‌కుమార్‌ సోమవారం నగరంలో సమావేశం కానున్నారు. రోజూ 70 సర్వీసులు చొప్పున 12 రోజులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసి, తర్వాత రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్య పెంచాలని అధికారులు భావిస్తున్నారు. పుష్కరాల్లో నడపడానికి బస్సులను సిద్ధం చేయాలని సంబంధిత డిపో మేనేజర్లకు రీజనల్‌ మేనేజర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌, మెట్రో లగ్జరీ(శీతల బస్సు)లను విజయవాడకు నడపాలని అధికారులు భావిస్తున్నారు.

డ్రాపింగ్‌ మాత్రమే…
గత ఏడాది రాజమహేంద్రవరంలో పుష్కరాల సందర్భంగా ఒకే ప్రాంతానికి చెందినవారు 40 మంది వరకూ ఉంటే రాకపోకలకు ఆర్టీసీ సంస్థ ప్రత్యేకంగా బస్సులను సమకూర్చింది. అయితే విజయవాడ కృష్ణా పుష్కరాలకు ఆ పరిస్థితి ఉండదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎక్కువ దూరం కావడంతో సమయానికి బస్సులు రాకపోతే ఇబ్బంది పడతామని, అయితే నగరం నుంచి విజయవాడ వెళ్లడానికి బస్సులు బుక్‌ చేసుకోవచ్చని, ప్రయాణికులు కోరిన ప్రాంతం నుంచి తీసుకెళ్తారని, తిరిగి తీసుకురావడం కుదరదన్నారు. విజయవాడలో ఉండే అధికారులు 40 మంది కంటే అధికంగా ఉంటే అక్కడి నుంచి నగరానికి బస్సును ప్రత్యేకంగా పంపించనున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందుల వల్ల ఒకవైపు మాత్రమే అనుమతించనున్నారు. బస్సు ఛార్జీలు సాధారణంగానే ఉండే అవకాశాలున్నాయి. త్వరలోనే ఆయా వివరాలను రీజనల్‌ మేనేజర్‌ సుధేష్‌కుమార్‌ తెలియజేయనున్నారు.