News

Realestate News

పారిశ్రామిక అభివృద్ధికి వూతం

Atchutapuram Real Estate

ఏపీఐఐసీకి అదనపు భూములకేటాయింపు
1210ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం

పారిశ్రామిక ప్రగతికి అదనపు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపు చర్యలను వేగవంతం చేసింది. పరిశ్రమలకు ఏకగవాక్ష పద్ధతి ద్వారా అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేక ఆర్థికమండలి కోసం గతంలో సేకరించిన అటవీ, డి-ఫారం, చెరువులు, గెడ్డలకు సంబంధించిన భూములను అవసరమైన బదలాయింపు మార్పులను చేపట్టి ఏపీఐఐసీకి కేటాయించింది. రెండు రోజుల క్రితం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం స్థానిక సెజ్‌కి సంబంధించిన భూములు కేటాయింపు నిర్ణయం కూడా తీసుకొంది. వివిధ ప్రాజెక్టులకు అవసరమైన 1210 ఎకరాల భూములను ఏపీఐఐసీకి బదలాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

చ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో 2004లో అప్పటి ప్రభుత్వం 9278 ఎకరా భూమిని ప్రత్యేక ఆర్థికమండలి కోసం కేటాయించింది. తర్వాత ఈ భూములు సరిపోకపోవడం, ప్రత్యేక ఆర్థిక మండలిలో ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడంతో 2200 ఎకరాల భూమిని నాన్‌ సెజ్‌ కింద డీనోటిఫై చేస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు 1200 ఎకరాల పరిధిలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఎన్‌టీపీసీ రావడం దీనికి మళ్లీ అదనంగా భూమి కావాల్సి రావడంతో ప్రభుత్వం మళ్లీ రాంబిల్లి మండలంలోని చాటిమెట్ట, లాలంకోడూరు గ్రామాల పరిధిలో ఉప్పు గల్లీలను సేకరించడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతోపాటు దిబ్బపాలెం, వెదురువాడ, మార్టూరు పరిధిలో పునరావాస కాలనీ అభివృద్ధికి కూడా అదనపు భూములు కేటాయించింది.

పునరావాస కాలనీల అభివృద్ధికి తొలగిన ఇబ్బందులు
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో 5600 కుటుంబాలకు పునరావాస కాలనీ అభివృద్ధి చేసిన ఏపీఐఐసీ అధికారులకు వెదురువాడలో కోర్టు కేసుల రూపంలో పలుసమస్యలు ఎదురయ్యాయి. వీటిలో కొన్నింటిని స్థానికంగా పరిష్కరించిన అధికారులు మిగిలినవి కోర్టుల ద్వారా పరిష్కరించారు. ముఖ్యమంత్రి స్థాయిలోనే పునరావాస కల్పనకు ఆటంకాలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌, జేసీ నివాస్‌లను ఆదేశించడంతో వారే స్వయంగా రంగంలోకి స్థానిక నేతల సహకారంతో చాలా కేసులు పరిష్కరించారు. దీంతో వెదురువాడలోనే 114 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతోపాటు దిబ్బపాలెం సెజ్‌ కాలనీ అభివృద్ధి చేయడానికి కూడా మార్టూరులో పరిధిలో 117 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వం చర్యలతో పునరావాస కాలనీల అభివృద్ధికి ’ఆటంకంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించినట్లయింది.

కంపెనీల నిర్మాణం వేగవంతం
పేరుకు పన్నెండేళ్ల క్రితం సెజ్‌ని ఏర్పాటుచేసినా కంపెనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో అప్పటి ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా వ్యవహరించింది. తెదేపా ప్రభుత్వం కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీలు ఏర్పాటు వేగవంతమైంది. దీనిలో భాగంగానే ఎన్‌టీపీసీకి అదనంగా 700 ఎకరాలు కేటాయించడానికి నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది. దీంతోపాటు జడ్‌.చింతువ, చాటిమెట్ట, లాలంకోడూరు పరిధిలో 19.56 ఎకరాల భూమిని కేటాయించింది.
దీంతోపాటు జంగులూరు పరిధిలో 373 ఎకరాల భూబదలాయింపు చర్యలు తీసుకొంది. దీంతో కంపెనీల ఏర్పాటుకు ఉన్న అవాంతరాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి.

పునరావాస సమస్యలు పూర్తిగా తొలగినట్లే…
12 ఏళ్లగా పునరావాస కాలనీని సమస్యలు వీడడం లేదు. జిల్లా కలెక్టర్‌ కాలనీని దత్తత తీసుకోవడంతో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు కాలనీ అభివృద్ధికి అవసరమైన భూములను కూడా ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన అభివృద్ధి పనులు కూడా వేగంగా నిర్వహించాలి.

– బైలపూడి రాందాసు, నిర్వాసితుల కాలనీ, దిబ్బపాలెం

భూమిని బదలాయిస్తూ ప్రభుత్వ నిర్ణయం
ప్రత్యేక ఆర్థికమండలి సమస్యల్లో ఉన్న ఒక్కొక్క సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుంది. తాజా నిర్ణయంతో దాదాపు సెజ్‌లోని సమస్యలన్నీ పరిష్కరించిన్నట్లే. వెదురువాడ, దిబ్బపాలెం కాలనీలో ఉన్న భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. దీంతోపాటు సెజ్‌కి బదిలీ కావాల్సిన చెరువు, గెడ్డ, అటవీ భూములను బదలాయిస్తూ నిర్ణయం తీసుకొంది.

– యతిరాజు, ఏపీఐఐసీ అధికారి, అచ్యుతాపురం