News

Realestate News

పారిశ్రామికవేత్తల్లో హర్షాతిరేకాలు

Elamancililo Rs. Crore development works

పారిశ్రామికవేత్తల్లో హర్షాతిరేకాలు
ఈనాడు – విశాఖపట్నం
వెనుకబడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పారిశ్రామిక పన్ను రాయితీలిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి శుక్రవారం సాయంత్రం చేసిన ప్రకటనతో విశాఖ జిల్లాలో పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 10,500 సూక్ష్మ, మధ్యతరహా, భారీ కర్మాగారాలు, సంస్థలు ఇప్పటికే సుమారు రూ. 80 వేల కోట్లకు పైగా పెట్టబడులు పెట్టాయి. మరో 300లకు పైగా సంస్థలు వివిధ ప్రాంతాల్లో రూ. 40 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి అనుమతులు పొందాయి. కేంద్రం పన్ను రాయితీలను ప్రకటించడం మంచి అవకాశంగా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. తరుగుదలపై 15 శాతం అదనపు రాయితీ ఇవ్వటం వల్ల పారిశ్రామిక సంస్థల లాభశాతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పన్ను విధానంలో ప్రతి పరికరానికీ నిర్ణీత శాతం తరుగుదల ఉంది. దీనికి అదనంగా 15 శాతం తరుగుదల కల్పించడం వల్ల తక్కువ సమయంలోనే ఆ పరికరంపై ఎక్కువ తరుగుదలను చూపించి నగదు నిల్వల పరిస్థితిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

పెట్టుబడి రాయితీతో భారీగా పెట్టుబడులు…
పెట్టుబడి రాయితీ అంశం నగరాభివృద్ధిని మలుపు తిప్పుతుందని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. చాలా పారిశ్రామిక సంస్థలు తమకు వచ్చిన లాభాలపై పన్నులు చెల్లించాలి. పెట్టుబడి రాయితీ ఉన్న కొండప్రాంతాలు, రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే ఆ మొత్తాన్ని లాభం నుంచి పూర్తిగా మినహాయించుకోవచ్చు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించే బదులు లాభాల్లో 15 శాతానికి సమానమైన మొత్తాన్ని ఏపీలోని వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పారిశ్రామిక సంస్థలకు అనుకూలమైన విశాఖలో భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖ – చెన్నై పారిశ్రామిక నడవా ప్రాంతానికి భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా. నగరంలో పెట్టుబడులు పెట్టడానికి భాగస్వామ్య సదస్సులో పలు ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. ఆయా సంస్థలు విశాఖలో తమతమ సంస్థలను స్థాపించే ప్రక్రియను వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు.

విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది
– జి.శివ్‌కుమర్‌, రాష్ట్ర అధ్యక్షుడు, సి.ఐ.ఐ.
కేంద్రం తాజా ప్రకటనతో విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రూ. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడిపై పన్ను రాయితీ కారణంగా ప్రస్తుతం ఉన్న పలు సంస్థలు వాటి సామర్థ్యాన్ని విస్తరించుకోవడానికి, నూతన రంగాల్లోకి విస్తరించడానికి అవసరమైన పెట్టుబడిని ఆయా సంస్థల లాభాల్లోంచి 15 శాతం చొప్పున కేటాయించుకోవచ్చు. ఫలితంగా వాటిపై ఆర్థిక భారం బాగా తగ్గినట్లవుతుంది. కొత్త సంస్థల ఏర్పాటుతో వేలాదిమందికి ఉద్యోగాలొస్తాయి.

పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర బిందువు
-జి.సాంబశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ
కేంద్రం ప్రకటించిన తాజా పన్ను రాయితీలతో నగరం పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుంది. ఇంచుమించు అన్ని పారిశ్రామిక సంస్థలు తరుగుదలను ఉపయోగించుకుంటూనే ఉంటాయి. 15శాతం అదనపు తరుగుదలను చూపించుకునే అవకాశం ఉండడంతో అన్ని సంస్థల్లో కొంత సొమ్ము మిగుల్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. కొత్తపెట్టుబడులు పెట్టాలనుకున్నవారికి పెట్టుబడి రాయితీ ఉపయుక్తంగా ఉంటుంది.