News

Realestate News

పల్లె నుంచి అంతర్జాతీయస్థాయికి..

vizag real estate news

పల్లె నుంచి అంతర్జాతీయస్థాయికి..
ఆత్మరక్షణ విద్యల్లో గ్రామీణ యువకుడి ప్రతిభ
చిన్నప్పటి నుంచి క్రీడలన్నా.. సినిమా రంగం అన్నా ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తే ఒక సాధారణ గ్రామీణ యువకుడిగా ఉన్న ఆయన్ని అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా, చలనచిత్ర రంగంలో నటుడిగా నిలిపింది.

– నెల్లిమర్ల, న్యూస్‌టుడే

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేట ప్రాంతానికి చెందిన కాళ్ల మహేష్‌ పదో తరగతే చదువుకున్నా తన అభిలాష మేరకు ప్రయత్నాలు చేసి ఆత్మరక్షణ విద్యలో అంతర్జాతీయఖ్యాతి పొందారు. తైక్వాండో, కరాటేల్లో నైపుణ్యాలు సాధించారు. * విశాఖపట్నంలోని 1994లో జాతీయస్థాయి పవర్‌కిక్‌ కరాటే పోటీల్లో, 1995 సంవత్సరంలో విశాఖలో షాడో అకాడమీ కిక్‌బాక్సింగ్‌లో, బుల్లయ్య కళాశాల బాక్సింగ్‌ మీట్‌లో, అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో విజేతగా నిలిచారు. * 1996 నుంచి 2002 వరకు పలు జాతీయ అంతర్జాతీయ వేదికల్లో విజయదుంధుబి మోగించారు. * 2003 నుంచి 2014 వరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగిన కరాటే, తైక్వాండో, కుంగ్‌ఫూ, బాక్సింగ్‌, కిక్‌బాక్సింగ్‌ పోటిల్లో రిఫరీగా వ్యవహరించాడు. * 2015లో అంతర్జాతీయ కిక్‌బాక్సింగ్‌ రిఫరీగా వ్యవహరించాడు. * 2016లో అంతర్జాతీయస్థాయి గ్రాండ్‌మాస్టర్‌ అయిదో డాన్‌ బ్లాక్‌బెల్ట్‌ పోటీల్లో ఎఒన్‌ గ్రేడ్‌ కైవశం చేసుకున్నారు.

సినీరంగంలోనూ ప్రవేశం
మహేష్‌కు క్రీడలతో పాటు సినిమాలన్నా, వాటిలో నటించాలనే ఉత్సాహం అధికంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో బృందావనంలో 24 జంటలు, లవ్‌ 60, న్యాయపోరాటం, పంచ్‌, వూరికి మొనగాళ్లు సినిమాల్లో నటించారు. కొన్ని సన్నివేశాలకు ఫైట్‌మాస్టరుగానూ వ్యవహరించారు.

వ్యవసాయ రంగంలో కృషి..
క్రీడలు, సినిమా రంగాల్లోనే కాకుండా మహేష్‌కు వ్యవసాయ రంగంలోనై మంచి నైపుణ్యాలున్నాయి. ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులను పండించారు ఆయన. నెల్లిమర్ల మండలంలో వ్యవసాయాధికారుల ప్రోత్సాహంతో మొదటిసారిగా డ్రమ్‌సీడర్‌ విధానం ద్వారా శ్రీవరి సాగు చేశారు. 2016లో కొత్తగా మధుమేహ రోగులు తినేందుకు వీలుగా వరి విత్తనాలను సాగుచేస్తున్నారు. క్రీడల్లో.. సినీరంగంలో.. వ్యవసాయంలో ప్రావీణ్యమున్న మహేష్‌ మాట్లాడుతూ.. ఆసక్తే తనను ఇంత వరకు తీసుకొచ్చిందన్నారు. కఠోరసాధన విజయానికి చేరువ చేస్తుందన్నారు.