News

Realestate News

గిరిప్రదక్షిణ ఉత్సవంలో విశేషాలు

vizag 2016 realestate news

అడివివరం, న్యూస్‌టుడే:
మాయమైన దారులు… ఇరుక్కున్న వాహనాలు

గిరి పౌర్ణమి ఉత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహాచలం పరిసరాలు భక్తజన ప్రవాహాన్ని తలపించాయి. గోశాల కూడలి మొదలుకొని అడివివరం ప్రధాన రహదారి, తొలిపావంచా, సింహగిరి మెట్లమార్గం, సింహాచలం కొండ ప్రాంతాలు ఇసుకేసినా రాలనంత భక్త సందోహంతో నిండిపోయాయి. భక్తులతో నిండిపోయిన రహదారులు కనిపించకుండా పోయాయి… భక్తుల మధ్యలో ఇరుక్కున్న వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
గోశాల కూడలి వద్ద మంగళవారం వేకువజాము నుంచి విపరీతమైన రద్దీ ఏర్పడింది. అతిపెద్ద కూడలి సైతం భక్తులతో నిండిపోయి చిన్నబోయింది.
గోశాల – గోపాలపట్నం రహదారిలో భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి.
ట్రాఫిక్‌ అంతరాయంతో ఆర్టీసీ బస్సులు నడపడంలో జాప్యం జరిగింది. దీంతో భక్తులు ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది.
గోశాల కూడలి నుంచి సింహాచలం వరకు వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలులేనంతగా భక్తులు బారులుతీరారు.
భక్తుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆటోడ్రైవర్లు అధిక ధరలు వసూలు చేశారు.
సింహగిరిపైకి, కిందకు ఆర్టీసీ నడిపిన బస్సుల్లో భక్తుల నుంచి రూ.5 అదనంగా వసూలు చేసినట్లు భక్తులు పేర్కొన్నారు.
దేవస్థానం బస్సుల్లో భక్తులను ఉచితంగా చేరవేశారు.
స్థానికులు పలుచోట్ల భక్తులకు తాగునీరు పంపిణీ చేశారు.
వేకువజాము నుంచి తొలిపావంచా ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మెట్లమార్గంలో సింహగిరికి బయలుదేశారు.
మెట్లమార్గంలో మధ్యాహ్నం 1గంట వరకు భక్తులు నిరంతరంగా రాకపోకలు సాగించారు.

మెట్లమార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, ఆకాశధార మధ్య ఇరుకైన ప్రాంతంలో కాసేపు భక్తుల రద్దీ ఏర్పడింది. సమాచారం అందుకున్న ఈవో రామచంద్రమోహన్‌ స్పందించి పోలీసులను పంపించి రద్దీని క్రమబద్ధీకరించారు.

మెట్లమార్గంలో వెళ్లిన భక్తులు ఆకాశధార, చాకిధారల్లో పుణ్యస్నానాలు చేశారు.
గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన భక్తులు అలసిపోయి మెట్లమార్గంలో పలుచోట్ల కూర్చుండిపోయి సేదతీరారు.
మెట్లమార్గంలో తాగునీరు అందక భక్తులు ఇబ్బందిపడ్డారు.
భక్తుల రద్దీకి అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో సింహగిరిపై నుంచి పలువురు భక్తులు ఘాట్‌రోడ్డు మార్గంలో నడిచి కిందికి చేరుకున్నారు.
ఈవో రామచంద్రమోహన్‌ రాజగోపురం వద్ద సీసీ కెమెరాల ద్వారా క్యూలైన్ల కదలికలను పరిశీలిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
ఈసారి అన్ని ప్రధాన కూడళ్లు, ప్రాంతాల్లో మైకులు ఏర్పాటు చేసి భక్తులకు సమాచారం అందించారు.
గోశాల కూడలి వద్ద రద్దీ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్‌ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
అధిక సంఖ్యలో సింహగిరికి తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా అధిక శాతం భక్తులు దర్శనాలు చేసుకోకుండానే వెనుదిరిగారు.
దక్షిణ గోపురం మార్గంలో దేవస్థానం రెండు కౌంటర్ల ద్వారా భక్తులకు పొంగలి పంపిణీ చేసింది.
ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత నాయకో దాసుడు భక్త బృందం భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేసింది.
ఆలయ ప్రదక్షిణ సమయంలో స్వామిని దర్శించుకునే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉత్తర, దక్షిణ ద్వారాల వద్ద వంతెనలు ఏర్పాటు చేశారు.
నీలాద్రి గుమ్మం నుంచే భక్తులకు దర్శనాలు కల్పించడంతో అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు.
దేవాలయంలో వైదిక సంప్రదాయం ప్రకారం అర్చకులు అద్వైత సిద్ధాంతకర్త శ్రీమద్రామానుజాచార్యులకు సంబంధించిన ఢిల్లీ విజయోత్సవం ఘనంగా నిర్వహించారు.

స్వామి కరుణించాడు… మేము నడిచాం
అప్పన్న భక్తుల మనోగతం
అడివివరం, న్యూస్‌టుడే: భారమైనా దూర ప్రాంతాల నుంచి తరలివచ్చాం… నడిచే ఓపిక లేకపోయినా… నీవున్నావన్న నమ్మకంతో ధైర్యం చేశాం… నీ కరుణామృతధార మాపై కురిపించావు… ఇంతటి మహా ప్రదక్షిణకు స్ఫూర్తి రగిలించావు… నడిపించే భారం నీదే స్వామి… అంటూ అన్ని వయసుల భక్తులు అప్పన్న స్వామిపై భక్తి తన్మయంతో ఆనంద సాగరంలో తేలియాడారు. తొలిసారి పాల్గొన్న భక్తుల నుంచి ఏళ్లుగా ప్రదక్షిణ పథంలో సాగిపోతున్న భక్తుల వరకు తమ ఆధ్యాత్మిక యాత్రను వివరించారు.

ఇన్నాళ్లకు గిరి ప్రదక్షిణ భాగ్యం కలిగింది
ఎన్నో సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ చేయాలని అనుకున్నాను. రైల్వేలో పనిచేస్తున్న నాకు విధి నిర్వహణ కారణంగా ఆ భాగ్యం ఏనాడు కలగలేదు. అయితే విధుల నుంచి విముక్తి పొందిన నాపై ఇన్నాళ్లకు స్వామి దయచూపాడు. తొలిసారిగా 63ఏళ్ల వయసులో నడిచే ఓపిక లేకపోయినా నాతో గిరి ప్రదక్షిణ చేయించాడు. వచ్చే ఏడాది ఈ అవకాశం ఉంటుందో ఉండదో… ఈ జన్మకు ఈ తృప్తి చాలు.
– రామజోగయ్య, విశ్రాంత రైల్వే ఉద్యోగి
ఓపిక ఉన్నంత వరకు…
నాలో ఓపిక ఉన్నంత వరకు గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని అనుకుంటున్నాను. నడిపించే భారం ఆ స్వామిదే. 55 ఏళ్ల వయసులో 13వ సారి గిరి ప్రదక్షిణ చేశాను. ఇన్నిసార్లు చేసినా ఇంకా తనివి తీరలేదు. వచ్చే ఏడాది వస్తాను. – నాగ సత్యవతి, గాజువాక
అలసటే తెలియలేదు
మా పెద్దల ద్వారా సింహగిరి ప్రదక్షిణ గురించి తెలుసుకున్న ఇప్పటికి నాలుగేళ్లుగా వస్తున్నాం. 32 కిలోమీటర్ల దూరం అందరం కలిసిమెలిసి పాదయాత్ర చేస్తుంటే అలసటే తెలియలేదు. వీలు కుదిరినంత కాలం పాదయాత్రలో పాల్గొనాలని అనుకుంటున్నాం.

– శంకర్‌ బృందం, రాయగడ, ఒడిశా
చందనయాత్రను మించిపోతున్న రద్దీ
ఏళ్లుగా గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని చూస్తున్నాం. ఎప్పుడూ ఇంత రద్దీ లేదు. గతంలో చందనయాత్రనే పెద్ద ఉత్సవంగా భావించేవాళ్లం. ఇప్పుడు అంతకు మించిన జనంతో గిరి ప్రదక్షిణ మరింత పెద్ద ఉత్సవంగా మారిపోతోంది.

– పావని బృందం అడివివరం.

ప్రతి ఏటా వస్తున్నాం…
మాలో కొంత మంది 12ఏళ్లుగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నాం. ప్రతిసారీ మాతో ఒకరు తొలిసారిగా గిరి ప్రదక్షిణకు వస్తున్నారు. ఈసారి కూడా ఒకామె వచ్చారు. అన్నవరం క్షేత్రంలో ఉంటున్నా… అప్పన్న స్వామిపై కూడా మాకు ఎంతో మమకారం. అందుకే దయగల స్వామిని ప్రదక్షిణతో కొలుస్తున్నారు.

– తూ॥గో జిల్లా, అన్నవరం ప్రాంతానికి చెందిన భక్తులు