News

Realestate News

గగన మార్గంలో సింహాచల క్షేత్రదర్శనం

Simhachalam View will be visible for tourists through Helicopter in vizag news image

కైలాసగిరి నుంచి సింహగిరికి రోప్‌ వే
మంత్రి గంటా శ్రీనివాసరావు

సింహాచలం, న్యూస్‌టుడే: దేశ విదేశీ పర్యాటకులకు గగన మార్గంలో హెలికాప్టర్‌ ద్వారా సింహాచలం క్షేత్రాన్ని తిలకించే విధంగా హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం అప్పన్న స్వామి నూతన వంటశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విశాఖ నగరాభివృద్ధిలో భాగంగా హెలీ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కొండ దిగువన కృష్ణాపురం గోశాల వద్ద హెలీప్యాడ్‌ నిర్మించి అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో సింహాచలం, విశాఖ నగరం, భీమిలి, అరకు ప్రాంతాలు చూపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కైలాసగిరి నుంచి సింహగిరిపైకి రోప్‌వే నిర్మాణానికి మళ్లీ ప్రతిపాదనలు చేశామన్నారు. లండన్‌ తరహాలో సింహాచలం దేవస్థానానికి చెందిన 15 ఎకరాల స్థలంలో ఇంటర్నేషనల్‌ పాఠశాల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో మరో విద్యాలయం నిర్మాణం కానున్నట్లు తెలిపారు. సింహాచలం దేవస్థానం బృహత్తర ప్రణాళిక అనుసరించి సింహాచలంలో 2వేల మంది కూర్చునేందుకు అన్ని హంగులతో మెగా కల్యాణ మండపం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ. 2.40కోట్లతో నిర్మించిన వంటశాల పక్కనే మరో రూ. 2.90కోట్లతో రామానుజ కూటము నిర్మాణాన్ని చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రూ. 6కోట్ల వ్యయంతో ఒక మెగావాట్‌ సామర్థ్యం గల సౌర విద్యుత్తు ప్లాంట్‌ నిర్మాణానికి, రూ. 65లక్షలతో కొండ దిగువన తొలిపావంచాను రాతి కట్టడంతో సంప్రదాయ శిల్పకళలతో నిర్మించేందుకు టెండర్లు పిలిచామన్నారు. వరాహ పుష్కరిణిని రూ. 40లక్షలతో అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండు పక్కన 4 డార్మిటరీలతో పాటు రూ. 5.20 కోట్లతో 30 దుకాణాల సముదాయం నిర్మాణానికి, పాత గోశాల సమీపంలో 2.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 8.20 కోట్లతో నాలుగు కల్యాణ మండపాల నిర్మాణానికి అంచనాలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత మంత్రి కప్పస్తంభం ఆలింగనం చేసుకుని అంతరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌, ఈఈ వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.