News

Realestate News

కొత్త ఇల్లు కొంటున్నారా?

VRE news 2016

పెద్ద మొత్తంలో జీవిత బీమా రక్షణ తీసుకోవాలనుకున్నప్పుడు టర్మ్‌ పాలసీలు అందుకు చక్కగా సరిపోతాయి. రుణం తీసుకొని ఇల్లు కొనేవారు తప్పనిసరిగా ఈ పాలసీని పరిశీలించాల్సిన అవసరం ఉంది.

క ఇంటికి యజమానిగా మారడం అంటే.. జీవితంలో ఒక ప్రధాన మైలురాయిని అందుకున్నట్లే. అందుకే, ఇల్లు నిర్మించినప్పుడు/కొన్నప్పుడు.. గృహ ప్రవేశాన్ని గర్వంగా ఒక వేడుకగా నిర్వహించుకుంటారు. ఇంటికోసం అవసరమైన పెట్టుబడి కోసం ఏళ్ల తరబడి కష్టపడతారు. ముందస్తు చెల్లింపు కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకుంటారు. మిగిలిన మొత్తాన్ని రుణంతో సర్దుబాటు చేస్తారు. నెలసరి వాయిదాల చెల్లింపు కోసం కచ్చితమైన ప్రణాళికా వేసుకుంటారు.
ఇక ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచిద్దాం! అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద దూరమైతే.. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేదెవరు? రుణం తీసుకొని ఇల్లు కొంటారు.. మరి, ఆ రుణం కుటుంబ సభ్యులకు భారం అయితే.. అందుకే, రుణం తీసుకునేప్పుడే.. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆదుకునేలా తగిన ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబానికి ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవడంతోపాటు.. ఇంటి రుణం తీరే ఏర్పాటూ చేయాలి.
మనం ఎంతో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నాం. రేపు చూద్దాం! అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే, రుణంతోపాటే.. ‘క్రెడిట్‌ ప్రొటెక్షన్‌ పాలసీ’ లేదా టర్మ్‌ప్లాన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇదే ఎందుకు?
జీవిత బీమా పాలసీల్లో ఎన్నో రకాలున్నాయి. ఇందులో తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ అందించేవి టర్మ్‌ పాలసీలు. పాలసీ వ్యవధిలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. బీమా మొత్తం అందుతుంది. వ్యవధి తీరేంతవరకూ పాలసీదారుడికి ఏం జరగకపోతే చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. అయితే, ఇదే స్థాయిలో ఏ ఇతర రకం పాలసీ తీసుకోవాలన్నా.. అధిక ప్రీమియం చెల్లించాలి. ఈ టర్మ్‌ పాలసీలనే.. తీసుకున్న రుణానికి అనుసంధానిస్తే.. ‘క్రెడిట్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌’ అవుతుంది.
*కొత్త ఇల్లు కొనేందుకు మీరు రుణం తీసుకున్నప్పుడు.. బ్యాంకు లేదా రుణ సంస్థ మీ రుణానికి బీమా పాలసీని జత చేసుకోవాల్సిందిగా సూచిస్తుంటుంది. కేవలం గృహరుణాలకే కాకుండా.. వాహన, విద్యా రుణాలకు కూడా ఈ పాలసీలు తీసుకోవచ్చు.
*రుణ గ్రహీత మరణిస్తే.. మిగిలిన రుణ మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. అందువల్ల రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై ఆ భారం ఉండదు.
*టర్మ్‌ పాలసీ తీసుకునేప్పుడు కేవలం రుణం ఎంత అన్నదే కాకుండా.. పరిశీలించాల్సిన ఇతర అంశాలూ ఉన్నాయి. ఆదాయం ఎంత? కుటుంబ నేపథ్యం, వ్యవధి, బీమా మొత్తాన్ని పెంచుకునే వీలుందాలాంటి వివరాలనూ చూసుకోవాలి.
– సమీర్‌ బన్సాల్‌, డైరెక్టర్‌ బ్యాంకస్సూరెన్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌