News

Realestate News

ఉరకలెత్తిన ఉద్యానం

4

ఉరకలెత్తిన ఉద్యానం
19 శాతం వృద్ధి రేటుతో దూకుడు
ఈ ఏడాది లక్ష్యం 21 శాతం
రూ.13.70 కోట్లతో రైతులకు వూతమిచ్చేందుకు ప్రతిపాదనలు

వ్యవసాయ అనుంబంధ రంగాల్లో ఉద్యాన శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. జిల్లా వ్యవసాయ వృద్ధి రేటు సుమారుగా 7 శాతం ఉండగా ఉద్యాన శాఖ వృద్ధి రేటు మాత్రం 2015-16లో 19 శాతం నమోదైంది. దీంతో ఈ ఏడాది కనీసం 21 శాతం వృద్ధి రేటు నమోదు చేయాలని లక్ష్యంగా జిల్లా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. వీటిని ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదించారు. ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందంటే సుమారు రూ.13.70 కోట్లతో ఉద్యాన పంటలకు వూతమివ్వనున్నారు.

జిల్లాలో సుమారు 1.4 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు జరుగుతున్నాయి. వీటి ద్వారా సుమారు 4.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు వస్తుంటాయి. గత ఏడాది గ్రోత్‌ ఇంజిన్ల ద్వారా రూ.1,560 కోట్ల నుంచి రూ.1,860 కోట్లకు వృద్ధి (19 శాతం) సాధించగలిగారు. దీన్ని 2016-17 ఏడాదికి 21 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది రూ.2.20 కోట్లతో 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు వేల ఎకరాల్లో తోటల నిర్వహణకు రూ.1.76 కోట్లు కేటాయించారు. రూ. 73 లక్షలతో 17 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హరిత గృహాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. మరో రూ.76 లక్షలతో 750 హెక్టార్లలో జీడి మామిడి తోటల ఆధునికీకరణ, 1,250 హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల్లో రూ.3.20 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాసయోజన నుంచి రూ.4.43 కోట్లు, ఆయిల్‌ పాం మిషన్‌ రూ.3.84 కోట్లు, ఎంఐడీహెచ్‌ (ఐటీడీఏ పాడేరు) రూ.కోటి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి నుంచి రూ.1.20 కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.వాణిజ్య పంటలతో ఆదాయం
ఉద్యాన పంటల్లో వాణిజ్య రకాలను పండించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై విత్తనాలు, యంత్ర పరికరాలు పంపిణీ చేస్తోంది. జిల్లా అవసరాల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రైతులకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు మేం చేపడుతున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా సలహాలు, సందేహాలకు సమీపంలోని ఉద్యాన శాఖ సిబ్బంది, ఎంపీహెచ్‌ఈఓలను సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

– ప్రభాకర్‌, ఉద్యాన శాఖ ఏడీ
 Source : http://www.eenadu.net/