News

Realestate News

ఉపాధ్యాయుడి ప్రేరణ.. గిరిజనుల చైతన్యం

Vizag Real estae News

ఉపాధ్యాయుడి ప్రేరణ.. గిరిజనుల చైతన్యం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే : పనిచేసేది మరోచోట అయినా స్వగ్రామంలో జలసంరక్షణకు ఉపాధ్యాయుడు నడుంబిగించారు. ‘ఈనాడు ఈటీవీ’ సుజలాం.. సుఫలాం స్ఫూర్తితో మారుమూల గిరిజన గ్రామంలో ఉపాధ్యాయుడి చొరవతో గిరిజనులు ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టారు. గూడెంకొత్తవీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో 65 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన ముర్ల వెంకటరమణ చింతపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సెలవులకు ఇంటికి వచ్చిన ఆయన గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వకాలు జరిపించి జలసంరక్షణకు చర్యలు తీసుకోవాలని భావించారు. ఆదివారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. గిరిజనుల్లో చైతన్యం నింపారు. గ్రామంలో జల సరంక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం 65 ఇంకుడు గుంతల తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు 54 గుంతలను పూర్తి చేశారు. కొత్తపాలెం నుంచి సమీప గ్రామమైన వీరవరం వరకు ర్యాలీ నిర్వహించి ఆ గ్రామంలోనూ జల సంరక్షణపై అవగాహన తీసుకొచ్చారు. అక్కడి గిరిజనులు మరో 55 ఇంకుడు గుంతల తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. మొత్తం 120 ఇంకుడు గుంతల తవ్వకాల్లో గిరిజనులు నిమగ్నమయ్యారు.

ప్రోత్సాహం అందించారు : జల సంరక్షణకు సంబంధించి మాకు అవగాహన లేదు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ముర్ల వెంకటరమణ స్ఫూర్తి రగిలించారు. ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల తవ్వకాలు జరిగేలా ప్రోత్సహించారు.

– వి.వీరాస్వామి, కొత్తపాలెం గ్రామం

సుజలాం…సుఫలాం స్ఫూర్తితో..
‘ఈనాడు ఈటీవీ’ సుజలాం.. సుఫలాం ద్వారా చేపడుతున్న జలయజ్ఞం స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాల్లో మరో రెండువేల ఇంకుడు గుంతల తవ్వకాలు జరిగేలా అవగాహన కల్పిస్తాం. పాఠశాలల్లోని చిన్నారులకు నీటి సంరక్షణపై ప్రత్యేకంగా చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేస్తాం.

– ముర్ల వెంకటరమణ, ఉపాధ్యాయుడు