News

Realestate News

ఉత్తమ విద్యాబోధన చేయాలి

04-06-2016-01 news vizagrealestate

ఉత్తమ విద్యాబోధన చేయాలి
కొమ్మాది, న్యూస్‌టుడే: ఉత్తమ విద్యాబోధనతో ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా బాధ్యతలు నిర్వహించాలని కొత్తగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అభ్యర్థులకు డీఈవో ఎం.వెంకటకృష్ణారెడ్డి సూచించారు. డీఎస్సీ 2014లో ఎంపికైన 248 ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్‌ పద్ధతిలో మధురవాడలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో పదిరోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. తరగతులను శుక్రవారం డీఈవో వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శ పాఠశాలగా ఎంపికైన చంద్రంపాలెం ఉన్నత పాఠశాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. బోధనా పద్ధతులు, సమగ్ర మూల్యాకనం, దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల బోధన, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎలా మెలగాలి వంటి అంశాలతో పాటు రోజూ గంట పాటు యోగా శిక్షణ ఉంటుందన్నారు. కశింకోట మండలం తాళ్లపాలెం పాఠశాలలోనూ 258 మంది ఉపాధ్యాయులకు 12వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అలానే 484 మంది స్కూల్‌అసిస్టెంట్లకు గంభీరం (ఆనందపురం మండలం)లోని చైతన్య పాఠశాలలో శుక్రవారం నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. అంకితభావంతో వృత్తి ధర్మాన్ని పాటించి ఉత్తమ బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో జి.నాగమణి, ప్రధానోపాధ్యాయులు ఎం.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

నూతన ఉపాధ్యాయుల్లో కొందరు తమ చంటిపిల్లలతో మొదటి రోజు శిక్షణ శిబిరానికి వచ్చి తీవ్ర అవస్థలు పడ్డారు. మరికొందరు తమ కుటుంబసభ్యులను వెంటతీసుకొచ్చి… పిల్లలను వారికి అప్పగించి శిక్షణలో పాల్గొన్నారు.