News

Realestate News

ఈ దారి… రాష్ట్ర రహదారి

Transport vehicles to be diverted to Anandapuram Sabbavaram Anakapalle Highway roads in vizag to control accidents news image

కేంద్రంతో రాష్ట్రప్రభుత్వ ఒప్పందం
ఆనందపురం – అనకాపల్లి మార్గంలోకి రవాణా వాహనాల మళ్లింపు
త్వరలో ప్రభుత్వ అధికారిక ప్రకటన
ఈనాడు – విశాఖపట్న

గరం మధ్యలోని జాతీయ రహదారిపై సరకు రవాణా వాహనాలను అనుమతించరు. వీటిని ఆనందపురం – సబ్బవరం – అనకాపల్లి రహదారిలో మళ్లిస్తారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు విడుదల కానున్నాయి. నగరం మధ్యలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు భారత జాతీయ రహదారి వ్యవస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ముందుకొచ్చింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆనందపురం – అనకాపల్లి రహదారిని ఎన్‌హెచ్‌ఏఐకు అప్పగిస్తున్నారు. ఇది ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తుంది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. దీనివల్ల విశాఖ నగరం మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు ప్రమాదాలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆనందపురం – విశాఖపట్నం – అనకాపల్లి మధ్య 65 కిలోమీటర్ల జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఉంటోంది. ఏటా దాదాపు 500 మంది నుంచి 700 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సరకు రవాణా వాహనాలను ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపునకు మళ్లించాలన్న అనేక ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోంది. ప్రమాదాల తీవ్రతను గమనించిన ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు స్పందించాయి. నగరం మధ్యలోని 65 కిలోమీటర్ల రహదారి నిర్వహణ, విస్తరణ తదితర బాధ్యతను ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల జాతీయ రహదారిని స్వల్పంగా విస్తరించారు. ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా అనకాపల్లి వరకు 54 కిలోమీటర్ల రెండు వరుసల రహదారిని భారత జాతీయ రహదారి వ్యవస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆరు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) ఇటీవల ఖరారైంది.

ఎన్‌హెచ్‌ఏఐకు అప్పగిస్తున్నాం…
ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా అనకాపల్లి వరకు రాష్ట్ర రహదారిని ఎన్‌హెచ్‌ఏఐకు అప్పగిస్తున్నాం. అది ఈ రహదారిని విస్తరిస్తుంది. నిర్వహణ బాధ్యత కూడా ఎన్‌హెచ్‌ఏఐ చూస్తుంది. విశాఖ నగర మీదుగా వెళ్లే సరకు రవాణా వాహనాలను ఆ రహదారి మీదుగా మళ్లించాలన్నది ప్రయత్నం. దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్య, రహదారుల రద్దీ తగ్గుతుంది. ఆనందపురం – విశాఖ నగరం – అనకాపల్లి మధ్య ఉన్న జాతీయ రహదారి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది.

-ఎం.గంగాధరం, ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ

శుభపరిణామం….
సరుకు రవాణా భారీ వాహనాలను ఆనందపురం వద్ద దారి మళ్లించి అనకాపల్లి వైపునకు పంపాలన్న నిర్ణయం శుభపరిణామం. దీనివల్ల నగరం మధ్యలోని జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గి ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది. ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిపాదనలు ఇప్పటికైనా ఆచరణకు నోచుకోవడం సంతోషం. ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా అనకాపల్లి రహదారి విస్తరణ పనులు కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయించాలి.

-ఎస్‌.వెంకటేశ్వరరావు, రోడ్డు రవాణాశాఖ ఉప కమిషనర్‌