News

Realestate News

ఇక హరిత విశాఖ!

Real Estate Vizag

17,44,240 మొక్కలు నాటేందుకు కార్యాచరణ
మార్చిలోగా 40 లక్షల లక్ష్యాన్ని చేరుకునే యత్నం
పారిశ్రామిక సంస్థలతో కలిసి అధికారుల వనయజ్ఞం

మహా నగరం మరోసారి పచ్చదనాన్ని సంతరించుకోనున్నది. అన్ని ప్రాంతాల్లోనూ హరితం ఉట్టిపడేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ), విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా), సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో నగర, గ్రామీణ జిల్లాలోని వివిధ పారిశ్రామిక సంస్థలను జిల్లా యంత్రాంగం భాగస్వాములను చేసింది.

ఈనాడు, విశాఖపట్నం

హుద్‌హుద్‌ దెబ్బతో మహా నగరంలో లక్షల్లో పచ్చని చెట్లు నేలకొరిగాయి. ఈ పరిణామం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పారిశ్రామిక, వాహన కాలుష్యంతో ఇప్పటికే మోతాదుకు మించి బొగ్గు పులుసు వాయువు గాలిలో కలుస్తోంది. ఫలితంగా వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మహా నగరంలో ఈ ఏడాది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. పదేళ్ల క్రితంతో పోల్చి చూస్తే సరాసరి 5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు.. నిపుణులు గుర్తించారు. పచ్చదనాన్ని పెంచడంతో పర్యావరణాన్ని కాపాడొచ్చని జిల్లా యంత్రాంగం భావించి మొక్కల పెంపకం కోసం 2012 నుంచే ప్రాధాన్యమిస్తోంది. అప్పట్లో అటవీ, శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి కూడా మహా నగరంలో కాలుష్య సమస్య పరిష్కారం కోసం మొక్కల పెంపకం ఒకటే శరణ్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక సంస్థల సాయంతో నగరంలో 40 లక్షల మొక్కలు నాటించాలని ఛైర్మన్‌ హోదాలో అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ మేరకు పారిశ్రామిక సంస్థలతో సంప్రదింపులు చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి 2012లో అధికారులు శ్రీకారం చుట్టారు. నిర్దేశించిన లక్ష్యంలో 50 శాతం మొక్కలు నాటాక దురదృష్టవశాత్తు 2014 అక్టోబరు 12న హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సంతో పచ్చదనానికి తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షలాది మొక్కలు నేలకొరగడంతో పర్యావరణానికి విఘాతం ఏర్పడి గత రెండేళ్లుగా నగర ప్రజలు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యల నుంచి బయటపడే క్రమంలో మరోసారి మొక్కల పెంపకం కోసం జిల్లా యంత్రాంగం ప్రాధాన్యమిస్తోంది. 40 లక్షల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మిగతా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి 2017 మార్చిలోగా 17,44,240 మొక్కలు నగర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించారు.

ఏడు పారిశ్రామిక సంస్థల సమన్వయంతో జీవీఎంసీ ఆధ్వర్యంలో 10,25,000 మొక్కలు నాటాలన్న లక్ష్యంలో ఇప్పటికే 5,76,760 మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చిలోగా మరో 4,48,240 మొక్కలు నాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వుడా ఆధ్వర్యంలో 9 పారిశ్రామిక సంస్థల సమన్వయంతో 18,50,000 మొక్కలు నాటించాలన్నది లక్ష్యమైతే, ఇప్పటివరకు 10,64,750 మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చిలోగా మరో 7,85,250 మొక్కలు నాటించాలని నిర్ణయించారు.

సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడు పారిశ్రామిక సంస్థల సాయంతో 11,25,000 మొక్కలు నాటించాలన్నది ప్రణాళిక. ఇందులో ఇప్పటివరకు 6,14,250 మొక్కలు నాటగా, మరో 5,10,750 మొక్కలను మార్చిలోగా వేయాల్సి ఉంటుంది.

మొక్కల పెంపకం అత్యావశ్యం
నగరంలో పచ్చదనాన్ని పెంచడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. హుద్‌హుద్‌ తుపాను ప్రభావంతో చాలావరకు పచ్చదనాన్ని కోల్పోవడం బాధాకరం. తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో చాలామంది భాగస్వాములవుతున్నారు. సామాజిక కార్పొరేట్‌ బాధ్యత(సీఎస్‌ఆర్‌)గా నగర, గ్రామీణ జిల్లాలోని అనేక పారిశ్రామిక సంస్థలు 2012 నుంచే మొక్కల పెంపకం కోసం ముందుకొచ్చాయి. 40 లక్షలు మొక్కలు నాటాలన్నది ఆ రోజున నిర్దేశించుకున్న లక్ష్యం. మధ్యలో తుపాను కారణంగా అప్పటికే వేసిన చాలా మొక్కలు దెబ్బతిన్నాయి. మిగతా 17.50 లక్షల మొక్కలను మార్చిలోగా వేయించాలని భావిస్తున్నాం. ఈ మేరకు సంబంధిత వర్గాలను సమాయత్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది.

– డాక్టర్‌ యువరాజ్‌, కలెక్టర్‌