News

Realestate News

అన్ని ప్రాంతాలకూ మన్యం కాఫీ ఉత్పత్తులు

vizagrealestate news

అన్ని ప్రాంతాలకూ మన్యం కాఫీ ఉత్పత్తులు
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరినారాయణన్‌
పాడేరు, న్యూస్‌టుడే : మన్యంలో సాగవుతున్న కాఫీ ఉత్పత్తులు అన్ని ప్రాంతాలకు విస్తరించి అగ్రగామిగా ఎదిగేలా కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగపు అధికారులు సంయుక్తంగా పని చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరినారాయణన్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో కాఫీ సాగుపై ఒక రోజు వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, గిరిజనులు ఎంత కష్టబడిన దానికి అనుగుణమైన ఫలితాలు అందడంలేదన్నారు. ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించే చర్యలు చేపట్టామని చెప్పిన ఆయన కాఫీ సాగు కంటే కాఫీ ఉత్పత్తుల్లో విస్తరించేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. ఇటీవల భూసార పరీక్షలు నిర్వహించామని చెప్పారు. దీనిద్వారా భూసారాన్ని పెంచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మినుములూరు పరిధిలో రైతులు అధికంగా 200 కిలోల కాఫీ గింజల దిగుబడి సాధిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం చిక్‌మగళూర్‌ అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ డివిజన్‌ అధికారి డిసౌజా కాఫీ సాగు యాజమాన్యపద్ధతులు, మట్టి నమూనా, జీవ గుణాలు, మొక్కల పోషణ వంటి విషయాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. విశాఖమన్యంలో కాఫీ సాగుకు అనుకూలమైన శీతోష్ణపరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం కాఫీ బోర్డు సంయుక్త సంచాలకులు అనిల్‌కుమార్‌, పాడేరు కాఫీ బోర్డు ఉప సంచాలకులు కేవీవీఎస్‌ఎస్‌ రాజు, ఐటీడీఏ కాఫీ ఏడీ చిట్టిబాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.