News

Realestate News

హుద్‌హుద్‌ ప్రభావిత జిల్లాల్లో రూ.630 కోట్లతో అభివృద్ధి పనులు

హుద్‌హుద్‌ ప్రభావిత జిల్లాల్లో రూ.630 కోట్లతో అభివృద్ధి పనులు
విశాఖపట్నం:
హుద్‌హుద్‌ తుపాను ప్రభావిత జిల్లాలో దెబ్బతిన్న ఆస్తుల పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూ.2250 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖల పరిధిలో రహదారులు, వంతెనలు, తుపాను రక్షిత భవనాల మరమ్మతులు, పునరుద్ధణ పనులను రూ.630 కోట్లతో చేపట్టనున్నారు. ఈ పనులను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పర్యవేక్షించి నిధులు మంజూరు చేయనుంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 176 పంచాయతీరాజ్‌ రహదారులు, 17 ఆర్‌అండ్‌బీ రహదార్లు, ఎనిమిది వంతెనలు, 157 తుపాను రక్షిత భవనాల మరమ్మతులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. 84 పనులకు గుత్తేదార్లతో ఒప్పందాలు జరిగాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 13 ప్యాకేజీలు చొప్పున, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మూడేసి ప్యాకేజీలుగా ఈ పనులను చేపడతారు. గతంలో ఈ రెండు శాఖల పరిధిలో ఏ పనులు జరిగినా వాటి నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి థర్డ్‌ పార్టీగా ప్రభుత్వ సంస్థలే ఉండేవి. దీంతో పనుల్లో చాలావరకు నాణ్యతా లోపాలున్నా వీరు పట్టించుకోరని, గుత్తేదార్లకు అనుకూలంగానే వ్యవహరిస్తారనే ఆరోపణలు వచ్చేవి. ప్రస్తుతం హుద్‌హుద్‌ ప్రభావిత జిల్లాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనుల నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణకు సంబంధించి లీ అసోసియేట్స్‌ను థర్డ్‌ పార్టీగా ప్రభుత్వం నియమించింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు కాబట్టి పనుల నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందనేది ప్రభుత్వ భావన. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం లీ అసోసియేట్స్‌కు నాణ్యత ప్రమాణాల బాధ్యతను అప్పజెప్పడాన్ని సమర్దించారు.

ఇంజనీర్లకు అవగాహన..
పనుల నాణ్యతలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాలకు అదనంగా పర్యవేక్షించాల్సిన అంశాలపై నాలుగు జిల్లాల ర.భ., పంచాయతీరాజ్‌ ఇంజినీర్లకు బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు. ఈ కార్యశాలను రాష్ట్రవిపత్తు నిర్వహణ కార్యాలయ ముఖ్య ఇంజినీరు ఎమ్‌.వేణుగోపాలరావు ప్రారంభించారు. లీఅసోసియేట్స్‌ సీజీఎం రాజేష్‌ నాణ్యత ప్రమాణాల్లో పాటించాల్సిన విధానాలు గురించి వివరించారు. నిర్మాణ పనుల్లో ఉపయోగించే సామగ్రికి సంబంధించి పూచికపుల్లను కూడా గుర్తింపు (ఆథరైజ్డ్‌) కలిగిన సంస్థల నుంచే కొనుగోలు చేయాలని, అన్నింటికీ రశీదులు, దస్త్రాలను నిర్వహించాలని సూచించారు. పనిప్రదేశంలో కార్మికులకు రక్షణ పరికరాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. పని పూర్తయ్యాక నిర్మాణ సామగ్రిని అక్కడి నుంచి సకాలంలో తొలగించాలని, రహదారులు వేసేటప్పుడు చెట్లను నరకాల్సి వస్తే సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. పని పూర్తయిన తరువాత తిరిగి మొక్కలను నాటాల్సి ఉంటుందని చెప్పారు. తీరప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు సీఆర్‌జడ్‌ నిబంధనలకు అనుగుణంగా చేయాలన్నారు. అడ్డుగోలుగా పనులుచేస్తే పైసా బిల్లు కూడా అందే ప్రసక్తి ఉండదని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌ఐఎస్‌ బి.వెంకటరమణ, విశ్రాంత ముఖ్య ఇంజినీరు వెంకటభావనరావు, కక్స్‌ సంస్థ ఎండీ రామకృష్ణ ప్రసాద్‌, లీ అసోసియేట్స్‌ ప్రతినిధులు కె.జగన్‌మోహనరావు గుప్తా, షీరా ఇతర సాంకేతిక సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.