News

Realestate News

హాల్‌ టికెట్లు అందలేదని రగడ

హాల్‌ టికెట్లు అందలేదని రగడ
పాడేరు, న్యూస్‌టుడే: చౌక ధరల దుకాణ డీలర్ల నియామకానికి శుక్రవారం పాడేరులో నిర్వహించిన పరీక్షకు హాజరయ్యేందుకు హాల్‌ టికెట్లు అందలేదని పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మన్యం వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 39 డీలరు పోస్టులను భర్తీ చేసేందుకు రెవెన్యూ అధికారులు పరీక్ష నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సబ్‌ కలెక్టర్‌ బాలాజీ పర్యవేక్షణల్లో అభ్యర్థులకు రాత పరీక్ష జరిగింది. దరఖాస్తు చేసుకున్న పెదబయలు, ముంచంగిపట్టు మండలాలకు చెందిన పలువురు అభ్యర్థులకు హాల్‌ టికెట్లు అందకపోవడంతో వారంతా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించాలని రెవెన్యూ అధికారులను కోరారు.

పరీక్షల నిర్వాహకుడు మురళి మాట్లాడుతూ.. డిపో పరిధిలో గ్రామాలుంటే సరిపోదని, డిపో ఖాళీగా ఉన్న గ్రామానికి సంబంధించిన వారే పరీక్ష రాసేందుకు అర్హులన్నారు. సంతృప్తి చెందని అభ్యర్థులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పెదబయలు ఎంపీపీ ఉమామహేశ్వరరావు, తెదేపా నాయకులు పాండురంగస్వామి అక్కడకు చేరుకుని అభ్యర్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. విషయాన్ని సబ్‌ కలెక్టర్‌ బాలాజీ దృష్టికి తీసుకువెళ్లగా.. నిబంధనల ప్రకారం రెవెన్యూ గ్రామానికి చెందిన అభ్యర్థులకే హాల్‌టికెట్లు జారీ చేసినట్లు చెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.