News

Realestate News

స్వర్ణకాంతి… అంతా భ్రాంతేనా?!

స్వర్ణకాంతి… అంతా భ్రాంతేనా?!
బంగారు ఆభరణాల అలంకరణ కలేనా?
దాతలు, భక్తుల ఆశలు నెరవేరవా?
సూర్యనారాయణ స్వామి ఆలయ నిర్వహణలో డొల్లతనం
భద్రత కల్పించలేమని చేతులెత్తేస్తున్న వైనం
న్యూస్‌టుడే, అరసవల్లి
రాష్ట్రంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నాయి. వాటన్నింటి సరసన నిలిచే విశిష్టత అరసవల్లి సూర్యనారాయణ స్వామి కోవెలకు ఉంది. దేశంలో పూజలందుకొనే ఏకైక సూర్యనారాయణ స్వామి ఆలయంగా పేరుంది. నిత్యం పలు ప్రాంతాల నుంచి భక్తులు, ప్రముఖలు ఇక్కడికి వస్తుంటారు. ఆరోగ్య ప్రదాతగా కొలుస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం అభివృద్ధి పథంలో ‘బృహత్‌ ప్రణాళిక’ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఏటా ‘రథసప్తమి’ అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. అంతా బాగానే ఉన్నా…బంగారు ఆభరణాల అలంకరణ విషయంలో మాత్రం తాత్సార ధోరణి కనిపిస్తోంది. ఇదే భక్తులకు అంతులేని ఆవేదన కలిగిస్తోంది.

అప్పుడెప్పుడో…అలంకరణ
2008లో రథసప్తమి సందర్భంగా ఆదిత్యునికి బంగారు ఆభరణాల అలంకరణ చేశారు. ఆ తరువాత చేతులెత్తేశారు. ఇంతవరకు స్వామిని మళ్లీ ఆ రూపంలో చూసే అదృష్టాన్ని భక్తులకు కల్పించలేదు. రాష్ట్రంలో ప్రతి ప్రముఖ దేవాలయంలో మూలవిరాట్‌లకు నిత్యం ఆభరణాలతో అలంకరిస్తారు. అలా చేయకపోయినా పర్వదినాల్లోనైనా ఆ భాగ్యం కల్పిస్తారు. కానీ, అదేమి విచిత్రమో తగినన్ని ఆభరణాలున్నా అరసవల్లి సూర్యనారాయణస్వామికి మాత్రం అలా చేయటం లేదు. దాతలు భక్తికొద్దీ ఇస్తున్న బంగారు, వెండి ఆభరణాలు బ్యాంకుకే పరిమితమౌతున్నాయి.

దాగుడుమూతలు
శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ఏటా ఎన్నో మార్గాల్లో ఆదాయంతో పాటు వివిధ ఆభరణాలూ అందుతున్నా వాటి లెక్కలేవీ చూపక,  చూపినా స్వామి అలంకరణకు ప్రతిరోజూ వినియోగించక అధికారులు దాగుడుమూతలు ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రూ. కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను త్వరలో నిర్వహించే రథసప్తమికైనా అలంకరించాలని భ‌క్తులు కోరుతున్నారు.

భద్రతే ఓ కారణమా..
ఏళ్లనాటి చరిత్ర ఉన్న వెలుగుల రేడుకు వెలుగు లేకుండా చేస్తున్నారు. స్వామి సంవత్సరానికి ఒకసారి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తూ మిగిలిన రోజుల్లో సాధారణ అలంకరణతో, వెండి ఆభరణాలలో కనిపిస్తున్నారు. భద్రత సాకుతో ఆలయ అధికారులు ఆభరణాలు బ్యాంక్‌ నుంచి బయటకు తీయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. ఏటా స్వామికి బంగారు ఆభరణాలు అలంకరిస్తామన్న ఆలయ అధికారుల మాటలు అలాగే మిగిలిపోతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడంలేదు. ఈ విషయంపై ఆలయ అధికారులను భక్తులు ప్రశ్నిస్తుంటే ఈ ఏడాది రథసప్తమికి, వార్షిక కల్యాణం రోజున అలంకరిస్తామంటూ రెండేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప కార్యరూపంలోకి తేవటం లేదు.

ఉన్నవి ఇవి
బంగారు నేత్రాలు, కిరీటం, వడ్డాణం, పాదుకలు, సనకనందనలు, మాటారుడు, పింగరుడు, ఉషాపద్మినీచ్ఛాయ సమేత సూర్యనారాయణస్వామి కవచాలు, హస్తాలు, పద్మాలు, వాణీచెంగులు, కేయురాలు, మకరకుండలాలు, ఉత్సవమూర్తుల కిరీటాలు, తదితరాలు.

వెండి ఆభరణాలుగా… మకరతోరణం, ఉద్దరిణిలు, హసాతలు, పద్మాలు, కవచాలు, దీపాలు, కుందులు, కల్యాణపీటలు, ఊయల, నేత్రాలు, పాదుకలు, మీసాలు, వాణీచెంగులు, తదితరాలున్నాయి.

‘భద్రతాపరమైన కారణాల వల్లే ఆభరణాల అలంకరణ చేయలేకపోతున్నాం. రథసప్తమికి అలంకరణ చేసేలా ఆలోచన చేస్తున్నాం. ఆభరణాల లెక్కలు ప్రతి ఏడాది పక్కాగా సాగుతున్నాయి’ అని కార్యనిర్వహణాధికారి వి.శ్యామలాదేవి పేర్కొన్నారు.

బంగారం… కానుకలుగా వస్తోంది ఆభరణాలుగా మలిచి ఇస్తున్నారు ముడుపు రూపంలో హుండీల్లోకి చేరుతుంది… చివరికి అదంతా బ్యాంకు లాకరుకే పరిమితమవుతోంది!!
చూడచక్కని ఆభరణాలున్నా సూర్యనారాయణ స్వామికి అలంకరణ చేసేదెప్పుడు ఆరోగ్య ప్రదాతకు స్వర్ణ శోభ ఎప్పుడు? అసలు బంగారం ఎంతుంది?
భక్తులు ఇస్తున్నదంతా లెక్కలో ఉంటుందా? దాదాపు పదేళ్లుగా లాకరుకే ఎందుకు పరిమితం చేశారు? …ఇలా ఎన్నో ప్రశ్నలు భక్తుల మదిని తొలిచేస్తున్నా…
ఆలయ నిర్వాహకులు చెప్పే జవాబు ఒకటే… ‘భద్రత కల్పించేలేమని!!