News

Realestate News

స్వచ్ఛ పరుగు

స్వచ్ఛ పరుగు
జనాభిప్రాయంలో ఇప్పటికి విశాఖదే మొదటిస్థానం
పాల్గొన్నవారు 75 వేల మందికి పైనే
నెలాఖరుకు లక్ష దాటాలని జీవీఎంసీ అధికారుల యత్నం
ఈనాడు – విశాఖపట్నం
స్వచ్ఛ సర్వేక్షన్‌ జన స్పందనలో విశాఖ నగరమే అగ్రభాగాన నిలిచింది.. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో సుమారు 7 లక్షల మంది స్పందిస్తే అందులో విశాఖ నగరవాసులు సుమారు 75 వేలమంది ఉన్నారని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ వెల్లడించింది. ఇదే ఉత్సాహాన్ని ఈ నెలాఖరువరకు చూపించగలిగితే అగ్రస్థానం నిలబడుతుంది.

స్వచ్ఛ సర్వేక్షన్‌ – 2017 పోటీలో ప్రజా స్పందన ఎంత బాగుంటే మార్కుల్లో కూడా అంత ప్రాధాన్యం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో దేశంలోని 500 నగరాలు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నాయి. ప్రజా స్పందనకు తొలుత విధించిన గడువు ఫిబ్రవరి 12. ఆ తేదీ నాటికి వచ్చిన ప్రజా స్పందనలో విశాఖ నగరమే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాతి స్థానాల్లో గ్వాలియర్‌, ఇండోర్‌, మైసూర్‌, హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలు ఉన్నట్లు చెప్పారు. ఆయా నగరాల్లో పరిస్థితులపై పేర్కొన్న 6 ప్రశ్నలకు ప్రజలు స్పందించారు. 1969 నెంబరుకు ఫోన్‌ చేసి సర్వేలో పాల్గొనడం, స్వచ్ఛత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సర్వేలో పాల్గొనడం, ఆన్‌లైన్‌లో గూగుల్‌ డాక్యుమెంట్లలోని స్వచ్ఛ సర్వేక్షన్‌ – 2017 సర్వే ఫారాన్ని నింపడం, స్వచ్ఛ సర్వేక్షన్‌ – 2017 అధికారిక వెబ్‌సైట్‌లో సర్వేలో పాల్గొనడం ద్వారా తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆరు ప్రశ్నలకు జనం ఏ విధంగా స్పందించారన్నది పూర్తిస్థాయి స్వచ్చ ´సర్వేక్షన్‌ నగరాల ఫలితాల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం ప్రజా స్పందన గడువును ఈ నెలాఖరువరకు పొడిగించారు.

వచ్చే నెలలో ఫలితాలు..
దేశవ్యాప్తంగా నగరాల ర్యాంకుల్ని మార్చిలో వెల్లడించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట్లో నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ర్యాంకులు ప్రకటించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. నగరాల సంఖ్య పెరగడంతో పాటు ప్రజల నుంచి మరింతగా స్పందనను ఆశించి గడువు పొడిగించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల అమలు, ఫిర్యాదుల పరిష్కారం.. ఇలా వివిధాంశాల్లోనూ పోటీ కొనసాగుతోంది.

మరింతమంది పాల్గొనాలని..
ఫిబ్రవరి 12 వరకు ఉన్న గణాంకాలను బట్టి విశాఖ నగరం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు మరింతగా శ్రమించాలని జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. ఇంకా ఎక్కువమంది నగరవాసుల్ని స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగస్వాములను చేయాలని కోరుకుంటోంది. ఈ నెలాఖరుకు ఈ సంఖ్య లక్ష దాటిపోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం వివిధ విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు నగర వీధులు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో, మహిళా సంఘాల ద్వారా.. పర్యాటకుల ద్వారా స్పందనలు ఇప్పించే ప్రయత్నం చేశారు. జనాభిప్రాయంలో స్వచ్ఛతయాప్‌ కూడా ఒక భాగం.. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని స్పందించే విధానంలో నగరం 17వ స్థానంలో నిలిచింది. ఈ అంశంలో మాత్రం గ్వాలియర్‌ మొదటిస్థానంలో ఉంది.

‘స్వచ్ఛగ్రాహి’కి రూ. 25 వేలు
స్వచ్ఛ సర్వేక్షన్‌ – 2017 వెబ్‌సైట్‌ ద్వారా సర్వేలో పాల్గొనేందుకు రిజిస్టర్‌ అయిన వ్యక్తి.. స్వచ్ఛగ్రాహిగానూ చేరే అవకాశం ఉంది. ఇక్కడ స్వచ్ఛగ్రాహి అంటే తాను సర్వేలో పాల్గొనడంతో పాటు ఆ వెబ్‌సైట్‌ సర్వేలోని ప్రశ్నల లింక్‌ను మరికొంతమందితో పంచుకుని వీలైనంతమందిని పాల్గొనేలా చేసేవారన్నమాట. ఇలా ఎక్కువమందిని పాల్గొనేలా చేసినవారిలో కొంతమందిని ఎంపిక చేసి రూ. 25 వేల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. స్వచ్ఛ గ్రాహిగా రిజిష్టర్‌ అయి సర్వేలో పాల్గొనేలా చేసేందుకు ఫిబ్రవరి 20వ తేదీ వరకే గడువు ఉంది. ఆ తర్వాత ఎవరికివారు వ్యక్తిగతంగా ఫిబ్రవరి 28 వరకు సర్వేలో పాల్గొనవచ్చు.

నగరానికి లాభమేంటంటే..
స్వచ్ఛసర్వేక్షన్‌లో మొదటిస్థానంలో నిలిస్తే..
* జాతీయస్థాయిలో విశాఖ కీర్తి మరింత పెరుగుతుంది.
* పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచేందుకు ప్రయత్నించవచ్చు.
* స్వచ్ఛ గుర్తింపు ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి
* ఆర్థికవ్యవస్థ బలోపేతం అవడంతో పాటు ఆర్థిక వనరులు పెరుగుతాయి. తద్వారా మౌలిక వసతులు సమకూర్చుకోవచ్చు.

స్వచ్ఛందంగా స్పందించండి..
– ఎం.హరినారాయణన్‌, జీవీఎంసీ కమిషనర్‌
నగరవాసులు స్వచ్ఛ సర్వేక్షన్‌పై బాధ్యతగా స్పందిస్తారనే ఆశ ఉంది. కొన్ని నిమిషాలను కేటాయించి 6 ప్రశ్నలకు సమాధానం ఇస్తే నగరానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28వ తేదీలోపు 1969కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడంగానీ, స్వచ్ఛత యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునిగాని, స్వచ్ఛసర్వేక్షన్‌ వెబ్‌సైట్‌ ద్వారా పాల్గొనడం చేయవచ్చు. గూగుల్‌ డాక్యుమెంట్స్‌లో ఉన్న సర్వేపత్రాల ద్వారానూ చేయవచ్చు. ఈసారి మనకు గతంలోకన్నా మెరుగైన ర్యాంకు వస్తుందన్న ఆశాభావం ఉంది.