News

Realestate News

స్వచ్ఛ్‌ యాప్‌లో చేరండి

స్వచ్ఛ్‌ యాప్‌లో చేరండి
స్థానిక సమస్యలను తెలియజేయాలి
నగర పౌరులకు కలెక్టర్‌ వినతి
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: స్వచ్ఛభారత్‌ అవార్డు కోసం దేశంలో 500 నగరాలతో పోటీ పడుతున్న విశాఖ ప్రస్తుతానికి కొన్ని అంశాల్లో తొలి స్థానంలో ఉందని, అయితే స్వచ్ఛ్‌ యాప్‌లో నగర పౌరుల భాగస్వామ్యం మరింతగా పెరగాలని కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిలో చేరడానికి ఈనెల 28 వరకు మాత్రమే గడువు ఉన్నందున అత్యధికులు యాప్‌లో చేరి స్థానిక సమస్యలను యాప్‌ద్వారా జీవీఎంసీకి నివేదిస్తే మెరుగైన ర్యాంకును సాధించవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో చిన్న నగరాలైన విజయవాడ వంటి చోట్ల అత్యధికులు యాప్‌లో చేరి తమ భాగస్వామ్యాన్ని పెంచారని, విశాఖ నగరంలో చాలా తక్కువగా ఉందని, ప్రస్తుతం నగరంలో 31వేల మంది మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సమస్యలను యంత్రాంగం దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు. వీరి సంఖ్య 40వేలు దాటితే యాప్‌ విభాగంలో 150 వరకు మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. స్వచ్ఛత యాప్‌లో చేరడంతో పాటు 1969కు ఫోను చేసి నగర పరిశుభ్రతపై తమ అనుభవాలను తెలియజేయాలన్నారు.

యాప్‌లో చేరాలంటే…
* గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌కి వెళ్లి స్వచ్ఛ్‌యాప్‌-ఎంఒయుడి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత యాప్‌ను తెరిచి మీ ఫోను నెంబరును రిజిస్టర్‌ చేయాలి.
* మీ ఫోనుకు వచ్చే ఒటిపి పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
* జీపీఎస్‌ సౌకర్యాన్ని ఉపయోగించి యాప్‌ మీరు నివశించే ప్రాంతాన్ని గుర్తించే వరకు వేచి ఉండాలి.
* ఇది పూర్తి అయిన తర్వాత సమస్యను యాప్‌ ద్వారా పంపడానికి అవకాశం కలుగుతుంది.

ర్యాంకు లభిస్తే కలిగే ప్రయోజనాలు
* జాతీయ స్థాయిలో విశాఖ నగరానికి విశిష్ఠ (బ్రాండ్‌ ఇమేజ్‌) గుర్తింపు లభిస్తుంది. * పర్యాటకులు మరింత ఎక్కువ సంఖ్యలో నగరానికి వస్తారు. * పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయి.* నగర ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీని ద్వారా నగర పాలక సంస్థకు ఎక్కువ వనరులు సమకూరుతాయి. తద్వారా మౌలిక వసతులను మెరుగు పర్చుకోవచ్చునని కలెక్టర్‌ తెలిపారు. యూసీడీ పీడీ శ్రీనివాసన్‌, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.