News

Realestate News

స్వచ్ఛతలో విశాఖ స్టేషన్‌ భేష్‌!

స్వచ్ఛతలో విశాఖ స్టేషన్‌ భేష్‌!
నగరం నుంచి రాజధానికి రాత్రివేళ రైలు సౌకర్యం
రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లోహాని
డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ స్వచ్ఛత ప్రమాణాలను పాటించడంలో.. సత్ఫలితాలు సాధిస్తోందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లోహాని కితాబు ఇచ్చారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. స్టేషన్‌లో క్రూ లాబీ, రైలు డాబా, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌, ఆహారశాలలు, పాదచారుల వంతెన, ఎనిమిదో నంబర్‌ ప్లాట్‌ఫారంపై టిక్కెట్‌ కౌంటర్‌, సాధారణ ప్రయాణికుల నిరీక్షణ గదిని తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్లో శుభ్రత, భద్రత ఇతర అంశాలనూ పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. రైల్వే రహదారులు, ఖాళీ స్థలాలనూ చూశారు. స్టేషన్లో ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు.  విశాఖ – విజయవాడ మధ్య రాత్రి వేళ రైలు లేకపోవడం సమస్యగా ఉందన్న విషయం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు మార్గాల్లో రెగ్యులర్‌ రైళ్ల ఏర్పాటు విషయాన్నీ పరిశీలిస్తామని ఛైర్మన్‌ అశ్విని లోహాని తెలిపారు. రైల్వే సేవల్లో డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రైల్వే యూనియన్‌ ప్రతినిధులతో చర్చించారు. అందరూ సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. తూర్పు కోస్తా రైల్వే ద్వారా భారతీయ రైల్వేకు అధిక ఆదాయం సమకూరుతున్నట్లు చెప్పారు. కె.కె.లైను పునరుద్ధరణ పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఇంజినీరింగ్‌, ఇతర శ్రామిక, ఉద్యోగ బృందాలను అభినందించారు. రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని భద్రతా విభాగానికి సూచించారు. ఈయనతోపాటు తూర్పుకోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఉమేష్‌ సింగ్‌, ఈడీ ఎస్కే శర్మ, జీఎం కార్యదర్శి ఎస్కే పురోహిత్‌, విశాఖ డీఆర్‌ఎం ముకుల్‌ శరణ్‌ మాథుర్‌, రైల్వే అడిషనల్‌ డివిజన్‌ మేనేజర్‌ అజయ్‌ అరోరా తదితరులు ఉన్నారు.