‘ స్మార్ట్ విశాఖ’ పరుగు మొదలు

29 ప్రాజెక్టులు… రూ. 1602 కోట్లు!
లక్ష్యం 2020-2021…
ఇప్పటికి విడుదలైంది రూ. 376 కోట్లు..
న్యూస్‌టుడే – కార్పొరేషన్
విశాఖపట్నం ఆకర్షణీయ నగరంగా ఎంపికవడానికి గల అవకాశాలను జీవీఎంసీ అధికారులు గతంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. రూ. 1602 కోట్లతో 29 ప్రాజెక్టులను రూపొందించడానికి ప్రణాళిక రూపొందించి కేంద్రం ముందుంచారు. వీటిని పూర్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 500 కోట్ల చొప్పున దశలవారీగా సమకూరుస్తాయి. మిగిలిన నిధులను ఇతర ప్రభుత్వరంగ సంస్థలను సమన్వయం చేయడం ద్వారా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమకూర్చుకోవాలి. మొదటి దశ నిధులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 376 కోట్ల విడుదలకు ఉత్తర్వులు మంజూరయ్యాయి. త్వరలో ఇవి జీవీఎంసీకి సమకూరనున్నాయి. వీటికి అనుగుణంగా దశలవారీగా జీవీఎంసీ ప్రాజెక్టులను ప్రారంభించనుంది.
తొలి అడుగు ఇలా…
* మొదటి దశలో ఎంపిక చేసుకున్న ప్రాజెక్టుల్లో ఇప్పటికే బీచ్‌రోడ్డులో వైఫై, నగరంలో రవాణాకు సంబంధించి సీసీ కెమెరాలు, సిగ్నలింగ్ వ్యవస్థల ఏర్పాటు దాదాపు పూర్తయ్యాయి.
* అంతర్జాతీయ నౌక సమీక్ష సందర్భంగా ఆకర్షణీయ పరిధి ప్రాంతంలో రహదారుల మరమ్మతులు పూర్తయ్యాయి.
* కేంద్ర ప్రభుత్వ పథకాలైన అందరికీ ఇళ్లు, అమృత్ పథకాల అమలుకు ఆమోదం తెలిపి, ఆయా నిధులు వచ్చిన వెంటనే మిగతా ప్రాజెక్టులను జీవీఎంసీ చేపట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది.
* కేంద్రం నిర్దేశించిన మార్గాల ప్రకారం 2020-21 నాటికల్లా ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాల్సి ఉంటుంది. నిధుల సమీకరణ, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ) ప్రాజెక్టుల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించనున్నారు.
ఇతర శాఖల సమన్వయం…
నగరంలో ఆకర్షణీయ నగర ప్రాజెక్టుల రూపకల్పనలో వుడా, ఈపీడీసీఎల్, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారాన్ని తీసుకోవడానికి విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రయత్నాలు ప్రారంభించనుంది. ముందుగా ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ)ని ఏర్పాటు చేసి, వివిధ సంస్థల నుంచి, ప్రయివేటు నిపుణులను ఎంపిక చేసి వారి ద్వారా స్మార్ట్ పనులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి కరికాల వలవెన్ ఛైర్మన్ కావడంతో ఆయన ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు.
ప్రపంచ బ్యాంకు నిధులకు ప్రతిపాదనలు…
బీచ్‌కోత నివారణకు సంబంధించి రూ. 120 కోట్లు, బీచ్ సుందరీకరణకు మరో రూ. 240 కోట్లు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు సిద్ధంగా ఉంది. అనేకసార్లు నగరంలో పర్యటించిన బృందం త్వరలో నిధులు మంజూరు చేయనుంది. నెడ్‌క్యాప్ ద్వారా వచ్చే రూ.30 కోట్లు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వినియోగించనున్నారు. మిగతా ప్రాజెక్టులకు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా పూర్తి చేయనున్నారు.