News

Realestate News

స్మార్ట్‌ కరెంటు!

2016 vizag realestate

పాత మీటరుకే కొత్త పరిజ్ఞానం
స్మార్ట్‌ మీటరు స్థానే ఈపీడీసీఎల్‌ ప్రయోగం
ధర కేవలం వెయ్యి రూపాయలే
ఆగస్టు 15లోగా వంద ఇళ్లల్లో ప్రయోగం
ఈనాడు – విశాఖపట్నం
స్మార్ట్‌ మీటరు…

ఇంటింటికీ విద్యుత్‌ సరఫరాకు సంబంధించి వివిధ రకాల సమాచారాన్ని సేకరించే యంత్రం. ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్‌, ఇంగ్లండ్‌, స్పెయిన్‌… ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతీ ఇంట్లోనూ దీన్ని వినియోగిస్తున్నారు..
ఎందుకంటే…?
విద్యుత్‌ సరఫరాలో లోపాలు ఉన్నా… విద్యుత్‌లో నాణ్యత లేకున్నా… మనం ఎంత వినియోగించామో తెలియాలన్నా.. ఒక్కోసారి అధిక లోడ్‌ ఉన్నపుడు చిన్నచిన్న సర్దుబాట్ల ద్వారా తక్కువ సరఫరాతో కొన్ని పనిముట్లను వాడేందు కోసం… విద్యుత్తు బిల్లుల్లో పారదర్శకత కోసం ఇది అవసరం.

దీని ఖరీదు… 8 వేల రూపాయలు.
తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో వినియోగదారులకు వీటిని అమర్చాలంటే కోట్ల రూపాయల్లో వ్యయమవుతుంది. ఇది ఆర్థికంగా భారమైన ప్రక్రియ..

మరి మనకెలా…?
తక్కువ ధరలో.. స్మార్ట్‌ మీటరుకు ప్రత్యామ్నాయం కోసం తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ఆలోచన చేసింది. చివరకు ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో కలిసి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తెచ్చింది.
దీని ఖరీదెంతో తెలుసా… కేవలం వెయ్యి రూపాయలు.
కొత్త పరిజ్ఞానం సంగతి ఇదీ….:
ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతీ ఇంటినీ ఫైబర్‌గ్రిడ్‌కి కలుపుతున్నారు. అంటే.. అంతర్జాలయం, టెలివిజన్‌, టెలిఫోన్‌.. ఈ మూడు సేవలూ ఫైబర్‌ గ్రిడ్‌ నుంచే అందుతాయి. దీనికి అదనంగా విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థలను కూడా అనుసంధానించాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. విద్యుత్తుకు సంబంధించి.. స్మార్ట్‌మీటర్‌ స్థానంలో పాత మీటర్‌కే కొత్త సాంకేతిక పరిజ్ఞానం అమర్చాలన్నది అధికారుల ప్రయత్నం. ఇంట్లో టీవీకి ఉండే సెట్‌టాప్‌బాక్సు, ఒక డాటా కేబుల్‌, రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే రిలే సర్క్యూట్‌, దీనంతటినీ పనిచేసేలా చేసే ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు. స్మార్ట్‌మీటర్‌ ఎలా పనిచేస్తుందో.. అలాగే నూటికి నూరుశాతం ఫలితాలు దీనివల్ల వస్తాయని చెబుతున్నారు అధికారులు. పైగా స్మార్ట్‌ మీటరుతో పోలిస్తే ఒక్కోదానిపై ఏకంగా రూ. 7 వేలు ఆదా అవుతున్నట్టే.

పనితీరు ఇలా…!
కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అంతర్గతంగా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. అదెలా పని చేస్తుందంటే..
సెట్‌టాప్‌బాక్సు, డాటా రీడర్‌కేబుల్‌:
రిమోట్‌ ద్వారా నెంబర్లను నొక్కుతూ ఉంటే ఛానెళ్లు మార్చుకోవడం సెట్‌టాప్‌బాక్సు చేసే పని. ఇలా సంజ్ఞల ద్వారా నేరుగా కార్యాలయంలో ఉండి మీటరు నుంచి డాటాను తీసుకోవడం కోసం దీన్ని వాడతారు. సెట్‌టాప్‌టాక్సుకు, ఇంట్లో మీటరుకు మధ్య ఒక డాటా రీడర్‌ కేబుల్‌ కనెక్షన్‌ ఇస్తారు. మీటర్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానిస్తారు. విద్యుత్తు సరఫరాలో నాణ్యత, ఎన్నేసి గంటలు కరెంటు వచ్చింది, ఇంట్లో లోడ్‌ ఎలా ఉంది? ఏ సమయంలో ఎంత కరెంటు కాలింది? నెలలో మొత్తం రీడింగ్‌.. ఇలా ఎప్పటికప్పుడు అధికారులకు తెలిసేలా ఏర్పాటు ఉంటుంది.

* రిలే సర్క్యూట్‌: సెట్‌టాప్‌బాక్సు, డాటా రీడర్‌ కేబుల్‌ నుంచి డాటాను మాత్రమే స్వీకరించడానికి వీలవుతుంది. కానీ రిలే సర్క్యూట్‌ను మీటరుకు, ఫైబర్‌గ్రిడ్‌కు అనుసంధానించడం వల్ల విద్యుత్తును అధికారులు నియంత్రించడానికి వీలవుతుంది. అంటూ.. సబ్‌స్టేషన్లమీద లోడ్‌ ఎక్కువైనప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అవకుండా.. కార్యాలయం నుంచే ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్తును పూర్తిగా ఆపేయకుండా లోడ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకుంటారు. గడువులోపు బిల్లు చెల్లించపోతే విద్యుత్తు సరఫరాను రిమోట్‌కంట్రోల్‌ ద్వారా అధికారులు నిలిపేస్తారు.

* సాఫ్ట్‌వేర్‌ కీలకం: ఈ మొత్తం వ్యవస్థను నడపడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ అవసరముంటుంది. సెట్‌టాప్‌బాక్సును, రిలేను నడిపించడానికి.. నెలవారీ వినియోగదారులకు సంక్షిప్త సందేశాల ద్వారా బిల్లులు పంపడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. అధికారులు తమ కంప్యూటర్‌ ద్వారా ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ ఒకసేవకుడిలా పనిచేస్తుంది.

అనుమతులకు ప్రయత్నాలు..
ఇంటిమీటర్లను కార్యాలయాల నుంచి నియంత్రించడానికి ఏపీఈఆర్‌సీ అనుమతి తప్పనిసరి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలో ఈ ప్రయోగాన్ని ఆగస్టు 15వ తేదీలోపు 100 ఇళ్లకు, ఈ ఏడాది చివరాంకానికి 2 వేల ఇళ్లకు విస్తరించి ప్రయోగాత్మకంగా చూడాలనేది ఉద్దేశం. ప్రస్తుతానికి విశాఖ నగరానికే పరిమితం చేస్తున్నారు. ఓ పక్క క్షేత్రస్థాయిలో ఈ రకమైన ప్రయోగాలు చేస్తూనే.. మరోపక్క మీటర్లకు అనుసంధానించే వ్యవస్థను ల్యాబొరేటరీ ద్వారా పరీక్షింపచేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రమాణాలు ఉన్నాయా అనేది చూస్తారు. తర్వాత.. ఆ నివేదికను ఏపీఈఆర్‌సీకి పంపిస్తారు. వారి అనుమతితో పూర్తిస్థాయిలో ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌తో ప్రజల్లోకి వెళ్తారు.

నిధుల కోసం లేఖ రాస్తాం
– రేవు ముత్యాలరాజు, సీఎండీ, ఈపీడీసీఎల్‌
స్మార్ట్‌మీటర్‌ సహాయంతో డాటా తెచ్చుకోవడమనేది అందరూ చేస్తున్న పనే. ఈపీడీసీఎల్‌లో కూడా స్మార్ట్‌మీటరుపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉన్న పాతమీటరుతోనే పనిచేయాలని మేమనుకుంటున్నాం. దానివల్ల ఖర్చు భారీగా తగ్గుతుంది. విశాఖలో ఈ కొత్తటెక్నాలజీతో ప్రయోగం విజయవంతం అయ్యాక ఒక నివేదిక ఇచ్చి కేంద్రాన్ని నిధుల కోసం ఒప్పిస్తాం.