News

Realestate News

స్మార్ట్‌సిటీ 3వ దశ ప్రణాళికకు యూఎస్‌ సాయం

స్మార్ట్‌సిటీ 3వ దశ ప్రణాళికకు యూఎస్‌ సాయం
నగరంలో పర్యటించిన యూఎస్‌టీడీఏ బృందం
ఈనాడు – విశాఖపట్నం
విశాఖ స్మార్ట్‌సిటీ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా చేపట్టబోయే పనులకు ఇప్పటికే యూఎస్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (యూఎస్‌టీడీఏ) సాయం అందిస్తోంది. ప్రస్తుతం రెండు దశల పనులకు వీరితో మైత్రి కొనసాగుతోంది. మూడో దశ పనులకూ వారి సాయాన్ని కోరుతూ జీవీఎంసీ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆ సంస్థ ప్రతినిధులకు ఆదివారం ప్రతిపాదించారు. వారు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థ ప్రతినిధులు ఆదివారం నగరంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్ని చూశారు. అనంతరం జీవీఎంసీలోని కాన్ఫరెన్స్‌ హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ అమెరికాతో చేసుకొన్న ఒప్పందంలో మూడు స్మార్ట్‌సిటీ పట్టణాల అభివృద్ధిలో విశాఖ కూడా ఒకటని కలెక్టర్‌ వెల్లడించారు. ఆ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం రెండు దశల పనుల్ని పూర్తిచేసి మూడో దశకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా యూఎస్‌ ఆర్థికంగా నిధులిచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ ప్రతిపాదించారు. వచ్చే 3, 4 ఏళ్లలో ఈ సాయం అందిస్తే జీవీఎంసీలో గణనీయమైన అభివృద్ధిని చూడగలుగుతారని ఆ సంస్థ ప్రతినిధులతో అన్నారు.

ప్రస్తుతం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్రజాభిప్రాయం మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. మొదటి దశలో ఆరు జీవీఎంసీ పాఠశాలల ఆధునికీకరణ, అందరికీ ఉపయోగపడేలా బీచ్‌రోడ్డు పార్కు, సోలార్‌ రూఫ్‌టాప్‌, స్మార్ట్‌ బజార్లు, పార్కుల పునర్నిర్మాణం లాంటి కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. యూఎస్‌టీడీఏ డైరెక్టర్‌ ఎనోటి ఎబాంగ్‌ మాట్లాడుతూ మూడో ప్రణాళికకు సంబంధించిన నిధుల్ని అందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌, యూఎస్‌టీడీఏ సౌత్‌ ఈస్ట్‌ ఏసియా రీజనల్‌ డైరెక్టర్‌ హెన్రీ స్టెంగస్‌, సీనియర్‌ అడ్వయిజరీ క్లార్క్‌ జెర్వింగ్‌, సౌత్‌ ఏషియా కంట్రీస్‌ మేనేజర్‌ హెదర్‌ లారింగో, మరో ప్రతినిధి మెహనాజ్‌ అన్సారీ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పీఎంసీ ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రభు శీలవంత జరుగుతున్న అభివృద్ధిపై పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో వుడా వీసీ బసంత్‌కుమార్‌, జీవీఎంసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo