స్పందన అర్జీల పురోగతిపై సమీక్ష

స్పందన అర్జీల పురోగతిపై సమీక్ష
ప్రభుత్వంలో అవినీతి రహిత వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అమరావతి నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు.
స్పందన అర్జీల పురోగతిపై సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ఏ కార్యాలయానికి వెళ్లినా రూపాయి ఖర్చుకాకుండా పని అయిందని సామాన్యుడు సంబరపడే రోజు రావాలని ఆకాంక్షించారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడాలని, అప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. స్పందన అర్జీల పెండింగ్ శాతం 53 నుంచి 25 శాతానికి తగ్గిందని, ఇది మరింత మెరుగవ్వాలని సీఎం సూచించారు.
* ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి జిల్లాకు రూ. 14 కోట్లు ఇస్తున్నామని, తొలి విడతగా రూ. 7 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితి, మెరుగైన తర్వాత పాఠశాల పరిస్థితిపై ఫొటోలు తీసి ఆయా స్కూళ్ల ఆవరణలో పెట్టాలన్నారు.
అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయని సీఎం చెప్పారు.
* జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ జిల్లాలో స్పందన అర్జీల పరిష్కార వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమం పట్ల జిల్లా ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు.
పరిష్కారాల్లో స్పష్టత, సవివర నివేదికలకు ప్రాధాన్యం ఇచ్చామని, వీడియో కాన్ఫరెన్సు ద్వారా తహసీల్దార్లకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జేసీ శివశంకర్, శిక్షణ కలెక్టర్ వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు.