News

Realestate News

స్థిరాస్తి ప్రదర్శనప్రజలకు ఉపయుక్తం

స్థిరాస్తి ప్రదర్శనప్రజలకు ఉపయుక్తం
‘ఈనాడు’ విశాఖ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో 2017ను సందర్శించిన ఎంపీ హరిబాబు
బీచ్‌రోడ్‌, న్యూస్‌టుడే: స్థిరాస్తి ప్రదర్శన ప్రజలకు ఎంతో ఉపయుక్తమని విశాఖ ఎంపీ డాక్టర్‌ కె.హరిబాబు పేర్కొన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహిస్తున్న ‘ఈనాడు విశాఖ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో-2017’ను ఎంపి హరిబాబు ఆదివారం ఉదయం సందర్శించారు. ప్రాపర్టీ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఆయా స్థిరాస్తి సంస్థల వెంచర్లు, కల్పిస్తున్న సదుపాయాలు, రాయితీలు తదితరాలను ఆరా తీశారు. బ్యాంకులతో పాటు, ఇంటీరియర్‌ డెకరేషన్స్‌ స్టాల్స్‌ను సందర్శించారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ స్థిరాస్తి సంస్థలన్నింటినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచటం మంచి విషయమన్నారు. వచ్చే ప్రాపర్టీ షోలో రేరా చట్టానికి సంబంధించిన స్టాల్‌ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ప్రజలకు, డెవలపర్లకు ఉపయోగపడడంతో పాటు నగర విస్తరణకు ఈనాడు ప్రాపర్టీ ఎక్స్‌పో దోహదకారి కావడం ఆనందదాయకమని ఎంపీ పేర్కొన్నారు.

ముగిసిన ఎక్స్‌పో
రెండు రోజుల విశాఖ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో 2017 ఆదివారం రాత్రితో ముగిసింది. ఎక్స్‌పో టైటిల్‌ స్పాన్సర్‌గా ఎంవివి బిల్డర్స్‌ (ఎంవివి సిటీ) వ్యవహరించగా కో స్పాన్సర్స్‌గా పేరం గ్రూప్‌, శుభ గృహ సంస్థలు వ్యవహరించాయి. నగరంలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. బ్యాంకర్లు పాల్గొన్నారు.

లక్కీ డీప్‌ విజేతలు..
ఎక్స్‌పోను సందర్శించిన వారిలో 24 మందిని లక్కీ కూపన్లు ద్వారా విజేతలుగా ఎంపిక చేశారు. ముగింపు సభలో కూపన్లు డ్రా తీసి విజేతలకు బహుమతులు అందించారు. గిఫ్ట్‌ స్పాన్సర్లుగా లక్కీ షాపింగ్‌ మాల్‌, సౌందర్య స్మార్ట్‌ వరల్డ్‌ వ్యవహరించాయి. ఎంవివి బిల్డర్స్‌ అధినేత ఎం.వి.వి.సత్యనారాయణ కూపన్లు తీసి డ్రాలో గెలుపొందిన విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లక్కీ షాపింగ్‌ మాల్‌ అధినేత రత్తయ్య, స్వామి, ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి కె.వి.రామారావు, పేరం గ్రూప్‌ మార్కెటింగ్‌ హెడ్‌ బళ్లా శ్రీనివాసరావు, శుభగృహ ప్రతినిధులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 20 మంది విజేతలకు లక్కీ షాపింగ్‌ మాల్‌ ఒక్కొక్కరికి రూ.వేయి విలువైన గిఫ్టు కూపన్లను, సౌందర్య స్మార్ట్‌ వరల్డ్‌ నలుగురు విజేతలకు గిఫ్ట్‌ ఓచర్లను అందించాయి. ప్రాపర్టీ ఎక్స్‌పోలో పాల్గొన్న స్థిరాస్తి సంస్థలు, బ్యాంకర్లు, ఇంటీరియర్‌ డెకరేషన్‌ సంస్థలకు జ్ఞాపికలను ఎంవివి బిల్డర్స్‌ అధినేత ఎం.వి.వి.సత్యనారాయణ, ఈనాడు యూనిటü ఇన్‌ఛార్జి కె.వి.రామారావు చేతుల మీదుగా అందజేశారు.

మంచి స్పందన లభిస్తోంది..
మా సంస్థ ఎంవీవీ సిటీ పేరుతో మధురవాడ క్రికెట్‌ స్టేడియం ఎదురుగా పదెకరాల సువిశాల విస్తీర్ణంలో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్మిస్తోంది. అన్నీ మూడు పడకల గదుల సూపర్‌డీలక్స్‌ ఫ్లాట్లే. 12 బ్లాకుల్లో 1428 ఫ్లాట్లు నిర్మిస్తున్నాము. రెండు క్లబ్‌హౌస్‌లు, బ్యాంకు, సూపర్‌మార్కెట్‌, గెస్ట్‌రూమ్స్‌, బాంక్వెట్‌ హాల్‌, మూవీ థియేటర్‌, మహిళలు, పురుషులకు విడివిడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్‌లు, రెండు స్విమ్మింగ్‌పూల్స్‌, టెన్నిస్‌ కోర్ట్‌, బాస్కెట్‌బాల్‌ కోర్ట్‌, క్రికెట్‌ నెట్స్‌, జాగింగ్‌ ట్రాక్‌, చిల్డ్రన్‌ ప్లే ఏరియా, దేవాలయం తదితర సమగ్ర సదుపాయాలతో నిర్మిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ సూపర్‌డీలక్స్‌ ఫ్లాట్లను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రూ.5 లక్షల అడ్వాన్స్‌ చెల్లించి రెండు సంవత్సరాల అనంతరం ఫ్లాట్‌ అప్పగించిన తరువాత బ్యాంకు ఈఎంఐలు చెల్లించేలా ‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ పేరిట కొత్త పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. .

– ఎం.వి.వి.సత్యనారాయణ, ఎంవీవీ బిల్డర్స్‌ అధినేత

స్థిరాస్తి వ్యాపారానికి మంచి వూపు….
శుభగృహ సంస్థ విశాఖలో మూడు, విజయనగరంలో ఒకటి చొప్పున వెంచర్లను అభివృద్ధి చేసింది. ఆనందపురం, పెందుర్తి రహదారిలో 30 ఎకరాల్లో మరో వెంచర్‌ను నవంబర్‌లో ప్రారంభించబోతున్నాం. స్థిరాస్తి వ్యాపారం మళ్లీ క్రమంగా జోరందుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

– నంబూరి శంకరరావు, అధినేత, శుభగృహ

వేగంగా విక్రయమవుతున్నాయి
మేము రాష్ట్రవ్యాప్తంగా 24 వెంచర్లలో స్థలాల్ని విక్రయిస్తున్నాం. వాటిలో విశాఖలో ఉన్న 14 వెంచర్లలో స్థలాలను ఇటీవలికాలంలో చాలా వేగంగా కొనుగోలు చేస్తున్నారు. భూముల విక్రయాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. – పేరం హరిబాబు, అధినేత, పేరం గ్రూపు

రూ.800 వ్యత్యాసం…
ఇంటి నిర్మాణానికి స్థలం కొనాలన్నది మా ఆలోచన. క్షేత్రస్థాయిలో వెంచర్లను పరిశీలించాం. అక్కడ అధిక ధరలు చెప్పారు. ఇక్కడకు వచ్చి పరిశీలించాక చదరపు గజానికి రూ.800 తక్కువగా ఉంది. మధురవాడ ప్రాంతంలో నేను పరిశీలించిన వెంచర్లో చదరపు గజం రూ.4,500 చెప్పారు. అదే స్థలం ఇక్కడ రూ.3,700గా ఉందని తెలిసింది.

– ఎం.కోటేశ్వరరావు, వ్యాపారి