News

Realestate News

స్థిరాస్తి ఎంపికలో మూడు మెట్లు

స్థిరాస్తి ఎంపికలో మూడు మెట్లు
ప్రదేశమే కీలకమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌

ఇల్లు, ఫ్లాట్‌, స్థలం.. అందరూ కొంటున్నచోట తీసుకోవడమా.. లేక మన అవసరాలకు అనువైన ప్రాంతం ఎంపిక చేసుకోవడమా? ఎటూ తేల్చుకోలేక చాలామంది తర్జనభర్జన పడుతుంటారు. స్థిరాస్తి ఏదైనా ఎక్కడ కొనుగోలు చేస్తున్నామనేది కీలకం అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ఎందుకోసం ఖరీదు చేస్తున్నామో తెలిస్తే ఎక్కడ కొనాలో తెలుసుకోవడం తేలికవుతుందంటున్నారు.

నగరంలో స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసేది బడ్జెటే. సామాన్య, మధ్యతరగతి వాసులు తమ బడ్జెట్లో ఎక్కడ ఇళ్లు, స్థలాలు అందుబాటులో ఉన్నాయో చూస్తుంటారు. ఒకే ధరలో వేర్వేరు ప్రాంతాల్లో లభిస్తున్నట్లయితే తమ అవసరాలను తీర్చే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతమున్న మౌలిక వసతులే కాక భవిష్యత్తు అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలి. కొనేది ఇళ్లా, ఫ్లాటా, స్థలమా అనే దాన్ని బట్టి ప్రాధాన్యాలు మారుతుంటాయి.

స్థలం ఖరీదు చేస్తుంటే..
* సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు, భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువమంది స్థలాల వైపు చూస్తుంటారు.
* ప్రభుత్వం ప్రకటించే, చేపట్టే అభివృద్ధి పనులతో ఆయా ప్రాంతాల రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. ఆదిలోనే దీనిని గుర్తించి అక్కడ కొనుగోలు చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చు.
* మౌలిక వసతులైన రహదారులు, ఇతర సదుపాయాలు వచ్చే ప్రాంతాల్లో భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి దూరమైనా ఆయా ప్రదేశాల్లో తీసుకోవచ్చు.
* నివాసాల మధ్యన ఉన్న స్థలాల ధరలు చాలాకాలం స్తబ్దుగా ఉన్నా.. స్థలాల కొరత ఏర్పడగానే ధరలు వేగంగా పెరుగుతుంటాయి. సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నవారు వీటిని పరిశీలించవచ్చు.
* ఇన్నర్‌ రింగ్‌రోడ్డు చెంత చ.గజం రూ.30వేల ధరల శ్రేణిలో ఉన్నాయి. లోపలికి వెళ్లేకొద్దీ రూ.15వేల ధరల్లోనూ దొరుకుతున్నాయి.

ఫ్లాట్‌ కొంటున్నారా..
* పని ప్రదేశానికి దగ్గర ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం మేలు.
* ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో అనుసంధానం ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. వ్యక్తిగత వాహనాలు ఉన్నా ప్రజారవాణా ముఖ్యం.
* ప్రధాన రహదారికి పావు నుంచి అరకిలోమీటరు లోపల వరకు చూడొచ్చు.
* పిల్లలు చదివే పాఠశాలలకు సమీపంలో దొరికితే మరీ మంచిది.
* నివాసం ఉండాలంటే కొన్ని మౌలిక వసతులు అవసరం. ఆసుపత్రులు, మార్కెట్లు, వినోద కేంద్రాలు దగ్గరలో ఉంటే సౌకర్యమే. ఇవన్నీ మీరు చూసిన స్థిరాస్తి ప్రాంతంలో ఉంటే మరేం ఆలోచించకుండా తక్షణం నిర్ణయం తీసుకోవచ్చు.
* సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఈ తరహా సౌకర్యాలతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వెంట, ఐటీ కేంద్రాలకు చేరువున్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫ్లాట్లే కాదు పాతవీ దొరుకుతున్నాయి.
* రూ.25లక్షల నుంచి రూ.50 లక్షల ధరల శ్రేణిలో రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లు విక్రయిస్తున్నారు.

నగరానికి దూరంగా ఉంటున్న ప్రాంతాల్లో స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు చాలామందికి మంచి అవకాశాలు వస్తుంటాయి. అయితే భవిష్యత్తులో తాము ఇక్కడ ఉండమనే కారణంతో పెద్దగా ఆలోచించరు. తమ కళ్లముందే ధరలు పెరిగాక చింతిస్తుంటారు. మీరు అక్కడ తాత్కాలికంగా ఉంటున్నా.. స్థిరాస్తిలో మదుపు అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. వెళ్లేటప్పుడు అమ్మేసి మరోచోట తీసుకోవచ్చు.

వ్యక్తిగత ఇళ్లు కావాలంటే..
* వ్యక్తిగత ఇళ్లు మాత్రమే కొనాలనుకునేవారు మౌలిక వసతుల్లో కొంత రాజీ పడాల్సి ఉంటుంది. సరైన రహదారులు ఉండవు. పని ప్రదేశానికి దూరంగా ఉంటాయి. ప్రజారవాణా అంతంత మాత్రంగా ఉంటుంది. నాలుగైదేళ్లు ఇలాంటి ఇబ్బందులను అధిగమించగలం అనుకుంటే శివార్ల వైపు చూడొచ్చు.
* నగరం మధ్యలో ఉద్యోగం చేసేవారికి దూరమవుతుందేమో కానీ.. ఆయా ప్రాంతాల్లో పనిచేసేవారికి, వ్యాపారం చేసుకునేవారికి ఈ ప్రాంతాలన్నీ సమీపమే.
*  ఇటీవల వరకు పంచాయతీలుగా ఉన్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల అందుబాటు ధరల్లో వ్యక్తిగత గృహాలు లభిస్తున్నాయి.
* ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల లోపలకు వెళితే సౌకర్యవంతమైన ఇళ్లు రూ.50 లక్షల లోపు దొరుకుతున్నాయి. విస్తీర్ణం పెరిగేకొద్దీ ధర పెరుగుతుంది.
* బాహ్యవలయ రహదారికి లోపల, జాతీయ రహదారులకు అటూఇటూ రూ.30 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారికి సమీపంలో అయితే ధర పెరుగుతుంది.
* 100-240 గజాల విస్తీర్ణంలో కట్టి అమ్మే ఇళ్లు అందుబాటులో ఉన్నాయి.
* బాహ్యవలయ రహదారి చుట్టుపక్కల నుంచి ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌రోడ్డు వరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. రహదారికి దగ్గరలో రూ.5వేలు, రూ.10వేల నుంచి రూ.12వేల ధరలో చెబుతున్నారు. దూరం వెళితే రూ.3వేల ధరల్లోనూ లభిస్తున్నాయి.

విల్లాలు..
* ప్రశాంత వాతావరణంలో విలాసవంతంగా జీవించాలనుకునేవారు విల్లాల వైపు మొగ్గుచూపుతున్నారు. వారాంతాల్లో కుటుంబంతో గడిపేందుకు, అభిరుచులను కొనసాగించేందుకు తీసుకుంటున్నారు.భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడి పరంగా భావించేవారూ ఉన్నారు. తమకంటూ కొంత స్థలం ఉంటుందనేది వారి ఉద్దేశం.
* విల్లా గేటెడ్‌ ప్రాజెక్ట్‌లో నిర్మాణ సంస్థలు భద్రతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాయి. అత్యాధునిక రక్షణ వ్యవస్థను, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను సమాచారం కోసం ఉపయోగిస్తున్నాయి. చుట్టూ సౌర రక్షణగోడ ఉంటుంది. అపరిచిత వ్యక్తులు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండదు. సంబంధిత విల్లా నుంచి సెక్యూరిటీకి సమాచారమిస్తేనే తప్ప ప్రవేశం కష్టం. కాబట్టి ఇక్కడ భరోసాతో నివసిస్తుంటారు. పట్టణ సౌకర్యాలతో ఉన్న ఆధునిక పల్లెగా చెప్పుకునే విల్లాలో తమ తల్లిదండ్రులకు మంచి కాలక్షేపం అవుతుందని కొందరు తీసుకుంటున్నారు.
* శివార్లలో అధికంగా ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. జి+2 వరకు నిర్మిస్తున్నారు. విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.5కోట్ల వరకు అదరహో అన్పిస్తున్నాయి.
* బాహ్య వలయ రహదారి లోపల, బయట కేంద్రంగా ఎక్కువగా ఇవి ఉన్నాయి. శామీర్‌పేట, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌, ఆదిభట్ల, మహేశ్వరం, శంషాబాద్‌, నార్సింగ్‌, అప్పాజంక్షన్‌, మోకిల్లా, శంకర్‌పల్లి ప్రాంతాల్లోనూ విల్లా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

ఇంకా ఏం చూడొచ్చు అంటే..
* ఇప్పుడు అద్దెకు ఉంటున్న ప్రాంతంలో ధరలు అందుబాటులో లేకపోతే సమీపంలో వృద్ధికి అవకాశం ఉన్నవి ఎంపిక చేసుకుని కొనుగోలు మంచిది.
* అనూహ్యంగా ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. ఏడాదికాలంలో కొన్నిచోట్ల రెట్టింపయ్యాయి. పెట్టుబడి కోసమైతే అలాంటి చోట తప్ప స్థిరాస్తిలో ఎక్కడ మదుపు చేసినా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo