సుందర నగరం… ఎనలేని సంతసం
పారిశ్రామిక, పర్యాటక, ఐ.టి. పెట్టుబడుల వెల్లువ
నగరపారిశ్రామికవేత్తల్లో కొత్తవూపు
అత్యధిక ప్రతిపాదనలు సాకారంమయ్యే అవకాశం
ఈనాడు, విశాఖపట్నం

సుందర నగరం భారీ హిట్ కొట్టింది. ఇటీవల రెండు రోజులపాటు నగరంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో భాగంగా పలువురు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆయా ప్రతిపాదనలు సమర్పించిన వారందరూ వాటిని ఎలాగైనా నెలకొల్పాలన్న పట్టుదలతో ఉన్నవారే.
ఐ.టి. ప్రగతి
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఐ.టి. రంగానికి విశాఖ కేంద్ర బిందువుగా మారింది. అత్యధిక ఐ.టి. ఎగుమతులు విశాఖ నుంచే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో ఐ.టి.ని మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఐ.టి. సంస్థలకు అవసరమైన విస్తృత మౌలిక సదుపాయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్(ఐ.టి.పార్క్)ను ఏకంగా రూ.94,026కోట్లతో నిర్మించాలని భావిస్తోంది. నగర ఐ.టి. ప్రగతిలో ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చు. సుమారు నాలుగు వందల వరకు ఐ.టి. సంస్థలకు అవసరమైన భారీ స్థలాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫలితంగా నగరంలో ఐ.టి. కార్యకలాపాలు ఒక్కసారిగా వూపందుకోవడానికి రంగం సిద్ధమైంది. విస్తృత మౌలిక సదుపాయాలతో తమ కార్యకలాపాలను నేరుగా సాగించుకునేలా (ప్లగ్ అండ్ ప్లే) సిద్ధం చేస్తారు. చెంగ్డు గ్జిన్గ్రాంగ్ గ్రూపు ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది.
సాకారం దిశగా స్వామినారాయణ ఆలయం…
స్వామినారాయణ్ టెంపుల్ ట్రస్ట్ భుజ్‌లోనూ, లండన్‌లోనూ, న్యూయార్క్‌లోనూ ప్రసిద్ధ స్వామినారాయణ్ ఆలయాలను నిర్వహిస్తోంది. అత్యంత సుందరంగా ఆయా ఆలయాలకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వాస్తవానికి స్వామినారాయణ్ భక్తులే కాకుండా ఆలయ అందచందాల్ని ఆస్వాదించడానికి, ఆధ్యాత్మిక సాంత్వన పొందడానికి సైతం వేలాది మంది భక్తులు వచ్చేలా ఆయా ఆలయాల్ని నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో విశాఖ కేంద్రంగా ఓ ఆలయాన్ని నిర్మించడానికి గుజరాతీ సంఘీయులు నిర్ణయించారు. ఆమేరకు రూ.150కోట్లతో 30ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించడానికి స్వామినారాయణ్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఎం.ఒ.యు. కుదుర్చుకున్నారు. నగర ఆధ్యాత్మిక సిగలో ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దుతామని స్వామినారాయణ్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ప్రధాని మోదీ సైతం ఆలయ భూమి పూజ చేయడానికి వస్తానని గుజరాతీ పెద్దలకు మాట ఇచ్చారని అనుమతులు, భూకేటాయింపులు పూర్తైన మరుసటి రోజునే నిర్మాణం ప్రారంభిస్తామని వివరిస్తున్నారు.
* దీంతోపాటు నగరంలో అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రాన్ని కూడా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించబోతున్నారు. ఏకంగా రూ.40వేల కోట్లతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు దేశంలోని ప్రముఖ కన్వెన్షన్ కేంద్రంగా వర్థిల్లబోయే అవకాశం ఉందంటే అతిశయోక్తికాదు. దీన్ని ముఖ్యమంత్రి ఒక్క సంవత్సరంలోనే నిర్మించి… 2018వ సంవత్సర భాగస్వామ్య సదస్సును అందులోనే నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఉన్నారని పలువురు సి.ఐ.ఐ. ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇది సాకారమైతే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యకమాలకు నగరం వేదికగా మారి నగర ప్రతిష్ఠ ప్రపంచ దేశాల్లో మారుమోగనుంది.
* యుట్రాన్స్ ఇండియా అనే సంస్థ పర్యాటక నౌకలు నిర్వహించే ఓ ప్రాజెక్టును రూ.17కోట్లతో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
* వెదురు ఉత్పత్తుల తయారీకి వీలుగా రూ.350 కోట్లతో ఓ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి కూడా మోజో బాంబూ అండ్ ఎకో ప్రొడక్ట్స్ అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సంస్థ విశాఖలోగానీ, కాకినాడలో గానీ రావడానికి అవకాశం ఉంది. పెట్టుబడి తక్కువగానే ఉన్నప్పటికీ అత్యధిక మందికి ఉపాధి ఈ పార్కు ద్వారా లభించడానికి అవకాశం ఉంది. సుమారు 31,900 మందికి ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ వెల్లడించింది.
* ఎ.పి.సి./ఎస్.బి.ఎస్., మెంబ్రేన్లు, పి.వి.సి. మెంబ్రేన్‌ల ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రూ.412 కోట్లతో నిర్మించేందుకు టెక్నికోల్ కార్పొరేషన్, సన్‌గ్రూప్ ఎంటర్‌ప్రైజెస్‌లు ముందుకు వచ్చాయి.
* ట్రాన్స్‌వరల్డ్ అనే సంస్థ పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునేవారికి అవసరమైన అంకుర సంస్థను ఏర్పాటుచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రూ.15కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా 220 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది.
* వీటికి అదనంగా నగర పర్యాటకాన్ని పతాక స్థాయికి చేర్చేలా ఏకంగా రూ.3,100కోట్ల పెట్టుబడులు రావడానికి ఒప్పందాలు కుదిరాయి. ఫలితంగా నిత్యం నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య లక్షలాదిగా పెరగడానికి మార్గం సుగమం అయ్యింది. పర్యాటకుల రాకతో నగర ఆర్థిక వ్యవస్థ భారీగా పెరగనుంది. ప్రపంచంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే రంగంగా పర్యాటక రంగం గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పర్యాటక ప్రాజెక్టులు నగరానికి వస్తుండడంతో ఉపాధి అవకాశాలు నగరంలో జోరందుకోనున్నాయి.
స్థిరాస్తి వ్యాపారానికి వూపు….
* నగరంలో కొద్దికాలంగా నీరసించిపోయిన స్థిరాస్తి వ్యాపారానికి మళ్లీ కొత్తకళ వచ్చినట్లైంది. భారీ ఎత్తున వచ్చే ప్రాజెక్టుల్ని చూపి స్థిరాస్తి సంస్థలు పలు ప్రాజెక్టుల్ని చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా నిర్మాణరంగం వూపందుకుని పలువురికి ఉద్యోగావకాశాలు రావడానికి మార్గం సుగమం అంవుతుంది.