సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం వర్సిటీ ప్రఖ్యాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో వీసీ ఆచార్య ఎం.ఎస్.ప్రసాదరావు సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.పోతరాజు, సీఐటీడీ ప్రిన్సిపల్ డైరెక్టర్ సుజయత్ఖాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీసీ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులకు నూతన టెక్నాలజీలపై అవగాహన కల్పించడానికి, ఇంటర్న్‌షిప్‌కు, ఉద్యోగావకాశాలు విస్తృతం చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు. సీఐటీడీ నిపుణులకు గీతంలో పరిశోధనలు నిర్వహించడానికి, ఎంటెక్ తదితర కోర్సులు చదవడానికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఈ మాదిరిగానే గీతం విద్యార్థులు బాలానగర్(హైదరాబాద్)లోని సీఐటీడీ ప్రయోగశాలల్లో సాంకేతిక నిపుణతను అవగాహన చేసుకోవడానికి, బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు ప్రాజెక్టులపై పనిచేయడానికి, ప్లాంట్ల్లో శిక్షణ కార్యక్రమాలు పొందడంలో భాగంగా వివిధ సర్టిఫికెట్ కోర్సులు చదవడానికి వీలుంటుందన్నారు. ప్రధానాచార్యులు కె.లక్ష్మీప్రసాద్, సి.ధర్మరాజు, టెక్విప్ కో-ఆర్డినేటర్ ఆచార్య ఎం.ఆర్.ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.