News

Realestate News

సింహగిరిపై రేపు ఉత్తర ద్వార దర్శనం

సింహగిరిపై రేపు ఉత్తర ద్వార దర్శనం
భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
సింహాచలం, న్యూస్‌టుడే: ధర్మ సంస్థాపన కోసం అవతరించి, శరణు వేడే భక్తులను కాపాడే సృష్టికర్త శ్రీమన్నారాయణుడిని వైకుంఠంలో ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. అంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినంనాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. సింహగిరిపై శుక్రవారం ఉదయం 5 గంటలకు శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామికి గురువారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సుప్రభాతసేవ, ఆరాధన ఉంటాయి. అనంతరం సర్వాభరణ భూషితుడిగా అలంకరించి, ఉభయ దేవేరులతో ముత్యాల పల్లకిలో అధిష్ఠింపజేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు బేడ సేవ నిర్వహించాక 5 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులకు ఉత్తర ద్వారంలో స్వామి దర్శనం కల్పిస్తారు. తర్వాత స్వామి ఉత్తర గోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేధికపై భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 9.30 గంటల తర్వాత స్వామి తిరువీధి ఉత్సవం జరుగుతుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యకల్యాణోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మహానివేదన ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు స్వామి దర్శనం లభించదు. దేవస్థానం అధికారులు భక్తుల రాకకోసం అదనపు క్యూలైన్లు, షామియానాలు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర గోపురం వద్ద స్వామిని అధిష్ఠింపజేసేందుకు పుష్ప అలంకరణతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు.