సింగపూర్ తరహా పోలీసింగ్

బ్రిక్స్ సదస్సుకు ఘనంగా ఏర్పాట్లు చేయండి
వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
‘విశాఖ నగరంలోని పోలీసు వ్యవస్థను సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తా. నేరాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలి. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు విశాఖలో జరగనున్న బ్రిక్స్ దేశాల సదస్సుకు సుమారు 650 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కూడా ఇక్కడే జరగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని నగరం అత్యంత సుందరంగా ఉండేలా తీర్చిదిద్దండి. తుపాన్లు, వాయుగుండాల సమయంలో ముంపు ఇబ్బందుల్లేకుండా విమానాశ్రయంలో మురుగుకాల్వలను నిర్మించండి’
– చంద్రబాబునాయుడు.
ఈనాడు – విశాఖపట్నం
నగరంలో పోలీసు వ్యవస్థ మరింత భద్రం కానుంది. జీపీఎస్ వ్యవస్థ ఉన్న 70 వాహనాలు ఇప్పటికే నగరంలో ఉన్నాయి. వీటికి మరో 25 ద్విచక్ర వాహనాలు తోడయ్యాయి. వీటిని లారస్ సంస్థ సమకూర్చింది. దీనివల్ల రాత్రి గస్తీ మరింత పటిష్టం కానుంది. వాహనం బయలుదేరిన సమయం నుంచి ఏ మార్గం గుండా ప్రయాణించింది? ఏ సమయంలో ఎక్కడుంది? ఎంత సమయం ఎక్కడ ఆగింది తదితర వివరాలన్నీ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఫలితంగా గస్తీ పోలీసుల్లో సైతం జవాబుదారీతనం మరింత పెరిగుతుంది. ఏదైనా నేరం జరిగితే సంఘటన స్థలానికి వెంటనే సిబ్బందిని పంపడం ఉన్నతాధికారులకు సులభమవుతుంది. ఈ వాహనాలను మంగళవారం సాయంత్రం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసులకు అందజేశారు.
రాత్రి గస్తీ తిరగడానికి ప్రస్తుతం 23 డీకోల్ట్ వాహనాలున్నాయి. తాజాగా వచ్చిన 25 వాహనాలను కూడా డీకోల్ట్స్ వాహనాలుగా వినియోగించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో సుమారు వందకు పైగా బీట్లలో పోలీసులు తిరుగుతున్నారు. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఎంవీపీ, మూడోపట్టణం, ద్వారకా, నాలుగోపట్టణం, ఆరిలోవ, గాజువాక, కంచరపాలెం పోలీసుస్టేషన్లకు రెండు చొప్పున వాహనాలను కేటాయించి గస్తీని ముమ్మరం చేయనున్నట్లు డీసీపీ రవికుమార్‌మూర్తి వెల్లడించారు.
నగర పోలీసింగ్‌పై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి….
నగర పోలీసింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. మరింత ఆధునిక పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని విశాఖ విమానాశ్రయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన హామీ ఇచ్చారు. నగర సీపీ యోగానంద్ నగరంలో శాంతిభద్రతలు పెంపొందించడానికి తీసుకున్న చర్యలను వివరించారు. సీఎం మాట్లాడుతూ నగరంలో సింగపూర్ తరహా అధునాతన పోలీసింగ్ ఉండేలా తీర్చిదిద్దడానికి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
నగరానికి మళ్లీ కొత్త అందాలు….
నగరం మళ్లీ కొత్త అందాలు, సోయగాలతో కళకళలాడనుంది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి జరగబోయే బ్రిక్స్ సదస్సుకు 650 మంది దేశ, విదేశీ ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో నగరాన్ని అత్యంత సుందరంగా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.
మంగళవారం విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత అరకు ప్రాంతంలో పర్యటించారు. ఆయన దత్తత తీసుకున్న పెదలబుడులో గిరిజనులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ గ్రామంలో తాను చేయబోతున్న పనులను వివరించారు.
సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి తిరిగొచ్చిన ఆయన జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రిక్స్ సదస్సు వివరాలతో రూపొందించిన పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం తూర్పునౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్.సి.ఎస్.బిస్త్‌తో భేటీ అయ్యారు. మంత్రి కిమిడి మృణాళిని, ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.