సాహసమే శ్వాసగా

ఎత్తైన మంచు పర్వతాలను అధిరోహించిన తూర్పునౌకాదళ నావికులు
తూర్పు నౌకాదళానికి చెందిన నావికులు దేశంలోనే ఎత్తైన మంచుపర్వతాలుమౌంట్ కామెట్, అభిగామిన్లను విజయవంతంగా అధిరోహించారు. 40 రోజుల పాటు సాగిన సుదీర్ఘ ప్రయాణం ముగియడంతో బృంద సభ్యులను
నేవీ ఉన్నతాధికారులు అభినందించారు. – న్యూస్‌టుడే, సింధియా
దేశంలోని ఎత్తైన మంచు పర్వతాలు కాంచన గంగ, నందాదేవి శిఖరాలను సాహసికులు అధిరోహించకుండా భారత ప్రభుత్వం ఎనిమిదేళ్ల కిందట నిషేధాన్ని విధించింది. వాటి తర్వాత అంతటి ప్రాముఖ్యం గల శిఖరాలుగా మౌంట్ కామెట్ (7,756 మీటర్లు), అభిగామిన్లు గుర్తించబడ్డాయి. తూర్పు నౌకాదళానికి చెందిన సాహస బృందం ఒకటి ఈ రెండు పర్వతాలను అధిరోహించడానికి నిశ్చయించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన (9+4) 13 మందితో కూడిన బృందం బయలుదేరింది. ఈ సాహస యాత్రను ఈస్ట్రన్ నేవల్ కమాండులో వైస్‌అడ్మిరల్ హెచ్‌సీ.బిస్త్ జెండా వూపి ప్రారంభించారు. ఈ బృందానికి నాయకుడిగా కార్తికేయన్, ఉప నాయకుడిగా యోగేష్తివారి వ్యవహరించారు.
శిఖరాలు ఎక్కారిలా…
ఈ రెండు శిఖరాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. మౌంట్కామెట్ను 9 మందితో కూడిన బృందం, అభిగామిన్ను నలుగురితో కూడిన బృందం అధిరోహించడానికి బయలుదేరాయి. కామెట్ శిఖరాన్ని జూన్ రెండో తేదీన అధిరోహించి జాతీయపతాకంతో పాటు నౌకాదళ జెండాను సాహసికులు ఎగురవేశారు. అభిగామిన్ శిఖరాన్ని జూన్ 4వ తేదీన రెండో బృందం అధిరోహించింది.
మే నెలకు ముందు… : ఈ ఏడాది మే నెలకు ముందుగా దక్షిణ భారతదేశంలోనే ఎతైన జంట శిఖరాలైన జోగిన్-1 (6,465 మీటర్లు), జోగిన్-3 (6,133మీటర్లు)లను భారత నౌకాదళ బృందమే అధిరోహించింది. నౌకాదళ సిబ్బంది పర్వతారోహణానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ఎత్తైన శిఖరాలపై భారత నౌకాదళం అడుగులు వేగంగా పడుతున్నాయని నేవీ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 2017లో మౌంట్ ఎవరెస్టును ఎక్కేందుకు మరో నౌకాదళ బృందం ఇప్పటి నుంచే కసరత్తు సాగిస్తోందని నేవీ వర్గాల సమాచారం.
ప్రత్యేక అభినందనలు
ఈ సాహస యాత్రను దిగ్విజయంగా ముగించిన బృంద నాయకుడు కమాండర్ కార్తికేయన్, ఇతర సభ్యులకు ఈస్ట్రన్నేవల్ కమాండు చీఫ్ వైస్‌అడ్మిరల్ హెచ్‌సీ.బిస్త్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సాహసికులు లెఫ్ట్‌నెంట్లు బీపీ.ఉపాధ్యాయ, రజినీకాంత్యాదవ్, అనంత కుక్రేటి, ఎస్.షెరావత్, రాకేష్‌కుమార్, ఎ.ఎస్.రాణా, మహారాణాలు ఉన్నారు.