సాగర తీరం పారిశ్రామిక హారం!
విశాఖపట్నం, ఈనాడు

38 ఒప్పందాలు.. 2,422 ఎకరాలు..
ఈ ఏడాది జనవరిలో విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. 38 సంస్థలు విశాఖలో పరిశ్రమలు రూ. 47,193 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వీటి ఏర్పాటుకు ఇప్పటికే 2,442 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం సిద్ధంచేసింది.
చిన్న పరిశ్రమలు.. పెద్ద ప్రోత్సాహం..
జిల్లాలో 31 చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు రూ. 1.64 కోట్ల రాయితీకి కలెక్టర్ యువరాజ్ అనుమతి ఇచ్చారు. సింగిల్ విండో, సింగిల్ డెత్ విధానం ద్వారా పరిశ్రమల స్థానంకు అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, వుడా, జీవీఎంసీ, అగ్నిమాపక, డీపీవో, జలవనరుల శాఖలో పరిష్కారం కాని దరఖాస్తులపై దృష్టిసారించారు. అపరిష్కృత దరఖాస్తులు వారంరోజుల్లో పరిష్కరించాలని ఇటీవల సమీక్షలో నిర్ణయించారు.
ఉపాధి తం: జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది 116 చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 2014-15లో 92,870 మందికి ఉపాధి కల్పిస్తే.. 2015-16లో 93,408 మందికి ఉపాధి కల్పించారు. ఉపాధి కల్పనలో 17 శాతం వృద్ధిరేటు సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిశ్రమల విస్తరణతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు.
పట్టాలెక్కుతున్న ప్రగతి: విశాఖ నగరంతోపాటు గ్రామీణ జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, అనకాపల్లి ప్రాంతాలు పారిశ్రామికీకరణకు అనుకూలంగా మారాయి. ఇప్పటికే వేలాది ఎకరాల భూముల సేకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. భూముల రైతులకు పరిహారం కూడా ఆశాజనకంగా ఇచ్చే దిశగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని భూములు సేకరించగా మరికొన్ని సేకరణ దశలో ఉన్నాయి.
ఒప్పందాలు అమలయ్యేలా చర్యలు: విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పరిశ్రమల ఏర్పాటుకు జరిగిన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంతోపాటు భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఇప్పటికే నక్కపల్లిలో 7 వేల ఎకరాలు, అచ్యుతాపురంలో 3 వేల ఎకరాలు సేకరించి పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో అందరికీ ఉపాధి కల్పించాలన్నది మా ముందున్న లక్ష్యం. జిల్లాలో సర్వే నిర్వహించి ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తిస్తున్నాం. రానున్న పరిశ్రమల్లో చదువుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తాం.