సాగర తీరం.. త్రివర్ణ శోభితం!

విశాఖపట్నం, ఈనాడు: మువ్వన్నెల రెపరెపలతో జిల్లా మురిసిపోయింది.. వాడవాడలా స్వాతంత్య్ర స్ఫూర్తి రగిలింది. సోమవారం పంద్రాగస్టు వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ జాతీయ పతాకం ఆవిష్కరించారు. విశాఖలోని రాష్ట్ర సమాచార కేంద్రంలో ఇన్‌ఛార్జి డీపీఆర్వో కె.సుమిత్రాదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రంథాలయ అధికారి ఝాన్సీ రత్నాబాయి, ఏపీఆర్వోలు రామకృష్ణ, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖ అటవీ సర్కిల్ కార్యాలయంలో అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ప్రతీప్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) కార్యాలయ ఆవరణలో ఛైర్మన్ యు.సుకుమారవర్మ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈవో అట్లూరి వీరబాబు, జీఎం డీవీఎస్ వర్మ, డైరెక్టర్లు, డీజీఎంలు, ఏజీఎంలు పాల్గొన్నారు.
జిల్లాపరిషత్తు కార్యాలయంలో జడ్పీ ఛైర్పర్సన్ లాలం భవానీ జాతీయ పతాకం ఆవిష్కరించారు. సీఈవో జయప్రకాష్‌నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో సరోజిని, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎస్ఈ తోట ప్రభాకరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవో కృష్ణకుమారి, ఉద్యానశాఖ కార్యాలయంలో ఏడీ శైలజ తదితరులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద జేడీ వెదురుపాక సత్యనారాయణ, డ్వామా కార్యాలయంలో పీడీ కల్యాణ చక్రవర్తి, డీఆర్డీఏ కార్యాలయంలో పీడీ డాక్టర్ సత్యసాయిశ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు సంస్థల్లో, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థల్లో వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు వైభవంగా జరిగాయి.