‘సాంకేతిక విద్య’.. సాకారం
‘సాంకేతిక విద్య’.. సాకారం
పెందుర్తిలో అందుబాటులోకి పాలిటెక్నిక్ కళాశాల
ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులకు శ్రీకారం
వేలాది మంది విద్యార్థులకు ఉపయుక్తం
దశాబ్దాలుగా పెందుర్తిలో పాలిటెక్నిక్ కళాశాల నెలకొల్పాలన్న కల ఎట్టకేలకు సాకారమైంది. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కృషి ఫలితంగా ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి రూ.9.27కోట్ల నాబార్డ్ నిధులు మంజూరయ్యాయి. నూతన భవనం నిర్మాణ పనులకు ఆగస్టు 2016లో శ్రీకారం చుట్టారు. ఏడాదిన్నర కాలంలోనే పనులు పూర్తి చేసుకుంది.
గత నెలలో మంత్రి గంటా శ్రీనివాసరావు కళాశాల
భవనాలను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని ప్రారంభోత్సవ సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇప్పటికే అనుమతుల మంజూరుకు ఏఐసీటీఈ ప్రతినిధులు ఇక్కడి వచ్చి వసతులను పరిశీలించి వెళ్లారు.
రెండు బ్లాకుల నిర్మాణం పూర్తి
* ప్రస్తుతం తరగతుల ప్రారంభానికి అనువుగా రెండు బ్లాకుల్లో భవనాలను నిర్మించారు. త్వరలోనే మరో రెండు బ్లాకులను నిర్మించనున్నారు. * ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశాల్లో భాగంగా ఈ కళాశాలలో విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. *ప్రస్తుతం నిర్మించిన బ్లాకుల్లో అయిదు విభాగాధిపతుల గదులు, 12 తరగతి గదులు, ఒక విశాలమైన గ్రంథాలయం, 12 ప్రయోగశాలతోపాటు ప్రిన్సిపల్ గది, డ్రాయింగ్ గదులు నిర్మించారు. * కళాశాల అవసరాల కోసం 60వేల కిలోలీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకు ఏర్పాటు చేశారు. * ఏడు ఆధునిక మరుగుదొడ్లను నిర్మించారు. ప్రస్తుతానికి విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగం
పెందుర్తి నియోజకవర్గం విద్యా సంస్థలకు కేంద్రంగా మారుతోంది. పెందుర్తిలో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి రావడం వల్ల వేలాది మంది విద్యార్థులు నగరానికి వెళ్లే అవస్థలు తప్పుతాయి. అత్యధిక ఫీజులు చెల్లించి ప్రయివేటు కళాశాలలకు వెళ్లే అవసరం ఉండదు. కష్టపడి చదివిన విద్యార్థులు స్థానికంగా సాంకేతిక విద్యను నేర్చుకుని ఉపాధి పొందవచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఫర్నీచర్ ఏర్పాటుకు రూ. 50లక్షల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే మిగిలిన బ్లాకుల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం.
కళాశాలలో కోర్సులు ఇవీ..
* సివిల్ ఇంజినీరింగ్
* మెకానికల్ ఇంజినీరింగ్
* ఈసీఈ
* ఈఆర్ఈ
* ప్రతి విభాగంలో 60 సీట్ల చొప్పున 240 మంది విద్యార్థులకు అవకాశం లభించనుంది.
* డిమాండ్ ఉన్న కోర్సులనే ప్రవేశపెట్టడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు నగరానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
నగరంలో మూడోది..
* ప్రస్తుతం విశాఖ జిల్లాలో ఏడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. నగరంలో రెండు, భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, పాడేరులో ఒక్కోటి చొప్పున ఉన్నాయి.
* ప్రస్తుతం పెందుర్తిలో కళాశాల నిర్మాణం పూర్తవడంతో నగరంలో మూడో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చినట్లయింది.
* పెందుర్తి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల విద్యార్థులు సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.