News

Realestate News

సమాజానికి సహజ రక్ష!


సమాజానికి సహజ రక్ష!

స.హ. ఆయుధంతో అక్రమాలకు అడ్డుకట్ట
చట్టం అమలులోకి వచ్చి నేటికి 13 ఏళ్లు
అమలులో తగ్గుతున్న అధికారుల చొరవ
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, మాడుగుల

సమాజానికి సహజ రక్ష!  సమాచార హక్కు చట్టం సామాన్యులకు బ్రహ్మస్త్రంలాంటింది.

ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

అధికారులకు వారి బాధ్యతను తెలియజేసింది.

అక్రమార్కుల ఆగడాలకు చెక్‌ పెట్టింది.

ప్రజలు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

సామాన్యుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.

అయితే అక్కడక్కడా చిన్నచిన్న లోపాలతో చట్టం పదును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటు అర్జీదారులు.. అటు అధికారులు స్వలాభంతో చట్టాన్ని కోరులు లేని పాముగా మార్చేస్తున్నారు.

2005 అక్టోబర్‌ 12 నుంచి అమలులోకి వచ్చి నేటికి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న స.హ.చట్టంతో జిల్లాలో మంచి ఫలితాలు సాధించిన వారూ ఉన్నారు.

స.హ. దరఖాస్తు అనగానే భయపడేవారు ఉన్నారు.

అది ఏవిధంగా కార్యరూపంలోకి వచ్చిందో తెలిపే ప్రత్యేక కథనమిది.

సమాచార స్వేచ్ఛ ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా, మిగిలిన అన్ని స్వేచ్ఛలకు గీటురాయిగా ఉండాలని ఐక్యరాజ్య సమితి 1949లో తీర్మానించింది.

ఇది ప్రపంచవ్యాప్తంగా సమాచార హక్కుకు ప్రాధాన్యం కల్పించింది.

మన దేశంలో రాజస్థాన్‌లోని సోహన్‌గఢ్‌ గ్రామంలో 1990లో మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ స్థాపించారు.

గ్రామీణ ప్రజలకు గ్రామ పంచాయతీ అధికారులు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.

ఇది సహ చట్టానికి ఓ స్ఫూర్తిగా నిలిచింది.

1997లో ఎన్‌డీఏ ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ బిల్లును రూపొందించి 2000లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

2002లో అది చట్టంగా మారి 2003 నుంచి అమలు చేయాలనుకున్నా సాధ్యపడలేదు.

2004లో యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టి అమలులోకి తెచ్చింది.