సమగ్ర భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు విద్యుత్తు కేబుళ్లతో పాటే బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్వర్కు లైన్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశం
వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ నగరంలో సమగ్ర భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ యువరాజ్ జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీరు ఆనందరావును ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఏపీడీసీఎల్ భూగర్భ కేబుల్ వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. పనిలో పనిగా బిఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్వర్కు, జీవీఎంసీ పరంగా ఏర్పాటు చేసే తాగునీటి పైపులైన్లతో భూగర్భ వ్యవస్థలో భాగంగా ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై కలెక్టర్ యువరాజ్ మంగళవారం సమాచాలోచనలు జరిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబరులో నిర్వహించిన సమీక్షకు ఏపీఈడీసీఎల్ సీఎండీ రేవు ముత్యాలరాజు, వుడా వీసీ బాబూరావునాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ శాఖల పరంగా ఏర్పాటుచేస్తున్న కేబుల్ వ్యవస్థలన్నీ భూగర్భంలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనికి తగ్గట్టుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థ తొలిదశ పనులకు జూన్ 15లోగా టెండర్లు పిలవాల్సి ఉందని, ఆలోపే మిగతా వాటి విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఏపీడీసీఎల్ ఉన్నతాధికారి రమేష్ ప్రసాద్ తెలిపారు. నాలుగు దశల్లో భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులను అమలు చేస్తామని చెప్పారు. కిలో మీటరు నిడివి గల కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు ఎంతమేర ఖర్చవుతుందో అంచనాలు వేయాలని జీవీఎంసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.