News

Realestate News

సబ్బవరాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతాం!

vizag real estate news

సబ్బవరాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతాం!
సబ్బవరం, న్యూస్‌టుడే: విశాఖ నగరం అంతర్జాతీయంగా ఎదగబోతోందని అదే స్థాయిలో సబ్బవరాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సబ్బవరం మండలం వంగలిలో ఏర్పాటు చేస్తున్న పెట్రో యూనివర్సిటీ శంకుస్థాపన పనులను సమీక్షించేందుకు ఆయన బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సబ్బవరం మండలంలో ఇప్పటికే మూడు యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయని, మరోమూడు విద్యాసంస్థలు రాబోతున్నాయన్నారు. వేలాదిమంది విద్యార్థులు ఈ మండలంలో చదువుకుంటారన్నారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థాపించనున్న పెట్రో వర్సిటీకి సంబంధించి ఆంధ్రాయూనివర్సిటీలో తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను సీపీఎం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ బెదిరింపులకు తాము తలొగ్గేది లేదన్నారు. కొత్త చట్టం ప్రకారం రైతులకు 100శాతం పరిహారాన్ని చెల్లిస్తామన్నారు.

వర్సిటీ భవనాలను రెండేళ్లలో పూర్తిచేస్తాం: ఎంపీ ముత్తంశెట్టి
పెట్రో వర్సిటీ భవనాల నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేస్తామని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. పెట్రో ఇంజినీరింగ్‌ కోర్సులో 45 మంది, పెట్రో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో మరో 45 మందికి తరగతులు జరుగుతున్నాయన్నారు. పెట్రో వర్సిటీకి కావలసిన నిధులను హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ తదితర సంస్థలు సమకూరుస్తున్నాయన్నారు. డిగ్రీ కోర్సులతో పాటు పీజీ రీసెర్చ్‌ కోర్సులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఇక్కడ చదువులు పూర్తిచేసిన వారికి 100శాతం ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, నేతలు గండి దేముడు, బుచ్చిరాజు, గవర శ్రీనివాసరావు, కె.వి.వి.సత్యనారాయణ, కె.శ్రీను పాల్గొన్నారు.