సత్తా చాటుతున్న భారత్ నౌకలు కొనసాగుతున్న అంతర్జాతీయ మారిటైం విన్యాసాలు
సింధియా, న్యూస్టుడే : విదేశీ సముద్ర తీరాల్లో జరుగుతున్న అంతర్జాతీయ మారిటైం విన్యాసాల్లో భారత ఈస్ట్రన్ ఫ్లీట్ నౌకలు చురుగ్గా పాల్గొంటున్నాయని నేవీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అండమాన్ సాగరతీరంలో ఐఎన్ఎస్ శివాలిక్, సహ్యాద్రి, జ్యోతి, కమోర్తా నౌకలు తమదైనశైలిని కనబరుస్తున్నాయని పేర్కొన్నాయి. దక్షిణ హిందూ మహాసముద్ర కమాండుకు చెందిన ఈస్ట్రన్ ఫ్లీట్ కమాండర్, రియర్ అడ్మిరల్ బిశ్వజిత్దాసుగుప్తా పర్యవేక్షణలో ‘యాక్టు ఈస్ట్ పాలసీ’కి లోబడి విన్యాసాలు కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. సింగపూర్, మలేషియా, జకార్తా, ఆస్ట్రేలియా తీరాల్లో ఆయా దేశాల నౌకాదళంతో సంయుక్తంగా విన్యాసాల్లో పాల్గొంటున్నాయని వివరించాయి. వార్షిక సింగపూర్- ఇండియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సింబిక్స్-17 విన్యాసాలు, ఆస్ట్రేలియాతో ఆసింబిక్స్-17 విన్యాసాల్లో నౌకలు తమ సత్తాను చూపుతున్నాయన్నారు. కొన్ని విన్యాసాలను భారత నౌకాదళం అడ్మిరల్ సునీల్లాంబ పర్యవేక్షిస్తున్నారని తెలిపాయి.