News

Realestate News

షాక్‌..!

Cancellation of 500 and 1000 , vizagrealestate

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు

ఉలిక్కిపడ్డ నగర జనం
చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం
నల్లధనం, దొంగనోట్లపై మోదీ తిరుగులేని అస్త్రం

పెను సంచలనం…నల్లధనాన్ని బయటకు తీసేందుకు.. దొంగనోట్ల చలామణీని అడ్డుకునేందుకు రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన మరుక్షణమే నగరవ్యాప్తంగా తీవ్రస్థాయిలో కలకలం… ఏయే రంగాలపై తక్షణ ప్రభావం ఉంటుందన్నదానిపై చర్చ ఒకవైపు…కొత్త నోట్లు వచ్చే వరకు పరిస్థితి ఏమిటన్నదానిపై సామాన్య జనం కలవరం మరోవైపు… స్థిరాస్తి, బంగారం తదితర రంగాలు సహా చిన్న, మధ్యస్థాయి వ్యాపారాల మార్కెట్‌ మనుగడపై రకరకాల విశ్లేషణలు…నల్లధనం, దొంగనోట్ల చలామణీని అడ్డుకోవటానికి ఇదే సరైన విధానమంటూ సామాన్య, ఉద్యోగవర్గాల హర్షాతిరేకాలు..వెరసి మోదీ ప్రకటనపై ఒకటే చర్చ.

నల్లధనాన్ని బయటకు వచ్చేలా చేసేందుకు, దొంగ్లనోట్ల చలామణీని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తక్షణమే రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ సమాచారం ప్రసార సాధానాల ద్వారా తెలుసుకున్న జనం రూ. 500, రూ. 1000 నోట్లతో వివిధ బ్యాంకుల డిపాజిట్‌ మిషన్ల వద్దకు పరుగులు తీశారు. వాస్తవానికి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటి స్థానంలో వంద నోట్లను తీసుకోవచ్చు. రూ. 500, రూ.వెయ్యినోట్లు చెల్లక, వందనోట్లకు కొరత ఏర్పడితే పరిస్థితి ఏమిటన్నది చాలామందిలో ఉన్న ఆందోళన. కొత్తనోట్లు వెంటనే అందుబాటులోకి వస్తాయా? అని కొంతమందిని తీవ్రంగా వేధిస్తున్న మరో ప్రశ్న. ఇటీవలి కాలంలో బ్యాంకులు కూడా అత్యధికంగా రూ. 500, రూ. 1000 నోట్లనే వినియోగిస్తున్నాయి. ఏదైనా ఎ.టి.ఎం. కేంద్రానికి వెళ్లి రూ. 10 వేలు తీసుకుంటే అందులో అయిదు వందనోట్లు తప్ప మిగిలినవన్నీ రూ. 500 నోట్లే వస్తున్నాయి. ఆసుపత్రుల్లోనూ, రైల్వేస్టేషన్లలోనూ, పెట్రోలు బంకుల్లోనూ ఈ నెల 11వ తేదీ అర్థరాత్రి వరకు రూ. 500, రూ.వెయ్యినోట్లు చెల్లుబాటయ్యే వెసులుబాటు ఉంది.
క్యూలు కట్టిన ప్రజలు…: నోట్ల రద్దు విషయం తెలుసుకున్న వెంటనే మంగళవారం రాత్రి వందలాది మంది ఏటీఎంల వద్ద గుమిగూడారు. ఒక్కో లావాదేవీకి రూ. 400 చొప్పున వందనోట్లన్నింటినీ ఖాళీ చేసేశారు. దీంతో పలువురు ఒక ఏటీఎం నుంచి మరో ఏటీఎంకు ఆందోళనతో పరుగులు తీశారు. నగరంలోని చాలా ఏటీఎంలలో వందనోట్లన్నీ మంగళవారం రాత్రి పదిగంటలకే అయిపోయాయి. ఒకే వ్యక్తి ఏటీఎంలో పలుసార్లు డ్రా చేస్తుండడంతో అతని వెనకున్నవాళ్లు గొడవపడడంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి.

విప్లవాత్మక నిర్ణయం….:ప్రధాని నరేంద్రమోదీ దేశంలో నల్లధనాన్ని నిరోధించడానికి విప్లవాత్మక నిర్ణయం ప్రకటించారు. రూ. 500, రూ.వెయ్యి నోట్లు భారీ ఎత్తున ఉన్నవారు వాటిని బ్యాంకుల్లో జమ చేయక తప్పదు. దీంతో నల్లధనం ఎంత ఉందన్నది తెలిసిపోతుంది. సామాన్యులు వారి వద్దనున్న నోట్లను బ్యాంకుల వద్దకెళ్లి కొత్త నోట్లతో మార్చుకోవచ్చు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. టెర్రరిస్టులు, మావోయిస్టులు, అసాంఘికశక్తుల ఆర్థిక కార్యలాపాలు నిరోధించడానికి ప్రధాని నిర్ణయం అత్యంత ఉపయుక్తం. లంచాలు తీసుకునే వాళ్ల ఆగడాలకు చాలా వరకు అడ్డుకట్టపడుతుంది. స్థిరాస్తి వ్యాపారంలో కూడా పారదర్శకత భారీగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. – ఎం.నాగేంద్ర, భాజపా నగర అధ్యక్షుడు ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…:ప్రధాని నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. నల్లకుబేరులెవరన్న గుట్టు ఇప్పుడు బట్టబయలవుతుంది. సామాన్యులు తమ వద్దనున్న నోట్లను ఏం చేయాలన్న దిగులు చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకులకు వెళ్లి చక్కగా మార్చుకోవచ్చు.

-పి.వి.నారాయణరావు, భాజపా నగర మాజీ అధ్యక్షుడు
నిధుల కొరత ఏర్పడదు….: నల్లధనాన్ని అడ్డుకోవడానికి ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైనది. నల్లధనం వున్నవారు, పన్నులు ఎగ్గొడుతున్నవారు పట్టుబడక తప్పదు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు పాతనోట్ల స్థానంలో చెల్లుబాటయ్యే కొత్తనోట్లు ఇస్తారని తెలుస్తోంది. ఫలితంగా రూ. 500, రూ.1000 నోట్లను చిన్నమొత్తాల్లో కలిగి ఉన్నవారికి ఇబ్బంది ఉండదు. నిధుల కొరత తలెత్తుతుందేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. (ప్రస్తుత నిర్ణయంతో చాలా మంది పన్ను చెల్లింపుపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఉన్నదాంట్లో పన్నులు చెల్లిస్తే నిశ్చింతగా ఉండొచ్చన్న భావన పెరుగుతుంది. ఫలితంగా ఆదాయపుపన్నుశాఖ పరిధిలోకి వచ్చేవారి సంఖ్య గణనీయంగా అభివృద్ధి చెందే పరిస్థితి వస్తుంది.
– ఎన్‌.కూర్మనాధ్‌, ఛార్టెడ్‌ అకౌంటెండ్‌
నూతన ఆర్థికశకానికి మోదీ నాంది పలికారు….: భారతదేశంలో నూతన ఆర్థిక శకానికి భారత ప్రధాని మోదీ నాంది పలికారు. పాత విధానాల స్థానంలో కొత్త విధానాలు అందుబాటులోకి వస్తాయి. పారదర్శకమైన లావాదేవీలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి ఉన్ననోట్లను రద్దు చేయడం అత్యంత సాహసోపేతమైన చర్య. భవిష్యత్తులో నల్లధనం కూడబెట్టుకోవాలన్న ఆలోచనలున్నవారు తీవ్ర ఇబ్బందులు పడక తప్పని పరిస్థితులు వస్తాయి. ఉగ్రవాదులు, అసాంఘికశక్తుల, అవినీతిపరుల ఆర్థికమూలాలను కూకటివేళ్లతో పెకలించడానికి నోట్ల రద్దు నిర్ణయం అత్యంత కీలకమైనది. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డిసెంబరు 30వ తేదీలోపు వారి వద్దనుండే నోట్లను మార్చుకోవచ్చు.
-పి.వి.ఎన్‌.మాధవ్‌, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా, వైజాగ్‌ చాప్టర్‌
ఉగ్రవాదుల కార్యకలాపాల నిరోధానికి ఉపయుక్తం…: ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి రూ. 500, రూ.వెయ్యినోట్ల రద్దు అత్యంత ఉపయుక్తం. యూరోప్‌ దేశాలు కూడా యూరో 500ను రద్దు చేశాయి. అమెరికా దేశంలో కూడా 500డాలర్ల నోట్లను ఏళ్ల కిందటే రద్దు చేశారు. 500, వెయ్యినోట్లుతో ఎక్కువ డబ్బును ఒకచోట నుంచి మరో చోటకు తరలించడానికి జాతివ్యతిరేక కార్యకలాపాలు సాగించడానికి వీలవుతోందని నిరూపతమైంది.
-ఒ.నరేశ్‌కుమార్‌, వ్యవస్థాపకుడు, విశాఖ అభివృద్ధి మండలి
సాధారణంగా నల్లధనాన్ని భద్రపరచుకునే వాళ్లందరూ తమ నగదు, ఆస్తుల్ని భద్రపరచుకోవడానికి ముందుగా ఆశ్రయించేది ఆడిటర్లు, ఛార్టెడ్‌ అకౌంటెంట్లనే. మంగళవారం రాత్రి నుంచి వారి ఫోన్లు నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. ఎలాంటి సలహా ఇవ్వాలో తెలియక ఆడిటర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. సలహా ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఇంకో బాధ అన్నట్లుగా తయారైంది.
నల్లధనం కూడపెట్టి బ్యాంకుల్లో భద్రపరచుకోకుండా రహస్య ప్రదేశాల్లో ఉంచి అప్పుడప్పుడూ ఆస్తులు కొనుగోలు చేసుకుంటున్న వారు మాత్రం భీతిల్లుపోతున్నారు. రూ.లక్షలు, రూ.కోట్లలో అక్రమంగా భద్రపరచుకున్నవారు తమ ఇబ్బందులు తప్పవని తీవ్ర నిరాశలో పడ్డారు.

తమ వద్దనున్న రూ. 500 నోటుతో వెళ్లి రూ. 100 పెట్రోలు కొట్టించుకుని నాలుగు వందనోట్లు తీసుకోవాలన్నవాళ్లకు పెట్రోలు బంకుల యాజమాన్యాల నుంచి నిరాశే ఎదురైంది. కావాలంటే పెట్రోలు కొడతాం కానీ రూ. 500 నోట్లు తీసుకోమని తేల్చి చెప్పడంతో పలువురికి దిక్కుతోచని స్థితి ఎదురైంది.

రూ.500, రూ.1000నోట్లను ప్రభుత్వం రద్దు చేసిందని తెలియగానే సామాన్యుల్లో చాలామంది గందరగోళంలో పడ్డారు. కొత్త నోట్లు వచ్చే వరకు అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆయా నోట్లను తీసుకుని మళ్లీ బ్యాంకుల వద్దకు వెళ్తే వాళ్లేమంటారోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో రూ. 100 నోట్లు లేని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.