News

Realestate News

శ్రమ తగ్గేలా.. ఖర్చు మిగిలేలా..

vizag real estate news

శ్రమ తగ్గేలా.. ఖర్చు మిగిలేలా..
తక్కువ వ్యయంతో ఎగరబోత పరికరం తయారీ
గజపతినగరం, న్యూస్‌టుడే: రైతు ఆలోచనావిధానంలో కొత్తదనం రావడంతో ఎగరబోత పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో తయారుచేశాడు. పెద్ద పరికరాన్ని తీసుకువెళ్లేందుకు పెద్ద వాహనాలు అవసరం కాగా కేవలం మోపెడ్‌పై ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లేలా వినూత్న పరికరాన్ని తయారుచేశాడు గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి ఎరుకునాయుడు. కిరోసిన్‌తో నడిచే చిన్న నీటి ఇంజిన్‌కు పెద్ద వాహనాల రేడియేటర్ల వద్ద ఉన్న గాలిఫంకాను అమర్చి పరికరాన్ని తయారు చేశాడు. నీటి ఇంజినుకు గాలిఫంకా బిగించేందుకు రూ.2,100 ఖర్చుకాగా సునాయాసంగా రైతుల పని ముగుస్తుందని తెలిపారు. మోపెడ్‌పై నీటి ఇంజిను ఏర్పాటు చేసి ఆ ఎత్తులో గాలిఫంకా బిగించి ఇంజిన్‌ ప్రారంభిస్తే, ఎగరబోత జరుగుతుందని అన్నారు. గంటకు ఎకరా పంట ధాన్యం ఎగరబోయవచ్చని ఎరుకునాయుడు చెబుతున్నారు. గంటలకు అయిదుగురు వ్యక్తులు ఉంటే 50 బస్తాల ధాన్యం ఎగరబోయవచ్చని అంటున్నారు. పెద్ద పరికరానికి అదే సామర్థ్యం ఉంటుందని, దాన్ని అద్దెకు తెస్తే గంటకు రూ.300 వసూలు చేస్తానని ఎరుకునాయుడు తెలిపారు. నీటి అవసరం ఉన్నప్పుడు గాలిఫంకాను తొలగించి నీరు తోడుకోవచ్చన్నారు. గత ఏడాది తాను తయారు చేసి తన అవసరాలు తీర్చుకున్నానని, ఈసంవత్సరం రైతులకు అద్దెకు తిప్పుతున్నానని తెలిపారు.