News

Realestate News

శివారు… రెండ్రోజులకోసారే నీరు

శివారు… రెండ్రోజులకోసారే నీరు…

వనరుల నుంచి తగ్గిపోతున్న సరఫరా

‘‘విశాఖ నగరంలో ప్రతి ఇంటికి రోజూ నీరు ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలి. వేసవిలో మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. మంచినీటి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి.’’ … గత జనవరిలో ప్రభుత్వం నుంచి జీవీఎంసీకి అందిన ఆదేశాల సారాంశమిది.

న్యూస్‌టుడే – కార్పొరేషన్‌

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాలు అధికారుల తీరుతో నీరుగారిపోతున్నాయి.

గత రెండు నెలలుగా నగర శివారు ప్రాంతాలకు నీటి ఇబ్బందులు ఎదురవుతున్నా, వాటిని అధిగమించేందుకు పక్కా ప్రణాళిక తయారుకాలేదు.

తాటిపూడి రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పడిపోయాయి. జీవీఎంసీ నీటిని సేకరించే ఇన్‌ఫిల్టరేషన్‌ వెల్స్‌లో నీటి లభ్యత తగ్గిపోయింది.

దీంతో తగరపువలస, భీమిలి ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయి. కొమ్మాది, మధురవాడ, సాగర్‌నగర్‌, ఎండాడ, విశాలాక్షినగర్‌, ఆరిలోవ ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి ఎదురవుతోంది.

వేసవి రాకుండానే పరిస్థితి ఇలాగుంటే.. ఉష్ణోగ్రతలు పెరిగితే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. నగర శివారు ప్రాంతాలకు నీటిని అందించే తాటిపూడి రిజర్వాయర్‌లో నీరు తగ్గిపోవడం, గోస్తనీలో అంతంత మాత్రంగా ఉండటంతో పాటు, ముడసర్లోవ పూర్తిగా ఎండిపోయింది. నగర తాగునీటి అవసరాలతో పాటు, పరిశ్రమలకు

అధిక మొత్తంలో నీరందించే ఏలేరు రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు తక్కువగా పడినప్పటికీ, పురుషోత్తపట్నం నుంచి నీటిని పంపింగ్‌ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు తరలించడంతో చేయడంతో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి  చేరింది.

మరో పక్క గోదావరి నుంచి పంపింగ్‌ చేస్తోన్న నేపథ్యంలో ప్రస్తుతం సేకరిస్తోన్న నీటికి అదనంగా మరో 5 మిలియన్‌ గ్యాలెన్‌ పెర్‌ డే(ఎంజీడీ)ల నీటిని పంపింగ్‌ చేసుకుని, టీఎస్సార్‌కు తరలించి, అక్కడ్నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కొమ్మాదికి తరలించాలని ఆదేశించారు.  దీంతో నీటి సరఫరా ఇంజినీర్లు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు.

నాలుగు రోజులు మాత్రమే….
సమస్యపై కమిషనర్‌ హరినారాయణన్‌ ఇటీవల అధికారులతో సమావేశమయ్యారు. శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్‌ ఆదేశాలను ఇంజినీరింగ్‌ అధికారుల కేవలం నాలుగు రోజులు మాత్రమే అమలు చేయగలిగారు.

అనంతరం మళ్లీ యథావిధిగా నగర శివారు ప్రాంతాలకు రెండు రోజులకోసారి నీరిస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు రోజూ ఇస్తున్నా, కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారు.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవి ముదిరితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కమిషనర్‌ ఆదేశాల మేరకు అదనంగా ఐదు ఎంజీడీల నీరు సేకరిస్తున్నా, ఇంజీనిరింగ్‌ అధికారుల వైఫల్యంతోనే రోజూ నీటిని సరఫరా చేయలేకపోతున్నారన్న వాదన వినిపిస్తుంది.

110 ఎంజీడీల నీరు సేకరణ…
కమిషనర్‌ ఆదేశాలతో విశాఖ నగరంలో మునుపెన్నడూలేని విధంగా 110 ఎంజీడీల నీటిని వివిధ మార్గాల నుంచి సేకరిస్తున్నారు.

అందులో స్టీల్‌ప్లాంట్‌కు 54.92 ఎంజీడీలు, ఎన్టీపీసీకి 4.21 ఎంజీడీలు, ఏపీఐఐసీకి 5.27, గంగవరం పోర్టుకు 0.166 ఎంజీడీలు, రూరల్‌ వాటర్‌ స్కీమ్స్‌కు 0.9 ఎంజీడీలు, అగనంపూడి 0.41 ఎంజీడీలు, తాగునీటికి 39.64 ఎంజీడీల నీరు

కేటాయిస్తున్నారు. 325 క్యూసెక్కుల నీటిని కేవలం ఏలేరు నుంచి జీవీఎంసీ సేకరిస్తుండటంతో నగరంలో నీటి ఎద్దడి నివారించగలిగారు.

ఇష్టానుసారంగా వ్యాపారం…
భూగర్భం నుంచి నీటిని తోడి, వడపోసి ‘మినరల్‌ వాటర్‌’గా విక్రయిస్తోన్న ప్రయివేటు వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచేశారు.

గతంలో రూ. 20లకు ఇచ్చే క్యాన్‌ ప్రస్తుతం రూ. 50కు, రూ. 50కు ఇచ్చే నీటి క్యాన్‌ రూ. 75లకు పెంచేశారు. నివాసాల మధ్య ఇష్టానుసారంగా నీటిని తోడేసి వ్యాపారం చేస్తున్నా, జీవీఎంసీ అధికారులు వారిని వారించడంలేదు.

ఒక పక్క నీటిని జీవీఎంసీ సరఫరా చేయలేక, బోర్లు ద్వారా నీటిని సేకరిస్తున్న వారిని వారించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

అయితే నీటి సంరక్షణకు సంబంధించి వాల్టా చట్టం రెవెన్యూ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని, తమ పరిధిలో లేదంటూ దాటవేస్తున్నారు.

నగర శివారు వీధికి ఒకటి చొప్పున మంచినీటి వ్యాపారం చేసేవాళ్లు బోర్లుతో నీటిని తోడేస్తుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.