వైద్య సేవలు బంద్..
వైద్య సేవలు బంద్..
<
కేజీహెచ్‌పై తీవ్ర ప్రభావం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్యుల సమ్మె.. కింగ్ జార్జి ఆసుపత్రిలో వైద్య సేవలపై ప్రభావం చూపింది. ఓపీ విభాగాలకు వచ్చే రోగులు గంటల తరబడి వైద్య సేవల కోసం నిరీక్షించాల్సి వచ్చింది.
ఆసుపత్రిలో పన్నెండు ఆపరేషన్ థిÅయేటర్లు ఉంటే కేవలం మూడు మాత్రమే పనిచేశాయి. అక్కడ కూడా నామమాత్రమైన సేవలను అందించారు.
అత్యవసర సేవలకు హాజరైన సీనియర్ వైద్యులు, ఓపీ, థిÅయేటరు సేవలను బహిష్కరించారు. బోధనాంశాల జోలికి పోలేదు. దీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఎపీజీడీఎ) రాష్ట్ర కమిటీ పిలుపును అనుసరించి ఏఎంసీ/కేజీహెచ్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు.
* విశాఖలోని కేజీహెచ్ సహా ఏడు ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన దాదాపు 450 మంది వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఇచ్చారు. ఓపీలను జూనియర్ వైద్యుల సహాయంతో నడిపారు.
సాధారణంగా సోమవారం నుంచి గురువారం వరకు రోజుకు 4వేల మందికి పైగా రోగులు ఓపీ సేవలకు వస్తారు. వైద్యుల సమ్మె నేపథ్యంలో మంగళవారం 1292 మంది రోగులు వచ్చారు.
వీరిలో అత్యధికులు ఆర్థోపెడిక్, పిల్లలు, ప్రసూతి, సర్జరీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర విభాగాలకు వచ్చారు.
ఆయా విభాగాలకు చెందిన జూనియర్ వైద్యులు సేవలందించారు. ఒక్కో రోగి సగటున రెండేసి గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.
* ఎముకల విభాగ ఓపీకి దాదాపు 400 మందికి పైగా రోగులు వచ్చారు.
ఇక్కడ వైద్యుల సలహా కోసం బారులు తీరారు. అసలే నొప్పులు, ఆపై నిరీక్షణతో కొంత ఇబ్బందికి గురయ్యారు. ఓపీ విభాగాలకు వచ్చిన వారిలో పరిస్థితి సీరియస్‌గా ఉన్న 140 మందిని వివిధ విభాగాల్లో ఇన్‌పేషెంట్లగా చేర్చారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు కోలుకోవడంతో 180 మందిని డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపారు.
* సమ్మె తొలిరోజు కావడం, దాదాపు 500 మందికిపైగా జూనియర్ వైద్యులు అందుబాటులో ఉండడంతో వార్డుల్లో అందించే సేవలపై పెద్దగా ప్రభావం కనిపించలేదు.
* అత్యవసర విభాగాలైన క్యాజువాల్టీ, ఐఆర్‌సీయూ, ఈఎండీ, ఏఎంసీయూ, ఐపీసీయూ, లేబర్‌రూమ్ వంటి చోట్ల సేవలందించేందుకు సీనియర్ వైద్యులు హాజరయ్యారు.
ఆయా చోట్ల పెద్దగా అసౌకర్యాలు కనిపించలేదు. అత్యవసర సేవలు యథాతథంగా సాగినా ఓపీ సేవలు మందగించాయి. సర్జరీలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు సర్జరీ చేస్తారో రోగులకు తెలియక ఆందోళన చెందారు.
కేవలం పది సర్జరీలు మాత్రమే…
ఆసుపత్రిలో ఉన్న 12 ఆపరేషన్ థియేటర్లలో నిత్యం 150 వరకు సర్జరీలు నిర్వహిస్తారు. అటువంటిది మంగళవారం కేవలం 10 మాత్రమే చేశారు.
ఎముకలు, పీడియాట్రిక్ సర్జరీ, ఓపెన్‌హార్ట్ సర్జరీ విభాగాల్లో మాత్రమే ఇవి జరిగాయి. మిగతా థిÅయేటర్లలో నిర్వహించాల్సిన శస్త్రచికిత్సలను వాయిదా వేశారు. వీరికి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదుపరి తెలియజేయనున్నారు.
పర్యవేక్షక వైద్యాధికారి కార్యాలయం ఎదుట బైఠాయింపు
విధులను బహిష్కరించిన వైద్యులు మంగళవారం ఉదయం ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.జేఏసీ ప్రతినిధులు డాక్టర్ ఎం.వి.విజయశేఖర్, డాక్టర్ పి.వెంకటరమణ, డాక్టర్ ధన్యశ్రీ తదితరులు మాట్లాడారు.
పదోన్నతుల జీఓ 163 జారీ చేసి ఏడాదవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదని, ఫలితంగా దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నా ఇంతవరకు పదోన్నతులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నుంచి పీఆర్సీ సవరించలేదని, ఎన్నిసార్లు అడుగుతున్న ప్రభుత్వం దాటవేత వైఖరి అనుసరిస్తోందని దుయ్యబట్టారు.
ఒప్పంద పద్ధతిలో నియతులైన వారికి సర్వీసులను క్రమబద్ధీకరించి పదోన్నతులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా న్యాయ సమ్మతమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.