News

Realestate News

వేడుక చేసేద్దాం..!

వేడుక చేసేద్దాం..!
విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం ఏర్పాటు
9.12 ఎకరాల భూకేటాయింపునకు మంత్రివర్గ ఆమోదం
31.69 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి విస్తరణ
ఈనాడు, విశాఖపట్నం
విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం నిర్మించాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలపడంతో నగరంలోని పారిశ్రామికవర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఇప్పటికే వివిధ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నా…. వాటిని అత్యంత సులభతరంగా నిర్వహించేందుకు కావాల్సిన వసతులు ఉన్న కన్వెన్షన్‌ కేంద్రం లేకపోవడం పెద్ద లోటుగా మారింది.

నగరంలో బీచ్‌రోడ్డు సమీపంలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. బీచ్‌రోడ్డును ఆనుకుని హార్బర్‌పార్కు రహదారికి మధ్యనున్న సువిశాల స్థలంలో 9.12 ఎకరాల్లో పి.పి.పి. పద్ధతిలో నిర్మించాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.

ఆర్థికభారంతో ఇబ్బందే…
ఇప్పటి వరకు విశాఖలో భారీ కన్వెన్షన్‌ కేంద్రం లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా పెనుభారంలా మారుతోంది. సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి రూ.కోట్లు వెచ్చించి పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హార్బర్‌పార్కు ఎదురుగా 10.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎ.పి.ఐ.ఐ.సి. స్థలంలో భారీ అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలానికి ఆనుకుని 3.80 ఎకరాల్లో ఉన్న విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌ ప్రాంగణాన్ని కూడా కలిపి నిర్మిస్తే మరింత ఆకర్షణీయంగా మారుతుందన్న ఉద్దేశంతో…ఆ స్థలాన్ని కూడా తీసుకునేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా స్థల యజమానితో చర్చలు సాగిస్తున్నారు. ఆ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. చర్చలు ఫలవంతమయ్యేలోపు నిర్మాణ ప్రక్రియలో కొంత ప్రగతి సాధించాలన్న లక్ష్యంతోనే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం ప్రాంగణంలో 9.12 ఎకరాల్లో మాత్రం అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

కేంద్రంలో విశిష్ఠ సౌకర్యాలెన్నో….
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం కల సాకారమైతే నగరానికి మరో విశిష్ఠ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లే. కనీసం ఐదు వేల మంది కూర్చొనే సామర్థ్యంతో విశాలమైన ప్లీనరీ హాళ్లు, 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ భారీ ఎగ్జిబిషన్‌ హాల్‌ నిర్మించనున్నారు. కన్వెన్షన్‌ కేంద్రానికి అనుకునే 200 గదులతో ఓ ఐదు నక్షత్రాల హోటల్‌ ఏర్పాటు చేసి… అతిథులకు అన్ని వసతి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తారు. దీనికి అదనంగా ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ మెగా షాపింగ్‌ మాల్‌ను నిర్మిస్తారు. అందులోనే ఓ మల్టీప్లెక్స్‌ కూడా ఉంటుంది. పి.పి.పి. ప్రాతిపదికపై నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల సంస్థ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది.

ప్రత్యేక ఆర్థిక మండలి విస్తరణకు….
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం గుర్జంపాలెం గ్రామంలో 31.69 ఎకరాలను ప్రత్యేక ఆర్థిక మండలి ఫేజ్‌-2 నిర్మాణానికి వీలుగా ఆ స్థలాన్ని ఏపీఐఐసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ఆర్థిక మండలి అవసరాలకు తగినట్లుగా ఏపీఐఐసీ అధికారులు ఆ స్థలాన్ని అభివృద్ధి చేయనున్నారు. అదే మండలంలోని మోటూరుపాలెం గ్రామంలోని 88.09 ఎకరాలను కూడా ప్రత్యేక ఆర్థిక మండలి ఫేజ్‌-2 ఏర్పాటుకు ఎ.పి.ఐ.ఐ.సి.కి కేటాయించారు.

మరికొన్ని ముఖ్య నిర్ణయాలు….
* మద్యం గొలుసు దుకాణాలు నిర్వహించే వారికి ఆరు నెలలు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో నగరంలో గొలుసు దుకాణాలకు అడ్డుకట్ట పడినట్లే.
* ఎండాడలోని సర్వే నెం.190/5లో 21 సెంట్ల స్థలాన్ని గుజరాతీయుల సామాజిక భవన నిర్మాణానికి రూ.25 లక్షల ధరకు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.