వైద్యవిద్యలో ఉన్నత ప్రమాణాలకు ‘స్కిల్ ల్యాబ్’

సమావేశంలో ఆసక్తికర చర్చలు
సాగర్‌నగర్ : వైద్య విద్యలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే దిశగా ప్రతి జిల్లాలో రూ. 20 కోట్ల వ్యయంతో ‘స్కిల్ ల్యాబ్’లను నెలకొల్పబోతున్నామని ఏపీ వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుబ్బారావు చెప్పారు. తొలుత దీనిని విశాఖలోనే ప్రారంభిస్తామన్నారు. గీతం వైద్య కళాశాల వేదికగా జరుగుతున్న రాష్ట్రస్థాయి శస్త్ర చికిత్స నిపుణుల సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో వైద్య పరికరాలను అందుబాటులోకి తేనున్నామన్నారు. ఈ విధానం కూడా విశాఖతోనే మొదలవుతుందన్నారు. ప్రభుత్వ అనుమతులతో మొత్తం 120 సిటీ స్కాన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. వైద్య విద్యా బోధనలో భాగంగా నిరంతరం వైద్యులకు శిక్షణ అందించడానికి ఇటీవల న్యూరోట్రామా సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా ఈ శిక్షణను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అఖిల భారత సర్జన్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె.బాబ్జీ, వైద్యులు గన్ని భాస్కరరావు, బలరామరాజు, సురేష్ వశిష్ట, సమావేశాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జి.శాంతారావు, నిర్వాహక కార్యదర్శి కె.తిరుమలప్రసాద్, సంయుక్త కార్యదర్శి పి.శ్యామ్‌ప్రసాద్ ఆంధ్ర, గీతం వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎస్.వి.కుమార్, ఎస్.పి.రావు తదితరులు పాల్గొన్నారు.
ఆపోలో ఆసుపత్రుల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే శనివారం జరిగిన సమావేశంలో గుండె, వూపిరితిత్తుల మార్పిడి తదితర ముఖ్యాంశాలపై ప్రసంగించారు. దేశంలో రహదారి ప్రమాదాల్లో ఏటా దాదాపు 1.4 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. వారిలో 65 శాతం మంది తలకు తగిలిన గాయాలతో చావుబతుకుల మధ్య ఉంటున్నారని ముఖ్యంగా బ్రెయిన్‌డెడ్ వాసులుగా మిగిలిపోతున్నారని వెల్లడించారు. వీరందరిని అవయవ దానం చేసే విధంగా వారి కుటుంబసభ్యులను చైతన్య పర్చగలిగితే మరికొందరికి కొత్త జీవితం ప్రసాదమవుతుందన్నారు. చాలా సందర్భాల్లో గుండె, వూపిరితిత్తులను అవయన మార్పిడిలో వదిలేస్తున్నారని, వైద్యులు దీనిని సవాల్‌గా తీసుకుని గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్ర వైద్య కళాశాల నిపుణులు కె.సాయికృష్ణ, సి.జయరాజు, పి.ఎ.రమణి మాట్లాడారు. విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ఇటీవల తాము పరీక్షించగా రొమ్ము కేన్సర్‌తో ఏడుగురు, రొమ్ము సంబంధిత వ్యాధులతో 45 మంది వైద్యం లేకుండా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. డాక్టర్ కె.గాయత్రీరెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లల్లో ఉదర భాగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 100 మంది తమ వద్దకు రాగా వారిలో 79 మంది అపెండ్సైటిస్తో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి శస్త్ర చికిత్స చేశామన్నారు. మిగిలిన కేసుల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరమైందన్నారు.
నోటి కేన్సర్‌లో భారత్ అగ్రస్థానంలో ఉందని మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వి.మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 13 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు నోటి కేన్సర్‌తో బాధపడుతున్నారని వివరించారు.