News

Realestate News

వెయ్యి ఎకరాల్లో…

Thousand acres

వెయ్యి ఎకరాల్లో…
‘విరాట్‌’ టౌన్‌షిప్‌! సాంకేతిక, వాణిజ్య, పర్యాటకంగా అభివృద్ధి
విశాఖ – భీమిలి మధ్య ఏర్పాటుకు నిర్ణయం
నేడు నిపుణులతో మూడు చోట్ల స్థల పరిశీలన
ఈనాడు, విశాఖపట్నం

భారత నౌకాదళం నుంచి త్వరలో సేవలను ఉపసంహరించుకోనున్న యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖపట్నం – భీమునిపట్నం మధ్య దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సాంకేతిక, వాణిజ్య, పర్యాటక టౌన్‌ షిప్‌ (టీసీటీటీ)గా అభివృద్ధి చేయాలని జిల్లా స్థాయి అధికారుల బృందం నిర్ణయించింది. దీనికి సవివర కార్య నివేదిక (డీపీఆర్‌) తయారీ కోసం జాతీయ స్థాయిలో వివిధ సంస్థల నుంచి త్వరలో ప్రతిపాదనలను (ఆర్‌పీఎఫ్‌) ఆహ్వానించనున్నారు. అనువైన ప్రాంత పరిశీలన, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న చెన్నై ఐఐటీ నుంచి సముద్ర అధ్యయన, సాంకేతిక విభాగ ఆచార్యులు సుందర్‌ విశాఖ రానున్నారు.

ఈ యుద్ధ నౌక మరో ఏడాదిలో సేవల నుంచి తప్పుకుంటుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అంగీకరించింది. ఈ నౌకను విశాఖ తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు అప్పగించింది. ఇందుకోసం కలెక్టర్‌, వుడా ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, తూర్పు నావికాదళం, విశాఖ పోర్టు ట్రస్ట్‌, ఆంధ్రవిశ్వవిద్యాలయం, భారత సముద్ర అధ్యయన విభాగ అధికారులతో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పడింది. ఇది పలు దఫాలుగా సమావేశమై విశాఖపట్నం – భీమునిపట్నం మధ్య తీరంలో ప్రత్యేక టౌన్‌ షిప్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రాథమికంగా 750 ఎకరాల నుంచి 1,000 ఎకరాల వరకు అవసరమని నిర్ధరణకు వచ్చింది. ఈ నౌక నుంచి సందర్శకులు విజ్ఞాన సంబంధ అంశాలను తెలుసుకునేలా, ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

తిరిగి ఆదాయం అందించేలా..
మ్యూజియం ఏర్పాటుకు రూ. 700 కోట్లు అవసరమని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ప్రణాళికల ప్రకారమైతే అంచనా వ్యయం రూ. 1,000 కోట్లకుపైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని వుడా నిధుల నుంచి ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు పూర్తయ్యాక వుడాకు తగినంత ఆదాయం వచ్చేలా కమిటీ ఆలోచనలు చేస్తోంది. నౌకను తీరానికి సమీపంలో సముద్రంలోనే ఉంచి అభివృద్ధి చేస్తున్నందున ఏటా నిర్వహణ వ్యయం భారీగా ఉంటుంది. అందువల్ల ఆ స్థాయిలో ఆదాయం వస్తేనే నిర్వహణకు ఎలాంటి ఆటంకాలుండవు. ఇందుకోసం కన్సల్టెన్సీ సేవలను ఉపయోగించుకోవాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. నౌకను ఏర్పాటు చేసే చుట్టుపక్కల ప్రాంతాలు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగపడేలా అవసరమైతే ప్రత్యేక బృహత్తర ప్రణాళిక (స్పెషల్‌ మాస్టర్‌ ప్లాను) తయారు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్లనే ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన కురుసుర జలాంతర్గామి మ్యూజియం నుంచి వుడా మంచి ఆదాయం ఆర్జిస్తోంది.

అనుమతులు, జాగ్రత్తలు తీసుకున్నాకే…
మ్యూజియం ఏర్పాటు చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు, పలు జాగ్రత్తలు తీసుకున్నాకే రంగంలోకి దిగాలని కమిటీ నిర్ణయించింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌక విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చివరకు దీన్ని మోటారు సైకిళ్ల తయారీ కోసం వినియోగించాల్సి వచ్చింది. విరాట్‌ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, తీర ప్రాంత నియంత్రణ మండలి (సీఆర్‌జడ్‌), ఇతర అనుమతుల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ తీరం ఇటీవల కాలంలో కోతకు గురవుతోంది. కురుసుర జలాంతర్గామి మ్యూజియంలో సందర్శనను ఒకానొక దశలో నిలిపివేసిన సందర్భాలున్నాయి. అందువల్ల కేంద్ర జల, ఇంధన పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), జాతీయ సముద్ర అధ్యయన సంస్థ (ఎన్‌ఐఓ) వంటి సంస్థల సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. విశాఖపపట్నం-భీమునిపట్నం మధ్య మూడు ప్రాంతాలను ప్రాథమికంగా ఎంపిక చేసి ఇందులో అన్ని విధాలా అనువైన ప్రాంతాన్ని ఖరారు చేయనున్నారు.

ప్రభుత్వానికి త్వరలో నివేదిక…
విశాఖ – భీమునిపట్నం మధ్య ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది. జిల్లా స్థాయిలో 11 మందితో ఏర్పాటైన కమిటీ పలు దఫాలుగా సమావేశమై అనేక అంశాలపై చర్చించింది. దీనిపై ప్రభుత్వానికి త్వరలో ఒక నివేదిక అందజేయనున్నాం. యుద్ధనౌక ఏర్పాటుతో పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.

-డాక్టర్‌ బాబూరావునాయుడు, వుడా ఉపాధ్యక్షుడు