News

Realestate News

వెంకన్న ఆలయానికి కొత్త సొబగులు..!

వెంకన్న ఆలయానికి కొత్త సొబగులు..!
రూ. కోటితో చురుగ్గా అభివృద్ధి పనులు
కల్యాణవేదిక, ఆవరణలో సిమెంటు రోడ్డు, గ్రిల్స్‌ ఏర్పాటు
తితిదే ప్రత్యేక శ్రద్ధ
ఉపమాక (నక్కపల్లి), న్యూస్‌టుడే

ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలోని తితిదే వెంకన్న ఆలయానికి మరిన్ని హంగులు సమకూరుతున్నాయి. తితిదే ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు ఒకొక్కటిగా చేపడుతున్నారు. ప్రస్తుతం 1.3కోట్లతో జరుగుతున్న పనులద్వారా ఆలయం మరింత ఆకర్షణీయంగా మారనుంది. వచ్చే నెలలో జరిగే కల్యాణోత్సవాల్లో భక్తులకు ఈ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

2015 నవంబరు నెలలో ఉపమాక ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు దేవాదాయశాఖ తితిదేకు అప్పగించింది. ఆతర్వాత జరిగిన వార్షిక కల్యాణోత్సవాల్లో కొంతవరకు మార్పులు చేసి, గతానికి భిన్నంగా ఇక్కడ వేడుకలు జరిపారు. ఆతర్వాత తితిదే ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించింది. దీనిలో భాగంగా ఆలయంలో ప్రధానంగా చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను నెలరోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు.

మరింత ఆకర్షణీయంగా
ఆలయం వద్ద గతంలో దాతల సాయంతో పలు అభివృద్ధి పనులు చేసినా, ప్రస్తుతం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, వాస్తు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూ, నిర్మాణలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో రాకపోకలు సాగించడానికి వీలుగా రెయిలింగ్‌ నిర్మించారు. ఇప్పుడు జరుగుతున్నవాటిలో సిమెంటురోడ్డు పనులు 2రెండు నెలల క్రితమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు రెండు వారాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా జరిగేలా చూస్తున్నారు.

చేపడుతున్న పనులివే
కల్యాణ వేదిక: గతంలో స్వామి వారి కల్యాణాన్ని దాతల సాయంతో నిర్మించిన చిన్న షెడ్డులో జరిపేవారు. ఇది వాస్తుకు విరుద్ధంగా ఉండటంతో కొత్త వేదిక నిర్మిస్తామని తితిదే అధికారులు గతేడాదే వెల్లడించారు. ఆమేరకు గత కల్యాణ వేడుకల్లో వేదికను మార్పు చేశారు. ప్రస్తుతం కొత్త వేదిక నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ. 30లక్షలు కేటాయించారు. నెలాఖరుకి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇది పూర్తయితే కల్యాణాన్ని భక్తులు అధికంగా వీక్షించే వీలుంటుంది. అదే విధంగా భవిష్యత్తులో ఎవరైనా స్వామివారి కల్యాణాన్ని చేయించుకోవాలన్నా, ఇక్కడే చేస్తారు.

ఆవరణ అభివృద్ధి: గుడి ముందర ఇప్పటి వరకు ఉన్న స్థలం మట్టితో ఉండేది. ఇటీవల సీసీ రోడ్డు నిర్మించడంతోపాటు ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని గుర్తించి రోడ్డు మినహా మిగిలిన భాగాన్ని ఇంటర్‌ లాకింగ్‌ ఇటుకలతో చప్టామాదిరిగా తయారు చేస్తున్నారు. ఈ పనులు 80శాతం పూర్తి కావచ్చాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆలయంలోనే కొబ్బరికాయ కొట్టే విధానం ఉండేది. ఇకపై దీన్ని ఆవరణ బయటే పెడుతున్నారు. తిరుపతిలో మాదిరిగానే అఖిలాండం నిర్మిస్తున్నారు. ఇక్కడే భక్తులు కొబ్బరికాయ కొట్టడం, హారతులు వెలిగించడం చేయాల్సి ఉంటుంది. వీటికి రూ. 20లక్షలు వెచ్చించారు.

ఇత్తడి గ్రిల్స్‌: ఆలయంలో దర్శనాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి తోపులాటలు జరగకుండా, క్యూ లైన్లో వెళ్లేందుకు వీలుగా ఇత్తడి గ్రిల్స్‌ పెట్టిస్తున్నారు. అంతేకాకుండా ధ్వజస్తంభం వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుగాను రూ. 20లక్షలు కేటాయించారు. తద్వారా ఇవి మరింత శోభను తెస్తాయనడంలో సందేహంలేదు.

భారీ ప్రహారీ: ఆలయానికి సంబంధించి ఎదురుగా ఉన్న స్థలం చుట్టూ భారీ ప్రహారీగోడను నిర్మిస్తున్నారు. ఆమేరకు ఇక్కడ రెండు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుగాను రూ. 10లక్షల వరకు వెచ్చిస్తున్నారు. అదే విధంగా ఆలయంలోని బేడా మండప ప్రాంతం, ఆలయపైభాగం ఇతరాత్ర ప్రాంతాల్లో శ్లాబులు పెచ్చులూడుతుండటంతో వీటిని మరమ్మతులు చేస్తున్నారు. దీనికోసం రూ. 10లక్షలు కేటాయించారు.

వేడుకల్లోగా పూర్తి
ప్రస్తుతం జరుగుతున్న పనులను కల్యాణ వేడుకలు ప్రారంభంలోగానే పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా షెడ్డు, ఆవరణ, శ్లాబు మరమ్మతులు పూర్తి చేస్తాం.

-సి.హెచ్‌.రవికుమార్‌, ఏఈ, తితిదే