News

Realestate News

వూరంతా కదిలింది.. జలస్ఫూర్తి రగిలింది!

వూరంతా కదిలింది.. జలస్ఫూర్తి రగిలింది!
15 వేల ఇంకుడు గుంతలు తవ్విస్తా: ఎమ్మెల్యే పీలా
‘ఈనాడు- ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ స్ఫూర్తితో కదిలిన కూండ్రం
పండగలా సాగిన సుజలాం సుఫలాం
అనకాపల్లి, అనకాపల్లి పట్టణం, కొత్తూరు – న్యూస్‌టుడే
వూరంతా ఒక్కటయ్యింది.. చేయిచేయి కలిపింది.. పలుగుపార పట్టింది.. ఇంటికో ఇంకుడు గుంత.. అంటూ ఉద్యమ పథంలో ఉరికింది.. ‘ఈనాడు- ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ ఇచ్చిన జల స్ఫూర్తి అనకాపల్లి నియోజకవర్గంలో అణువణువునూ కదిలించింది. అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘సుజలాం- సుఫలాం’ కార్యక్రమం పండగలా సాగింది. తప్పెటగుళ్లు.. కోలాటాలు.. నీటి పొదుపు పాఠాలు.. మేము సైతం అంటూ ప్రతినలతో అందరిలో జలస్ఫూర్తి రగిలింది.

సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ప్రారంభమైన చైతన్య సదస్సులో అనకాపల్లి శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో ప్రతీ ఇంటికీ ఇంకుడు గుంత నిర్మిస్తామన్నారు.‘ఈనాడు- ఈటీవీ’ చేస్తున్న ఈ కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముందుచూపున్న ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి నింపారని.. పత్రిక, టీవీ ఛానళ్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బృహత్తర కార్యక్రమానికి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. డబ్బును డిబ్బీల్లో దాచుకున్నట్లే నీటిని కూడా ముందుచూపుతో భూమిలో దాచుకోకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బందిపడతాయన్నారు. నీరు లేకపోతే మనుగడే లేదన్నారు. తల్లిలా మేలు చేసే ఇంకుడు గుంతలను ప్రతి ఇంటా తవ్వుకోవాలని సూచించారు. పూర్వం రైతులు సొంత డబ్బులతో పొలాల్లో బరి నూతులను తవ్వుకుంటే.. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులిచ్చి పంట కుంటలు తవ్వుకునేందుకు ప్రోత్సహిస్తోందన్నారు. కూండ్రం గ్రామంలో రూ. కోటితో సిమెంటు రోడ్లు నిర్మించామన్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకుంటే రహదారుల నిర్మాణానికి మరో రూ. కోటి ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 30 పడకల ఆసుపత్రి, విద్యార్థులకు వసతి గృహం ఏర్పాటుకు కృషిచేస్తానని చెప్పారు.

తవ్విన గ్రామాలకు ప్రాధాన్యం: పీడీ
ఇంకుడు గుంతలు అధికంగా తవ్వి నీటి సంరక్షణ చర్యలు చేపట్టిన గ్రామాలకు ఉపాధి పనుల్లో ప్రాధాన్యం ఇస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పథక సంచాలకులు రెడ్డి శ్రీరాములు నాయుడు భరోసా ఇచ్చారు. భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే నీటిని భూమిలోకి ఇంకించాలన్నారు. అనకాపల్లి ప్రాంతంలో ప్రస్తుతం భూగర్భ జాలాలు ఐదున్నర మీటర్ల లోతుకు తగ్గిపోయాయన్నారు. వాస్తవానికి మూడు మీటర్ల లోతు ఉండాలన్నారు. రోజు, రోజుకూ తగ్గిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకోలేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పొలం గుంతలు తవ్వుకునే వారికి రూ. 58 వేల నుంచి రూ. 3 లక్షల వరకూ మంజూరు చేస్తామన్నారు. సర్పంచి శానాపతి స్వరూప అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పంచాయతీరాజ్‌ ఈఈ రవిబాబు, డీఈలు కుసుమ భాస్కర్‌, ఆనంద్‌, రాజేంద్రకుమార్‌, ఎంపీడీవో బీవీ రమణ, ఐసీడీఎస్‌ సీడీపీఓ కుమారి, ఎంపీపీ కొణతాల వెంకట సావిత్రి, జడ్పీటీసీ సభ్యురాలు పల్లేల గంగాభవాని, తెదేపా నాయకులు డాక్టర్‌ పీలా శ్రీకాంత్‌, బుద్ద నాగజగదీశ్వరరావు, పచ్చికూర రాము, మలసాల రమణరావు, కొణతాల శ్రీనివాసరావు, గుత్తా ప్రభాకర చౌదరి, కుమార్‌ రాజా,పెంటకోట రాము, ఎంపీటీసీ సభ్యులు నందారపు సూరిబాబు, ఉగ్గిన భాస్కరరావు, సంపతిపురం, వేటజంగాలపాలెం సర్పంచులు నంబారి శ్రీను, పూడి చిన్నారావు పాల్గొన్నారు.

ఫోనులో మంత్రి గంటా ప్రసంగం..
చివరి క్షణంలో అత్యవసర పనిమీద వెళ్లాల్సి రావడంతో సదస్సుకు హాజరుకాలేకపోయిన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫోన్‌లో సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగాన్ని ఎమ్మెల్యే పీలా మైకులో వినిపించారు. ‘ఈనాడు- ఈటీవీ’ దీర్ఘకాలిక ప్రయోజనాలతో చేపట్టిన సుజలాం.. సుఫలాం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్‌ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

కదలిన దండు.. : సుజలాం.. సుఫలాం కార్యక్రమంలో భాగంగా కూండ్రం గ్రామంలో శుక్రవారం భారీ ప్రదర్శన సాగింది. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వెంట వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఇంకుడు గుంతలు, పంట గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేతోపాటు డ్వామా పీడీ శ్రీరాములునాయుడు పలుగు పార పట్టి గోతులు తవ్వారు. మండలాధ్యక్షురాలు సావిత్రి, ఎంపీడీవో బీవీ రమణ మట్టిని తవ్వి తరలించారు. జడ్పీటీసీ సభ్యురాలు పల్లేల గంగాభవాని, సర్పంచి శానాపతి స్వరూపలు మట్టి తట్టను నెత్తిపై పెట్టుకుని సాయం చేశారు. అవగాహన సదస్సుకు కూండ్రం గ్రామానికి చెందిన శ్రీవెంకటేశ్వర సీతారామాంజనేయ కోలాట బృందానికి చెందిన బాలికల నృత్య ప్రదర్శన, పెదమదినకు చెందిన తప్పెటగుళ్ల ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

 

Source :http://www.eenadu.net/