వుడా భూ సమీకరణ 399 ఎకరాలు!

నివేదిక ఇచ్చిన ప్రత్యేక బృందం
లేఅవుట్ వేసి 140 ఎకరాల విక్రయం
ఈనాడు – విశాఖపట్నం
నిపుణుల నివేదిక పేర్కొన్న అంశాలు:
* భూసమీకరణ గ్రామాలు దబ్బంద, సౌభాగ్యరాయపురం, కొమ్మాది, గిడిజాల, గంగసాని అగ్రహారం
* మొత్తం 399 ఎకరాలు. ఇందులో ప్రభుత్వ, ప్రయివేట్ సహా అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి.
* లేఅవుట్గా అభివృద్ధి చేశాక 140 ఎకరాలను విక్రయించే అవకాశం.
* దబ్బందలో 38.8 ఎకరాలు, సౌభాగ్యరాయపురంలో 53.2, కొమ్మాదిలో 31.9, గిడిజాలలో 11.1, గంగసాని అగ్రహారంలో 5.3 ఎకరాల్లో స్థలాలను విక్రయించే వెసులుబాటు ఉంది.
* దబ్బందలో అభివృద్ధి చేసిన లేఅవుట్లో చదరపు గజం రూ. 7,200, సౌభాగ్యరాయపురంలో రూ. 10,800, కొమ్మాదిలో రూ. 18,000, గిడిజాలలో రూ. 7,200, గంగసాని అగ్రహారంలో రూ.13,500 ధరకు వెళ్లే అవకాశం ఉంది.
* వీటి విక్రయాల ద్వారా రూ. 765.20 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో లేఅవుట్ అభివృద్ధి కోసం రూ. 120.40 కోట్లు ఖర్చయినా, వుడాకు రూ. 644.80 కోట్లు మిగులుతుంది.
* ప్రతిపాదించిన భూముల పరిశీలన తరువాత ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు ఉన్న గిరాకీ, ధరలను విశ్లేషించాక వుడాకు ఆశించిన ఆదాయం వస్తుందని నిపుణుల బృందం అంచనా వేసింది.
కలెక్టర్ అనుమతి తీసుకున్నాకే…
భూ సమీకరణ కింద సేకరిస్తున్న భూములపై కలెక్టర్ ఆమోదం తీసుకున్నాకే అధికారిక ప్రకటన చేయాలని వుడా వర్గాలు భావిస్తున్నాయి. ప్రయివేట్, ప్రభుత్వ భూముల వరకు ఇబ్బంది లేకపోయినా, అసైన్డ్ భూములపై కలెక్టర్ అనుమతి తప్పనిసరి. నిరుపేదలకు సేద్యం నిమిత్తం ఇచ్చిన ఈ అసైన్డ్ భూములను సక్రమంగా వినియోగించకపోయినా, ప్రభుత్వ అవసరాలకు తప్పనిసరి అయినపుడు తిరిగి వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. వీటిపై కలెక్టర్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ తీసుకున్నాకే తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
పరిహారం ఇలా ఉండొచ్చు….
సమీకరించిన భూములపై పరిహారం చెల్లింపుపైనా వుడా ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వుడా పాలకవర్గ సమావేశ దృష్టిలో కూడా పెట్టి అభిప్రాయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి.
* ప్రభుత్వ భూములపై కలెక్టర్ అనుమతితో ఎలియనేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ఆమోదం లభించాక ప్రభుత్వ సూచనపై వుడా డబ్బు చెల్లిస్తుంది. దీంతో హక్కులు వుడాకు దఖలు పడతాయి.
* ప్రయివేట్ భూములపై సేవా రుసుం, లేఅవుట్ అభివృద్ధికి అయ్యే ఖర్చులు పోగా, ఎకరాకు 1300 నుంచి 1400 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలాన్ని రైతులకు కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో 1800 చదరపు గజాల వరకు ఇచ్చినా పెరిగిన లేవుట్ అభివృద్ధి ఖర్చులు, సేవా రుసుంను దృష్టిలో పెట్టుకొని తగ్గిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
* అసైన్డ్ భూములపై సంబంధిత రైతులకు లేఅవుట్లో 900 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది. గతంలో ఇంకా ఎక్కువే ఇచ్చినా.. నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రాథమికంగా ఈ నిర్ణయాన్ని తీసుకునే వీలుంది.
వుడా జాగ్రత్తలు
పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి వుడా చేపట్టిన భూసమీకరణ ప్రాజెక్టులో అక్రమాల కారణంగా అంచనాలు తల్లకిందులయ్యాయి. జోన్ వ్యాలీ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీంతో అటు సీబీఐ, ఇటు సీఐడీ రంగంలోకి దిగాయి. అందుకే ఈసారి అధికారులు జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు.