News

Realestate News

విస్తరణ @120 అడుగులు

విస్తరణ @120 అడుగులు
అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ
120 అడుగులకు విస్తరించాలని ప్రభుత్వ నిర్ణయం
తొలగిన సందిగ్ధత
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:
అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ 120 అడుగుల మేర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అనకాపల్లి ఆర్డీవో, ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. 12 కిలోమీటర్ల మేర చేపట్టబోయే విస్తరణ పనులు 100 అడుగులే చేపట్టాలని గతంలో స్థానికులు కోరడంతోపాటుగా సర్వేచేయడానికి వెళ్లిన వారిని అడ్డుకునే పరిస్థితి నెలకొనడంతో దీనిపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఇక్కడి వాసులు కోరుతున్న 100 అడుగుల విషయాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 120 అడుగుల రహదారి విస్తరణ చేపట్టాల్సి ఉందని చెప్పడంతో ఈమేరకు సర్వే చేపట్టడానికి అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. అచ్యుతాపురంలో సెజ్‌ ఏర్పాటుతో వచ్చిన పరిశ్రమలతో అనకాపల్లి-అచ్యుతాపురం రహదారికి చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఇరుగ్గా ఉన్న ఈ రహదారి విస్తరణ పనులు చేపడతామని సెజ్‌ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం చెప్పింది. అచ్యుతాపురంలో చాలావరకు ఇప్పటికే పరిశ్రమలు వెలిశాయి. దీంతో ఈ రహదారిలో భారీగా వాహనాల సంఖ్య పెరగడంతో రద్దీ ఏర్పడింది. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళ్లే దారిలో నాగులాపల్లి, ఒంపోలు, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, కొండకర్ల కూడలి, చోడపల్లి, అచ్యుతాపురం గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి వెళ్తున్న రహదారి విస్తరణలో భాగంగా కోల్పోనున్న ఇళ్లు, భూముల నష్టపరిహారంపై 2016 మే నెలలో అంచనాలు వేశారు. దీని ప్రకారం రోడ్డు విస్తరణ కోసం అనకాపల్లి ఆర్డీవో పరిధిలో సర్వేజరిపారు. 212 ఇళ్లతో పాటుగా, 125 నిర్మాణాలు పాక్షికంగా, 140 పాకలు, గుడిసెలు, షెడ్డులు, 44 కాంపౌండ్‌ గోడలు పోతాయని అంచనా వేశారు. 120 అడుగుల మేర విస్తరణ కోసం వీరు సర్వేచేస్తుండగా 100 అడుగులు సరిపోతాయని స్థానికులు కోరడంతో ఈ పనులు ఆగాయి. విస్తరణ ఎంత మేర చేపట్టబోతున్నారు అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గత ఏడాది నుంచి ఈ పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కచ్చితంగా 120 అడుగుల మేర రహదారిని విస్తరించాలని చెప్పడంతో సర్వేపనులు చేపట్టడంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు.

రూ.156 కోట్లతో అంచనా..
విస్తరణ పనుల్లో భాగంగా ఆస్తులు, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించడానికి రూ.156 కోట్లు అవసరమని గత ఏడాది అంచనా వేశారు. సర్వే జరిపి నివేదిక ప్రభుత్వానికి పంపారు. తిరిగి సర్వే చేపట్టనుండటంతో ఈ అంచనా పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. 120 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా కోల్పోయే ఆస్తులు, భవనాల వివరాలతోపాటుగా ప్రభుత్వ భూమికి సంబంధించిన సమగ్ర వివరాలను పంపించాలని ప్రభుత్వం నుంచి అనకాపల్లి ఆర్డీవో కార్యాలయానికి ఆదేశాలు అందాయి.

సర్వే బృందాలతో పరిశీలన
అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రీ సర్వేచేసి నివేదిక పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ప్రత్యేక బృందాలతో 12 కిలోమీటర్ల మేర 120 అడుగులు విస్తరించేందుకు నివేదిక పంపుతాం. భూములు, భవనాలు, పాకలు, షెడ్డులు కోల్పోయే వారి వివరాలతోపాటుగా వారికి అందించే నష్టపరిహారంపై సమగ్ర జాబితా తయారుచేసి పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. సర్వేయర్‌లను బృందాలుగా వేసి వారితో వీలైనంత త్వరగా ఈ పనులు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం.

– వి.సూర్యకళ, అనకాపల్లి ఆర్డీవో

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo