News

Realestate News

విశాఖ వెలుగు

విశాఖ వెలుగు
విద్యుత్తు సంస్కరణల్లో సత్ఫలితాలు
రెండు అంశాల్లో జాతీయ స్థాయిలో మొదటిస్థానం
సేవల్లో మెరుగుదలకు మరిన్ని చర్యలు
ఈనాడు – విశాఖపట్నం
విద్యుత్తు సమస్యా… ఇచ్చిన గడువులోగా పరిష్కారమవుతోంది..కొత్త కనెక్షన్‌ కావాలా.. పెండింగ్‌ అనే మాటే లేదు..విశాఖలో తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ వ్యవస్థ విజయమిది. సంస్కరణల అమలు.. ఫలితాల సాధనలో కొత్త పుంతలు తొక్కుతోంది. తద్వారా జాతీయ స్థాయిలో విశాఖ పతకాన్ని రెపరెపలాడిస్తోంది. విద్యుత్తు వ్యవస్థ పరంగా విశాఖ నగరం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా పరుగులు పెడుతోంది.

ప్రజల జీవన ప్రమాణాల గణనలో విద్యుత్తు సేవలే కీలకం. అందుకే జాతీయస్థాయిలో విద్యుత్తు సంస్కరణలు భారీస్థాయిలో అమలవుతున్నాయి. సేవల్లో నాణ్యత పెంచడం, సరఫరాలో అడ్డంకులను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర విద్యుత్తు శాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. డిస్కమ్‌లు, నగరాలు, పట్టణాల మధ్య పోటీ పెడుతోంది. ఇలా దేశవ్యాప్తంగా 1405 నగరాలు, పట్టణాలను ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీం (ఐపీడీఎస్‌) కింద ఆధునికీకరిస్తోంది. ఇందులో 97 శాతం నగరాలు, పట్టణాలను ఆన్‌లైనీకరించి పోటీ పెడుతోంది.

ఆకట్టుకునే అంశాలివి..
ఐపీడీఎస్‌లో భాగంగా విద్యుత్తు పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలి. ఫీడర్‌, మీటర్‌ స్థాయిలో పంపిణీలో నాణ్యత ఉండాలి. ఈ వివరాలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇవన్నీ వినియోగదారులకు తెలిసేలా ‘అర్బన్‌ జ్యోతి అభియాన్‌ – ­ర్జా’ పేరిట ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

నెం 1 మనదే…
ఫిర్యాదుల పరిష్కారంలో జాతీయ స్థాయిలో గత జనవరి నుంచి జూన్‌ నెల వరకు విశాఖ నగరమే ప్రథమ స్థానంలో నిలిచింది.

* విద్యుత్తు ఫిర్యాదుల్ని సకాలంలో పరిష్కరించాలంటే కత్తిమీద సామే. నగరంలో వినియోగదారుడు నిరుత్సాహపడకుండా ఫిర్యాదులు పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దాని ఫలితమే జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు.

* ఈపీడీసీఎల్‌కు ప్రతీ నెలా 10 వేలకు పైగానే ఫిర్యాదులందుతున్నాయి.
* జూన్‌లో 11,713 ఫిర్యాదులొస్తే.. వీటిని సకాలంలో పరిష్కరించి కేంద్రానికి నివేదికలిచ్చారు.
* 1912 హెల్ప్‌లైన్‌, ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం, ఆన్‌లైన్‌, మీ సేవ ద్వారా అందుకున్న ఫిర్యాదులు ఇలా అన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నట్టు అధికారులు వివరించారు.

మీటరు పెట్టేస్తారంతే..
విద్యుత్తు కనెక్షన్ల మంజూరు, మీటర్లను అమర్చడంలో కూడా గత జనవరి నుంచి జూన్‌ వరకు విశాఖ నగరం జాతీయస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది.

* ఇళ్లు, పారిశ్రామిక నిర్మాణాల పరంగా నగరంలో కొత్త కనెక్షన్లకు గిరాకీ ఎక్కువ. వీటిని సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ఈపీడీసీఎల్‌ది. ఈ విభాగంలోనూ జాతీయస్థాయిలో విశాఖ 1వ ర్యాంకులో తిరుగులేకుండా కొనసాగుతోంది.
* జూన్‌లో 2,491 కనెక్షన్లను పెండింగ్‌ ఉంచకుండా పూర్తి చేశారు.
* దరఖాస్తులను మీ-సేవా కేంద్రాల ద్వారా తీసుకుంటున్నారు. ఇళ్ల కనెక్షన్లు కావాలంటే ఇక్కడే దరఖాస్తు చేయాలి.
* ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా పరిశ్రమలకు వేగంగా కనెక్షన్లు ఇస్తున్నారు.

నష్టాల్ని గట్టెక్కిస్తూ..
మాసం – విద్యుత్తు నష్టాలు తగ్గించడంలో ర్యాంకు
జనవరి – 7
ఫిబ్రవరి – 4
మార్చి – 4
ఏప్రిల్‌ – 2
మే – 2
జూన్‌ – 1

విద్యుత్తు నష్టాల్ని నివారించడంలో దేశంలోనే ఈపీడీసీఎల్‌ మొదటిస్థానంలో కొనసాగుతోంది. విశాఖ నగరంలో మాత్రం బాగా శ్రమించాల్సి ఉంది. కారణం.. తీగల మార్పు విషయంలో సంస్కరణలు తేవాల్సి ఉంది.

* ప్రస్తుతం నగరంలో విద్యుత్తు నష్టాలు 4.1 శాతం. ఇది జాతీయస్థాయిలోనే అత్యంత మెరుగైందిగా కేంద్ర విద్యుత్తుశాఖ ప్రకటించింది.
* ఈపీడీసీఎల్‌ విద్యుత్తు సరఫరా నష్టం సగటు జూన్‌లో 7.3 శాతంగా ఉంది. డిస్కం సగటు కన్నా విశాఖ నగరం మెరుగ్గా ఉంది.
* ఈ ఏడాది జనవరిలో సరఫరా నష్టం 4.41 శాతం. అప్పట్లో జాతీయస్థాయి ర్యాంకులో వెనకబడి ఇప్పుడు పుంజుకుంది.
* సరఫరా నష్టాలు, చౌర్యాన్ని తగ్గించడానికి అధికారులు ఫీడర్‌స్థాయిలో ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నారు.
* మరికొన్నాళ్లలో నగరంలోని 20 సబ్‌స్టేషన్ల పరిధిలో స్కాడా విధానం ద్వారా విద్యుత్తు పంపిణీ, నాణ్యతను మరింత క్షుణ్ణంగా పరిరక్షించనున్నారు.

గతేడాది వరకు ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపులు బాగా తక్కువగానే ఉన్నాయి. గత వేసవిలో కేవలం 3.04 శాతం మాత్రమే నమోదయ్యాయి. ఇప్పుడు 27.7 శాతానికి చేరింది. ఏడాదిలో 24 శాతానికి మించిన ప్రగతిని సాధించడం గొప్ప విషయమే. అయినా విశాఖ కన్నా కొన్ని నగరాలు ఇంకా ముందందజలో ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ 68వ ర్యాంకులో కొనసాగుతోంది.

* తాజాగా ఈపీడీసీఎల్‌ 5 జిల్లాల్లో జూన్‌లో ఆన్‌లైన్‌ చెల్లింపులు 20.6 శాతంగా నమోదయ్యాయి. పేటీఎంతో పాటు ఇంటింటికీ తిరిగి బిల్లులు కట్టించుకునే విధానం, ఎక్కడికక్కడ బిల్లింగ్‌ ఏజెంట్లను పెట్టడం, ఏటీఎం తరహాల్లో బిల్లు చెల్లింపుల వంటి సంస్కరణలతో మరింత మెరుగుదల కనిపిస్తోంది.

నగరంలో ఓవర్‌లోడ్‌ సమస్య బాగా ఉంది. ఈ వేసవిలో కొన్ని అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు వినియోగించినా ఒత్తిడి తగ్గింది. పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. జూన్‌లో నగరంలో రోజుకు సగటున 1.49 గంటలసేపు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. డిస్కం పరిధిలో అయితే ఇది 3.34 గంటలుగా కొనసాగుతోంది.

* రోజువారీ విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించడంలోనూ మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది.
* ఒక్క నిమిషం విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా జనం భరించే పరిస్థితి లేదు.
* 24×7 విద్యుత్తు సరఫరా అంటున్నా.. క్షేత్రస్థాయిలో ఓవర్‌లోడ్‌ సమస్యలు వేధిస్తున్నాయి.
* నగరంలో రోజుకు 1 నుంచి 3 సార్లు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
* జూన్‌లో రోజువారీ అంతరాయాల సగటు 1.7 గంటలుగా ఉంది. డిస్కం పరిధిలో అయితే ఇది 4.9గా కొనసాగుతోంది.
* గత వేసవితో పోల్చితే ఈసారి వేసవిలో బ్రేక్‌డౌన్ల తక్కువే.

ఇక్కడ రోజుకు 5 సెకన్లే కోత..!
పట్టణం: కోపర్‌గావ్‌, రాష్ట్రం: మహారాష్ట్ర
ఈ పట్టణంలో విద్యుత్తు కోతలు చాలా అరుదుగా ఉంటున్నాయి. జూన్‌లో రోజువారీ కరెంటు పోయిన సమయం సగటున కేవలం 5 సెకన్లు మాత్రమే అంటే.. దాదాపుగా విద్యుత్తుకోత లేనట్టే. ఈ విషయంలో కోపర్‌గావ్‌ దేశంలోనే మొదటిర్యాంకులో నిలిచింది.

ఇదెలా సాధ్యమైందని అక్కడి విద్యుత్తు శాఖ అదనపు పర్యవేక్షకుడు మహాజన్‌ను ‘ఈనాడు’ ప్రశ్నించింది. దీనికి ఆయనిచ్చిన సమాధానం… ‘విద్యుత్తు అంతరాయం లేకుండా పట్టణంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చెట్ల కొమ్మలను కత్తిరించడం దగ్గరనుంచి ఓవర్‌లోడ్‌ అవకుండా ట్రాన్స్‌ఫార్మర్లు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’.

సగం పట్టణమంతా నగదు రహితమే!
రు: పరమకుడి, రాష్ట్రం: తమిళనాడు
సుమారు 2 లక్షల జనాభా ఉన్న పట్టణమిది. ఇక్కడ సగం వినియోగదారులు తమ విద్యుత్తు బిల్లుల్ని పూర్తిగా నగదు రహితం చేసేశారు. తాజాగా జూన్‌లో మొత్తం విద్యుత్తు చెల్లింపుల్లో 49.35 శాతం ఈ పట్టణం నుంచి నగదురహితంగానే వచ్చాయి. అందుకే జాతీయస్థాయిలో మొదటిర్యాంకు సాధించింది.

మరింత శ్రమించాల్సిన బాధ్యత ఉంది..
– టి.వి.సూర్యప్రకాష్‌, ఎస్‌ఈ, విశాఖ
శాఖపరంగా నగరాన్ని ముందుంచడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాయి. కార్పొరేట్‌ కార్యాలయం నుంచి నగరం మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. గతంతో పోల్చితే.. ప్రతీ విభాగంలోనూ నగరం గణనీయమైన మెరుగుదల సాధించింది. విద్యుత్తు అంతరాయాలు, ఆన్‌లైన్‌ పేమెంట్ల పరంగా మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్తలూ తీసుకుంటాం.